YS Viveka Case Impact : వివేకా హత్య కేసులో మనీలాండరింగ్ కోణం - మరిన్ని మలుపులు తిరగడం ఖాయమా ?
వివేకా హత్య కేసులో మనీలాండరింగ్ కోణం ?రూ. 40 కోట్ల సుపారీ చేతులు మారిందంటున్న సీబీఐరూ. కోటి ఇచ్చారంటున్న దస్తగిరిఎవరు ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు?కేసు చిక్కు ముడి సాక్ష్యాలతో సహా విడిపోతుందా ?
YS Viveka Case Impact : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ వివేకానందరెడ్డి కేసు కీలక మలుపులకు కారణం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కేసు ఇంతటితో ఆగదని.. ఇంకా పలువురు ప్రముఖులకు సీబీఐ నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం ఊపందుకుంటోంది. అదే సమయంలో సీబీఐ ఈ హత్య ఘటనలో రూ. 40 కోట్ల సుపారీ చేతులు మారిందని ఆరోపిస్తోంది. అప్రూవర్ గా మారిన దస్తగిరి తనకు రూ. కోటి అందాయని చెబుతున్నారు. సునీల్ యాదవ్ కూ రూ. కోటి అందాయని సీబీఐ అధికారులకు ఆధారాలు లభించాయి. అసలు ఈ సొమ్మంతా ఎక్కడిదనే అంశంపై ఇప్పుడు సీబీఐ అధికారులు కూపీ లాగుతున్నారు. త్వరలో ఈడీ కూడా రంగంలోకి దిగవచ్చని చెబుతున్నారు.
ఆర్థిక లావాదేవీల దగ్గరకు చేరిన వివేకా హత్య కేసు
వైఎస్ వివేకానందరెడ్డి హత్య పూర్తిగా వ్యక్తిగత కక్షలతో సాగిందని వివాహేతర బంధాల కారణంగానే జరిగిందని అవినాష్ రెడ్డి గట్టిగా వాదిస్తున్నారు. అయితే హత్యలో పాల్గొన్న వారికి పెద్ద ఎత్తున డబ్బులు సమకూర్చారు. అది కూడా రూ.కోట్లలోనే. రూ. 40 కోట్ల డీల్ జరిగిందన్న విషయం బయటపడింది. కేవలం మాటల్లోనే కాదు ఈ నగదు చేతులు మారిందని చెబుతున్నారు. ఇంత పెద్ద మొత్తంలో సుపారీ ఇచ్చి మరీ వైఎస్ వివేకాను చంపించాల్సిన అవసరం ఏమిటనేది ఇప్పుడు కీలకంగా మారింది. దస్తగిరి తనకు రూ. కోటి అందాయని చెబుతున్నారు. సీబీఐ అధికారులు ఎవరి వద్ద నుంచి అందాయి.. .ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకు వచ్చారు ? అనేది బయటకు లాగుతున్నారు. ఈ డబ్బులు ఎవరు ఇచ్చారని తేలితే వారే సూత్రధారులు. అక్కడ బయటపడటానికి మరో మార్గం ఉండదు.
ఈడీ రంగంలోకి దిగితే కేసులో మరిన్ని కోణాలు బయటపడే అవకాశం
తెలంగాణలో టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో కొన్ని లక్షల రూపాయలు చేతులు మారాయని ఫిర్యాదు రాగానే ఈడీ కేసు నమోదు చేసింది. సొంతంగా ఈసీఐఆర్ నమోదు చేసి విచారణ ప్రారంభించింది. నిందితుల్ని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తోంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఈడీకి సీబీఐ అధికారులు మనీ లాండరింగ్ వివరాలు ఇచ్చి ఉంటారని అంచనా వేస్తున్నారు. రేపోమాపో ఈడీ రంగంలోకి దిగే అవకాశం ఉంది. చేతులు మారిన డబ్బును ఎలా సమీకరించారు..ఎవరు తీసుకు వచ్చారు... ఎవరికి ఇచ్చారు..అనేది ఈడీ తేల్చేస్తే.. అసలు నిందితులెవరో స్పష్టత వస్తుంది. ఈ దిశగా ఇప్పటికే ఈడీ అంతర్గత దర్యాప్తు జరుగుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
కేసును వేగంగా తేల్చాలన్న లక్ష్యంతో సీబీఐ
సీబీఐ వైఎస్ వివేకా హత్య కేసును వీలైనంత వేగంగా తేల్చాలని అనుకుంటోంది. నిందితులు ఎన్ని పిటిషన్లు వేస్తున్నా.. సాంకేతిక ఆధారాలతో అన్నింటినీ కోర్టు ముందు పెట్టి నిందితులకు శిక్ష పడేలా చేయాలని లక్ష్యంతో ఉంది. నిజానికి ఈ కేసు సీబీఐకి ఓ చాలెంజ్ లాంటిది. సీబీఐపై ఎన్నో రకాల ఒత్తిళ్లు వచ్చాయి. అన్నింటినీ తట్టుకున్నారు. సాక్ష్యాలతో సహా నిందితుల్ని కోర్టు ముందు శిక్షపడేలా చేస్తే.. సీబీఐ విశ్వసనీయత మరింత పెరుగుతుంది. కేసు విచారణ ఇప్పటికే ఆలస్యం అయింది. అందుకే సుప్రీంకోర్టు విధించిన గడువులోపల విచారణ పూర్తి చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా కీలకమైన వ్యక్తులకూ నోటీసులు జారీ చేసే అవకాశాలు ఉన్నాయి.