Jagan Ministers : జగన్‌పై తీవ్ర ఒత్తిడి - మెజార్టీ పాత మంత్రులకే మళ్లీ చాన్స్ !?
రాజీనామా చేసిన మంత్రుల్లో కొనసాగించే వారి సంఖ్య అంతకంతకూపెరుగుతోంది. మొదట ఒకరిద్దరు అని ప్రచారం జరిగినా ఇప్పుడది పది, పన్నెండు మందికి చేరుకుంది. సీనియర్ల అసంతృప్తి సమాచారమే దీనికి కారణం.
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణపై చర్చ జోరుగా సాగుతోంది. మంత్రులంతా రాజీనామాలు చేశారు. ఆ పత్రాలు సీఎం జగన్ తీసుకున్నారు. కొత్త మంత్రులను ఖరారు చేసుకునే విషయంలో సీఎం జగన్‌పై తీవ్ర ఒత్తిడి వస్తున్నట్లుగా తెలుస్తోంది. మొదటగా మంత్రులందర్నీ తీసేసి కొత్త వారిని తీసుకోవాలనుకున్నారు. అది సాధ్యం కాదని భావించి... కొంత మందిని ఉంచి మిగతా వారిని మారుస్తామని చెప్పారు. చివరికి ఇద్దరు, ముగ్గుర్ని మాత్రమే ఉంచాలని అనుకున్నారు. అది మంత్రివర్గ సమావేశం పూర్తయ్యే సరికి ఐదారుగురు అయింది.
ఇప్పది పది నుంచి పన్నెండు మంది మంత్రుల్ని కొనసాగిస్తారని.. కొత్త వారు పది నుంచి పధ్నాలుగు మంది మాత్రమే ఉంటారన్న ప్రచారం జరుగుతోంది.
మంత్రి పదవుల్ని కాపాడుకునేందుకు ప్రయత్నాలు !
మంత్రి పదవుల్ని కాపాడుకునేందుకు రాజీనామా లేఖలు ఇచ్చిన ప్రస్తుత మంత్రులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. వీరు వివిధ పద్దతుల్లో తమ పదవి కొనసాగించాలని ఒత్తిడి చేస్తున్నట్లుగా చెబుతున్నారు. అలా రాజీనామాలు ఇచ్చిన వెంటనే ఇలా తన చాంబర్‌లో బొత్స సత్యనారాయణ నలుగురు మంత్రులతో సమావేశం కావడం కలకలం రేపింది. ఇతర మంత్రులు ముభావంగా వెళ్లిపోయారు. వీరి అసంతృప్తి కాస్త ఎక్కువ స్థాయిలోనే ఉండటంతో సీఎం జగన్ కొత్త మంత్రుల విషయంలో మరోసారి కసరత్తు చేస్తున్నట్లుగా వైఎస్ఆర్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి.
జగన్‌తో సజ్జల చర్చలు
ప్రభుత్వంతో పాటు పార్టీ వ్యవహారాల్లోనూ కీలక పాత్ర పోషించి సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సీఎం జగన్ ను కలిశారు. ప్రస్తుత మంత్రివర్గంలో సీనియర్లను.. అత్యంత విధేయత ప్రదర్శించిన వారిని కంటిన్యూ చేయాలని... అందర్నీ కొత్త వారిని తీసుకుంటే కుదురుకోకుంటే మొదటికే మోసం- వస్తుందన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతానికి సీఎం జగన్ మనసు విశాలం చేసుకున్నారని పది నుంచి పన్నెండు మంది మంత్రులను కొనసాగించవచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది. కొత్త మంత్రుల ప్రమాణస్వీకారానికి ఇంకా మూడు రోజుల సమయం ఉంది. ఈ లోపు ఈ కౌంట్ ఎంత పెరుగుతుందో చెప్పడం కష్టమని.. ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నార. జగన్ పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు.
కొత్త మంత్రుల ప్రమాణానికి అసెంబ్లీ పార్కింగ్ ప్లేస్‌లో ఏర్పాట్లు
కొత్త మంత్రుల ప్రమాణస్వీకార వేదికపై అధికారులు ఓ క్లారిటీకి వచ్చారు. సచివాలయంలోని అసెంబ్లీ పార్కింగ్ స్థలంలో ప్రమాణ స్వీకారానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్, ముఖ్యమంత్రితో నూతన మంత్రివర్గ సభ్యులతో గ్రూపు ఫోటో దిగడానికి కూడా ఏర్పాట్లు చేయనున్నారు. పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేసే అవకాశం ఉంది.