Nellore YSRCP : నెల్లూరు వైఎస్ఆర్‌సీపీలో నివురు గప్పిన నిప్పులా అసంతృప్తి - ఎప్పుడేమి జరుగునో !
ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో వైసీపీ పరిస్థితి ఏంటి..? అలకలున్నాయా.? అసంతృప్తులున్నారా..? అసలేం జరుగుతోంది. .?
2019 ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి 10కి 10 అసెంబ్లీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. జిల్లా పరిధిలోని రెండు పార్లమెంట్ స్థానాలు కూడా వైసీపీవే. ఆ ఘన విజయం తాలూకు జ్ఞాపకాలన్నీ మూడేళ్ల తర్వాత అలాగే ఉన్నాయా..? ప్రస్తుతం జిల్లాలో వైసీపీ పరిస్థితి ఏంటి..? అలకలున్నాయా.? అసంతృప్తులున్నారా..? అసలేం జరుగుతోంది.
ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్‌సీపీలో నివురు గప్పిన నిప్పులా అసంతృప్తి
ప్రతిపక్షంలో ఉండగా నెల్లూరు జిల్లా వైఎస్ఆర్‌సీపీలో నేతలంతా కలసిమెలసి ఉన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవులు వారిమధ్య చిచ్చుపెట్టాయి. తొలి విడతలో యువనేతలు అనిల్ కుమార్ యాదవ్, గౌతమ్ రెడ్డికి మంత్రి పదవులు రావడంతో సీనియర్లు రగిలిపోయారు. ఆనం రామనారాయణ రెడ్డి, వైసీపీ పుట్టుకనుంచి పార్టీతోనే ఉన్న నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అసంతృప్తికి గురయ్యారు. ఆ తర్వాత చాలా మీటింగుల్లో ఆనం రామనారాయణ రెడ్డి బహిరంగంగానే తన అసంతృప్తి వెళ్లగక్కారు. ధిక్కార స్వరం వినిపించారు. ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. కనీసం రెండో దఫా అయినా తనకు మంత్రి పదవి వస్తుందని ఆశించినా అది కూడా నెరవేరలేదు. తనతోపాటు వైఎస్ఆర్ కేబినెట్ లో మంత్రి పదవులు చేపట్టిన బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు వంటి వారికి ఛాన్స్ లు ఇచ్చిన జగన్, తనని మాత్రం పక్కనపెట్టడాన్ని ఆనం జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఆయన పరిస్థితులతోపాటు సర్దుకుపోతున్నారు. ప్రస్తుతం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో దూసుకెళ్తున్నారు ఆనం.
మంత్రి పదవులపై ఆశలు రెండో దశలోనూ గల్లంతు
రెండో దఫా కాకాణి గోవర్దన్ రెడ్డి ఒక్కరికే నెల్లూరు జిల్లానుంచి మంత్రి పదవి దక్కింది. దీంతో సహజంగానే మరోసారి విభేదాలు బయటపడ్డాయి. మంత్రిగా కాకాణి నెల్లూరు జిల్లాలో కాలుమోపే వేళ ఫ్లెక్సీలు చినగడంతో గొడవలు మొదలయ్యాయి. చివరకు తాడేపల్లిలో కాకాణి, అనిల్ ఇద్దరినీ కూర్చోబెట్టి జగన్ పంచాయితీ చేశారు. చేయి చేయి కలిపినా, ఇప్పటికీ వారిద్దరూ కలసిపోయారంటే జనం నమ్మే పరిస్థితి లేదు.
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అసంతృప్తి భిన్నం !
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. కనీసం రెండోసారి అయినా పదవి వస్తుందనుకున్నా అది కాకాణికి వెళ్లిపోయింది. దీంతో శ్రీధర్ రెడ్డి మద్దతుదారులు ఆందోళన చేపట్టారు, శ్రీధర్ రెడ్డి కూడా కన్నీటిపర్యంతమయ్యారు. అక్కడితో ఆ ఎపిసోడ్ ఆగిపోయింది. ఆ తర్వాత మళ్లీ శ్రీధర్ రెడ్డి గడప గడప కార్యక్రమంలో చురుగ్గా పార్గొంటున్నారు. పార్టీతో సర్దుకుపోయారు.
నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సైలెంట్ !
నెల్లూరు జిల్లాలో రాజకీయ వారసత్వం మెండుగా ఉన్న నల్లపురెడ్డి కుటుంబాన్నుంచి వచ్చిన ప్రసన్న కుమార్ రెడ్డి వైసీపీలో విజయమ్మ తర్వాత రెండ ఎమ్మెల్యే తానేనని చెప్పుకుంటారు. పార్టీ పుట్టినప్పటినుంచి ఉన్న తనను కాదని మిగతావారికి పదవులివ్వడంతో ఆయన మనసు కష్టపెట్టుకున్నారు. ఆ తర్వాత గడప గడప కార్యక్రమంలో అలసత్వం వహిస్తున్నారంటూ జగన్ క్లాస్ తీసుకునే సరికి మరింత నొచ్చుకున్నారు. తాజాగా ఆయన పార్టీ మారుతున్నట్టు వార్తలు రావడంతో వెంటనే రియాక్ట్ అయ్యారు. తాను జీవితాంతం జగన్ తోనే ఉంటానని చెప్పారు. అదే సందర్భంలో మిగతావాళ్ల లాగా మంత్రి పదవి రాలేదని తాను జగన్ దిష్టిబొమ్మలు తగలబెట్టలేదని, అలాంటి పనులు తానెప్పుడూ చేయనని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. దీంతో జిల్లా రాజకీయాల్లో మరోసారి కలకలం రేగింది.
మిగతావారి సంగతేంటి..?
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇక మిగతా ఎమ్మెల్యేల విషయానికొస్తే ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి 2024లో టికెట్ ఇవ్వకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. సొంత అన్న మాజీ ఎంపీ రాజమోహన్ రెడ్డితో ఆయనకు విభేదాలున్నాయి. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో కూడా విక్రమ్ రెడ్డి గెలుపుకోసం ఆయన ఒక్కరోజు కూడా ప్రచారానికి రాలేదు, పూర్తిగా ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉన్నారు. గూడూరు, సూళ్లూరుపేట ఎమ్మెల్యేలు.. ఎస్సీ కోటాలో మంత్రి పదవులు ఆశించినా దక్కలేదు, అయినా వారెప్పుడూ ధిక్కార స్వరం వినిపించలేదు. ఇక కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి బెంగళూరు వ్యాపారాలు, ఇతర విషయాల్లో జగన్ కి అత్యంత సన్నిహితుడు. ఆయనకు మంత్రి పదవి ఆశ లేదు, జగన్ కి దూరం జరగాలనే ఆలోచన లేదు. ప్రస్తుతానికి ఆనం సైలెంట్ గానే ఉన్నారనుకున్నా, ప్రసన్న సర్దుకుపోయారనుకున్నా, శ్రీధర్ రెడ్డి తన పని తాను చేసుకుంటున్నారని అనుకున్నా... 2024నాటికి ఎలాంటి పరిణామాలు జరుగుతాయో తెలియదు.