MLA Kotamreddy Sridhar Reddy: పోలీసుల కళ్లుగప్పి ఆటోలో ర్యాలీకి చేరుకున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
ఎమ్మెల్యే కోటంరెడ్డి పోలీసుల కళ్ళు కప్పి నెల్లూరులో శాంతియుత ర్యాలీ ఆటోలో చేరుకున్నారు.
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ టీడీపీ, జనసేనా, సీపీఐ నాయకులు నెల్లూరులో శాంతియుత ర్యాలీ చేపట్టారు. నెల్లూరులోని వీఆర్సీ కూడలి నుంచి గాంధీ బొమ్మ కూడలి వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రామనారాయణరెడ్డి, నేతలు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, సునీల్ తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోరెత్తించారు.
అయితే తొలుత ర్యాలీకి అనుమతి లేదంటూ... ఉదయం నుంచి నెల్లూరులోని ముఖ్య నాయకులను పోలీసులు గృహనిర్బంధాలు చేశారు. రూరల్ ఎమ్మెల్యే కొటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కూడా గృహనిర్బంధం చేసే ప్రయత్నం చేశారు. మాగుంట లేఔట్ లో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని పోలీసులు చుట్టుముట్టారు. అయితే పోలీసుల రాకను పసిగట్టిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. బృందాలుగా ఏర్పడిన పోలీసులు ఆయన కోసం గాలించారు.
ఆటోలో ర్యాలీకి చేరుకున్న ఎమ్మెల్యే...
ఎలాగైనా సరే వీఅర్సీ కూడలికి వెళ్లాలని నిర్ణయించుకున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి చివరకు పోలీసుల కళ్ళు కప్పి ఆటోలో ర్యాలీ వద్దకు చేరుకున్నారు. కొన్ని నెలల నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి టీడీపీ కీలక బాధ్యతలు అప్పగించింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్‌గా నియమించారు. కోటంరెడ్డి అధికారికంగా టీడీపీలో చేరకపోయినా కొంతకాలంగా టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. లోకేష్ పాదయాత్రకు ముందు టీడీపీ నేతలు కోటంరెడ్డిని కలిశారు. టీడీపీలోకి రావాలని ఆయన్ను ఆహ్వానించారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్రను దగ్గరుండి చూసుకున్నారు. లోకేష్ పాదయాత్ర సందర్భంగా నిర్వహించిన సభలో కూడా కోటంరెడ్డి శ్రీధర్ పాల్గొన్నారు. అధికారికంగా పార్టీలో చేరకపోయినా సరే టీడీపీ అధిష్టానం ఆయనకు రూరల్ బాధ్యతల్ని అప్పగించింది. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అధికారికంగా టీడీపీలో చేరకపోయినా రూరల్ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైఎస్ఆర్ సీపీ నుంచి గత ఎన్నికల్లో ఎన్నికైన సంగతి తెలిసిందే. కొద్ది నెలల క్రితం పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీకి దగ్గరయ్యారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గతంలోనే టీడీపీలో చేరారు. అయితే, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర చేస్తున్న సమయంలో ఇద్దరు సోదరులు కలిసి కీలకంగా వ్యవహరించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో యువగళాన్ని విజయవంతం చేశారని మంచి పేరు పొందారు.
దీంతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పని తీరుకు సంతృప్తి చెందిన చంద్రబాబు ఆయనను పార్టీ ఇన్‌చార్జిగా నియమించారని అంటున్నారు. ర్యాలీకి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రావడంతో టీడీపీ కి పూర్తిగా మద్దతు ఇచ్చినట్లు వ్యక్తం అయింది. ఎమ్మెల్యే కోటంరెడ్డి గత కొన్ని నెలల నుంచి అటు అధికార పార్టీకి, ఇటు టీడీపీ పార్టీకి సహకరించకుండా న్యూట్రల్ గా ఉన్నారు. చంద్రబాబు అరెస్టు తర్వాత జరిగిన పరిణామాలతో ఎమ్మెల్యే కొటంరెడ్డి సొంతగూటికి చేరుకున్నట్లు ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.