Opposition Meeting: ప్రధాని పదవిపై ఆశ లేదు, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సంచలన వ్యాఖ్యలు
Mallikarjun Kharge: బెంగళూరులోని తాజ్ వెస్ట్‌ఎండ్ హోటల్‌లో జరిగిన విపక్షాల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
![Opposition Meeting: ప్రధాని పదవిపై ఆశ లేదు, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సంచలన వ్యాఖ్యలు Mallikarjun Kharge Shocking Comments On PM Post In Opposition Meeting Opposition Meeting: ప్రధాని పదవిపై ఆశ లేదు, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సంచలన వ్యాఖ్యలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/18/9cb1cdf1fcf521b7d6d5f30499c66b2f1689674621245798_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Mallikarjun Kharge: విపక్షాల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP)ని ఓడించటమే ఏకైక లక్ష్యంగా వరుసగా రెండో రోజు విపక్షాలు సమావేశమయ్యాయి. బెంగళూరులోని తాజ్ వెస్ట్‌ఎండ్ హోటల్‌లో మంగళవారం ఉదయం ప్రతిపక్ష పార్టీల నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మల్లికార్జున ఖర్గే ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధానమంత్రి పదవిపైన కాంగ్రెస్ పార్టీకి ఆసక్తి లేదని వ్యాఖ్యానించారు.
‘అవును.. మాలో విభేదాలు ఉన్నాయి’
అధికారంలోకి రావడం తమ ఉద్దేశం కాదని ఖర్గే వ్యఖ్యానించారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకికత్వం, సామాజిక న్యాయాన్ని పరిరక్షించడమే తమ లక్ష్యమన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడించటమే తమ లక్ష్యం అన్నారు. తాము అధికారంలోకి రావడం ఈ సమావేశం ఉద్దేశం కాదన్నారు. రాష్ట్ర స్థాయిలో మాలో విభేదాలు ఉన్న మాట నిజమేనని, కానీ, అవి సిద్ధాంతరపరమైనవి కావన్నారు. ఇవేవీ దేశం ఎదుర్కొంటున్న సమస్యల ముందు పెద్ద విషయాలు కాదంటూ మల్లికార్జున ఖర్గే తెలిపారు.
సొంతంగా బీజేపీ గెలవలేదు
ఎన్నికల్లో బీజేపీ సొంతంగా గెలవలేదని ఖర్గే తన అభిప్రాయాన్ని వెల్లడించారు. బీజేపీ సొంతంగా 303 సీట్లు సాధించలేదన్నారు. ఓట్ల కోసం మిత్రపక్షాలతో కలిసి పనిచేసి, అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని వదిలేస్తుందని ఆరోపించారు. 26 విపక్ష పార్టీలకు చెందిన తాము 11 రాష్ట్రాల్లో విపక్ష పార్టీలు అధికారంలో ఉన్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓటమిని గుర్తించి ఆ పార్టీ అధ్యక్షుడితోపాటు ఆయా రాష్ట్రాల కాషాయ నేతలు పాత మిత్రులతో పొత్తుల కోసం వివిధ రాష్ట్రాల్లో తిరుగుతున్నారంటూ ఖర్గే విమర్శించారు.
తెరమీదకు యూపీఏ పేరు మార్పు?
కాంగ్రెస్ నాయకత్వంలో ఏర్పడిన యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయన్స్ (UPA) కేంద్రంలో రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. తాజాగా బెంగళూరులో విక్షాలు సమావేశం అయిన నేపథ్యంలో కూటమి పేరును అదే యూపీఏ గా కొనసాగిస్తారా? లేక కొత్త పేరుతో కూటమిని ఏర్పాటు చేస్తారా? అన్నది ఉత్కంఠభరితంగా మారింది. బెంగళూరు సమావేశంలో ఈ అంశంపై కూడా చర్చించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నాలుగు పేర్లు ప్రతిపాదనలో ఉన్నాయని, ఆ పేర్లపై విపక్ష నేతల సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. అనంతరం, తుది నిర్ణయం తీసుకునే బాధ్యతను యూపీఏ చైర్ పర్సన్ గా ఉన్న సోనియా గాంధీకి అప్పగిస్తారు. మంగళవారం విపక్ష నేతల భేటీ అనంతరం మీడియా సమావేశంలో విపక్ష కూటమి పేరును వెల్లడించనున్నట్ల ప్రచారం జరుగుతోంది.
2019 తరువాత తొలి ఎన్డీఏ సమావేశం
2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత NDA సమావేశం జరగలేదు. దానిపై అధికార బీజేపీ ఇప్పటి వరకు దృష్టిపెట్టలేదు. అయితే ప్రతిపక్షాలు సమావేశం ఏర్పాటు చేయడంతో దానికి కౌంటర్‌గా లోక్‌సభ ఎన్నికలకు ఇంకా ఏడాదిలోపే సమయం ఉండటంతో బీజేపీ ఎన్డీఏ సమావేశం నిర్వహించాలని భావించింది. మిత్రపక్షాలతో కలిసి NDA సాగాగించాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే మంగళవారం ఢిల్లీలో ఎన్డీఏ కూటమి సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ భేటీకి 38 పార్టీలు హాజరవుతాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమావేశానికి బీఆర్ఎస్, వైసీపీ , టీడీపీని దూరంగా ఉంచింది. ఏపీ నుంచి కేవలం జనసేన మాత్రమే ఇందులో పాల్గొంటోంది.
అది అవినీతిపరుల సదస్సు
విపక్షాల సమావేశంపై ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా స్పందించారు. సొంత ప్రయోజనాల కోసం కొందరు ఏకమయ్యారని విమర్శించారు. అది విపక్ష పార్టీల సదస్సు కాదని, అవినీతిపరుల సదస్సు అంటూ ఘాటు విమర్శలు గుప్పించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)