Freebies Politics : బీజేపీపై విపక్షాల ఉచితాల అస్త్రం - మోదీ విధానాన్ని మార్చుకుంటారా ?
మోదీ ఉచిత హామీలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కానీ విపక్ష పార్టీలు పెద్ద ఎత్తున అవే హామీలతో ఎన్నికలకు వెళ్తున్నాయి. మరి బీజేపీ ఇప్పుడేం చేస్తుంది ?
Freebies Politics : దేశ రాజకీయాల్లో ఇటీవలి కాలంలో ఎప్పుడూ లేనంతగా ఉచితాలపై రాజకీయ చర్చ జరిగింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉచితాల కారణంగా దేశం నష్టపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ అంశంపై సుప్రీంకోర్టులో కూడా విచారణ జరిగింది. ఏది ఉచితం..? ఏది సంక్షేమమో తేల్చాలని సుప్రీంకోర్టు కమిటీని నియమించింది. ఇది తేలే అంశం కాదని చాలా మంది భావిస్తున్నాయి. అియేతరాజకీయ పార్టీలు ఇప్పుడు ఉచితాలతోనే బీజేపీకి చెక్ పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నాయి.వరుసగా ఓటర్లకు తాయిలాలు ప్రకటిస్తున్నాయి. అయితే ఉచితాలకు వ్యతిరేకం అయిన మోదీ వారికి పోటీగా ఆఫర్లు ఇవ్వలేరు. అందుకే ఇప్పుడు విపక్షాల ఉచితాల ప్రకటనలకు.. మోదీ కౌంటర్ ఎలా ఇవ్వగలరనేది ఆసక్తికరంగామారింది.
బీజేపీ హవాను తగ్గించడానికి ఉచిత హామీలిస్తున్న పార్టీలు !
కేంద్రంలో అయినా రాష్ట్రాల్లో అయినా మోడీని ఓడించాలంటే ఉచితాలను మించిన బ్రహ్మాస్త్రం లేదని కాంగ్రెస్ సహా ఇతర పార్టీలన్నీ దాదాపుగా నిర్ణయానికి వచ్చాయి. దేశంలో ఇప్పుడు బీజేపీకి.. ఇతర పార్టీలకు మధ్య పోటీ జరుగుతోందని ఎవరూ అనుకోవడం లేదు. మోడీకి ితర పార్టీలకు మధ్య పోటీ జరుగుతోంది. ఆయనను ఢీ కొట్టే నేత లేరు. అందుకే అన్ని పార్టీలు రాష్ట్రాలు.. కేంద్ర స్థాయిల్లో ఉచితాల వరద పారించి మోడీని కట్టడి చేయాలనుకుంటున్నాయి. గుజరాత్‌లో రాహుల్ ఉచితాల హామీలను తెరపైకి తెచ్చారు. రూ. ఐదు వందలకు గ్యాస్ సిలిండర్‌తో ప్రారంభించి.. రైతులకు రూ. మూడు లక్షల రుణమాఫీతో పాటు లెక్కలేనన్ని ఉచిత పథకాలు ప్రకటించారు. ఇవి చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. గుజరాత్ ప్రజలకు ఇవి చాలా కొత్తవే. కాంగ్రెస్ ఈ ఉచితాల విషయంలో ఉదారంగానే ఉంటోంది. ఇతర రాష్ట్రాల్లోనూ ఈ హామీలిస్తోంది. జాతీయ స్థాయిలో ఇవే హామీలిస్తే.. సామాన్యుల్నీ ఆకట్టుకునే అవకాశం ఉంది.
రైతులకు ఉచిత విద్యుత్ హామీని ప్రకటించిన కేసీఆర్ !
రేపోమాపో జాతీయ పార్టీ ప్రారంభించబోతున్న కేసీఆర్ కూడా ఉచితాల ప్రకటనను ఘనంగా చేస్తున్నారు. ఆయన రైతువర్గాన్ని టార్గెట్ చేసుకున్నారు. తెలంగాణలో ఇస్తున్నట్లుగా దేసవ్యాప్తంగా ఉచిత విద్యుత్ ఇస్తామన ఆయన నిజామాబాద్‌లో ప్రకటించారు. తెలంగాణలో మాదిరి రైతు పథకాలు అమలు చేస్తున్నామని ఇప్పటికే చెబుతున్నారు. రైతులకు ఉచిత విద్యుత్ ఆకట్టుకునే హామీనే అయినాఆచరణ అసాధ్యమని బీజేపీ అంటోంది. అయితే రాజకీయాల్లో హామీలు ఇచ్చేట్పుడు ఎవరూ సాధ్యాసాధ్యాలను పరిశీలించరు.
ఉచితాల ప్రకటనలో ఆమ్ ఆద్మీ స్టైలే వేరు !
కొత్త రాజకీయం చేస్తామని వచ్చిన కేజ్రీవాల్ కూడా మోడీని కట్టడి చేయడానికి ఉచితాలే అస్త్రమనుకుంటున్నారు. పంజాబ్‌లో విద్యుత్ సంక్షోభం తీవ్రంగా ఉన్నా.. మూడు వందల వరకు యూనిట్ల వరకూ కరెంట్ ఉచితం అని ప్రకటించారు. అమలు ప్రారంభించారు. ఆమ్ ఆద్మీ చాలా వరకూ ఉచిత పథకాల హామీలిచ్చింది. అవన్నీ అమలు చేయాల్సి ఉంది. వాటినే ఇతర రాష్ట్రాల్లోనూ ఇస్తోంది. ప్రజలు తమ వైపు ఆకర్షితులయ్యేలా చూసేందుకు అన్ని ప్లాన్లు అమలు చేసుకుంటోంది. ఇటీవల ఉచితాలపై చర్చ జరిగినప్పుడు.. ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా స్పందించింది. పెద్దలకు వేల కోట్లు మాఫీ చేస్తారు..పేదలకు ఏమీ ఇవ్వకూడదా అనిప్రశ్నించింది.
పోటీగా ఉచిత పథకాల హామీలివ్వలేని స్థితిలో బీజేపీ
ప్రధాని మోడీ ఇటీవలికాలంలో ఉచితాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అలా చేయడం దేశానికి నష్టమంటోంది . అయితే విపక్షాలు మాత్రం ఎదురుదాడికి దిగి అవే హామీలిస్తున్నాయి. అదే ఇప్పుడు బీజేపీకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యేలా చేస్తున్నాయి. ఉచితాలపై తమ ప్రభుత్వం వ్యతిరేకత విధానంతో . . మోడీ స్వయంగా ప్రకటనలు చేసినందున కాంగ్రెస్, ఆప్ వంటి పార్టీలు ఇస్తున్న హామీలతో అవి మైలేజ్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు తన మాటలను కాదని.. మోదీ ఉచితాలను ప్రజలకు ప్రకటిస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది.అలా ప్రకటిస్తే విమర్శలు వచ్చే అవకాశం ఉంది.