Nizamabad News : ఇందూరు అర్బన్ టికెట్ కోసం బీజేపీలో ట్రయాంగిల్ ఫైట్, ఛాన్స్ ఎవరికో?
Nizamabad News : నిజామాబాద్ ఇందూరు అర్బన్ టికెట్ గురించి బీజేపీ లో ట్రయాంగిల్ ఫైట్ నడుస్తోంది. ఎవరికి వారే టికెట్ తమేకే వస్తుందన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి నుంచే ఎమ్మెల్యే టికెట్ కు ప్లాన్ వేస్తున్నారు.
Nizamabad News : నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం బీజేపీలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇందూరు అర్బన్ లో బీజేపీకి మంచి పట్టుంది. గత కార్పొరేషన్ ఎన్నికల్లో అనూహ్యంగా 28 కార్పొరేటర్లు బీజేపీ నుంచి గెలిచారు. గతంలో మున్సిపాలిటీ ఉన్న సమయంలో రెండు సార్లు బీజేపీ నుంచి చైర్మన్లుగా డాక్టర్ భారతి రాణి, ముక్క దేవేందర్ గుప్తా ఎన్నికయ్యారు. అలాగే రెండు సార్లు బీజేపీ నుంచి యెండల లక్ష్మీనారాయణ ఎమ్మెల్యేగా గెలిచారు. 2023 సాధారణ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా నిజామాబాద్ అర్బన్ బీజేపీలో టికెట్ తమకంటే తమకంటూ ఆ ముగ్గురు నేతలు ధీమాగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.
గత ఎన్నికల్లో మూడో స్థానం
అయితే గత ఎన్నికల్లో బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ పోటీ చేసి ఓడిపోయారు. ఆ సమయంలో బీజేపీ టికెట్ సూర్య నారాయణ గుప్తాకు వస్తుందన్న ప్రచారం జోరుగా సాగింది. చివరి నిమిషంలో యెండలకు టికెట్ ఖరారైంది. అయితే బీజేపీ అభ్యర్థి ముూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అప్పట్లో సూర్యనారాయణ గుప్తాకు పార్టీ పెద్దలు నచ్చజెప్పటంతో కామ్ గా ఉన్నారు. అతని అర్బన్ ఇంఛార్జ్ గా బాధ్యతలు అప్పచెప్పారు. ఈ సారి ఎలాగైనా టికెట్ తనకే వస్తుందన్న ధీమాతో సూర్యనారాయణ గుప్త అర్బన్ లో పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా ఉంటున్నారు. ఏ కార్యక్రమమైనా ముందుండి నడిపిస్తున్నారన్న చర్చ ఆ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. సూర్య నారాయణ గుప్తా అనుచరులు మాత్రం టికెట్ తమ నాయకుడికే వస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సూర్యనారాయణకు అర్బన్ టికెట్ ఇస్తే కచ్చితంగా గెలుస్తారని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా అధ్యక్షుడు కూడా ఆసక్తి
మరోవైపు మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ కూడా ఈసారి తనకే టికెట్ దక్కుతుందన్న ధీమాలో ఉన్నారని అతని అనుచరులు చెప్పుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఓటమి చవిచూసిన యెండల ఈ సారి టికెట్ ఇస్తే ఎలాగైనా గెలుస్తానన్న హోప్ లో ఉన్నారని అంటున్నారు. యెండల కూడా అర్బన్ లో సందర్భం వచ్చినప్పుడల్లా ప్రెస్ మీట్ లు పెడుతున్నారు. మరోవైపు బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీనర్సయ్య కూడా అర్బన్ పైనే ఆశలు పెట్టుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఉన్న తనకు ఎమ్మెల్యే టికెట్ వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ముగ్గురు నేతలు ఎవరికి వారే అర్బన్ బీజేపీ టికెట్ పై ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ ముగ్గురు నేతల అనుచరులు ఎవరికి వారే తమ నేత కంటే తమ నేతకు అర్బన్ బీజేపీ టికెట్ వస్తుందన్న ధీమాతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.