(Source: Poll of Polls)
Machilipatnam News: మచిలీపట్నంలో పైచేయి కోసం పేర్ని కుటుంబం పోరాటం, పూర్వ వైభవం కోసం టీడీపీ ఆరాటం
Machilipatanma News: కాంగ్రెస్ కంచుకోట మచిలీపట్నంలో టీడీపీ పట్టు సాధించినా...పేర్ని కుటుంబం పైచేయి సాధించింది. వైసీపీ తరఫున మూడోతరం రంగంలోకి దిగింది. టీడీపీ పాత అభ్యర్థికే టిక్కెట్ కేటాయించింది
Bandar Constituency: కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నానికి మరో పేరే బందరు..1951లో ఏర్పాటైన బందర్(Bandar) నియోజకవర్గంలో అన్ని పార్టీలను ప్రజలు సమానంగా ఆదరించారు. ప్రస్తుతం వైసీపీ(YCP) నుంచి పేర్నినాని(Perni Nani) ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు..
బందర్ నియోజకవర్గం
1951లో నియోజకవర్గాల పునర్విభజనలో ఏర్పాటైన బందర్(Bandar) నియోజకవర్గంలో తొలిసారి సీపీఐ(CPI)కి చెందిన జి.ఆంజనేయలు విజయం సాధించారు. ఆ తర్వాత 1955లో జరిగిన ఎన్నికల్లో కొల్లిపర వెంకట రమణయ్య కాంగ్రెస్(Congress) తరపున విజయం సాధించారు. 1959లో జరిగిన ఉపఎన్నికల్లో రాళ్లపల్లి అచ్యుతరామయ్య కాంగ్రెస్ నుంచే విజయం సాధించారు. 1962లో కాంగ్రెస్‌పై ఇండిపెండెంట్ అభ్యర్థి పెడసింగ్ లక్ష్మణరావు విజయం సాధించారు. అనంతరం ఆయన కాంగ్రెస్ చేరి 1967, 1972 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. 1978 ఎన్నికల్లో కాంగ్రెస్ చీలిపోయి, కాంగ్రెస్, ఇందిరా కాంగ్రెస్‌గా ఏర్పడ్డాయి. రెండు పార్టీలు పోటీపడగా...కాంగ్రెస్ (ఐ) అభ్యర్థి చిల్లంకుర్తి వీరాస్వామిపై జనతాపార్టీ అభ్యర్థి వడ్డీరంగారావు గెలిపొందారు.
1983లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం(Telugudesam) అభ్యర్థి బొర్రా వెంకటస్వామి కాంగ్రెస్ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తిపై(Perni Krishnamurthy) భారీ మెజార్టీతో విజయం సాధించారు. అనంతరం జనతాపార్టీ నుంచి వడ్డీ రంగారావు(Vaddi Rangarao) తెలుగుదేశంలోచేరి 1984 ఉపఎన్నికల్లో విజయం సాధించారు. 1985లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి మరోసారి వడ్డీ రంగారావు బరిలో దిగగా...కాంగ్రెస్ పార్టీ తిరుమణి మంగతాయారును పోటీలో నిలిపింది. ఆ ఎన్నికల్లోనూ వడ్డీ రంగారావు విజయం సాధించారు. వరుస పోరాటాల అనంతరం 1989లో జరిగిన ఎన్నికల్లో పేర్ని కృష్ణమూర్తి కాంగ్రెస్(Congress) పార్టీ నుంచి విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ నుంచి నడికుదిటి నరసింహారావు(Nadakuditi Narasimha Rao ) పోటీ చేయగా..ఆయనపై పేర్ని కృష్ణమూర్తి గెలుపొందారు. 1994లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి అంబటి బ్రాహ్మణయ్య(Ambati Brahmanaiah) పోటీ చేయగా... కాంగ్రెస్ పార్టీ మరోసా పేర్ని కృష్ణమూర్తికి టిక్కెట్ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో అంబటికి బందర్ ప్రజలు పట్టం కట్టారు.
1999లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి మరోసారి నదికుదిటి నరసింహారావు టిక్కెట్ దక్కించుకోగా... కాంగ్రెస్ పార్టీ పేర్ని కృష్ణమూర్తి కుమారుడు పేర్నినాని(Perni Nani)కి టిక్కెట్ కేటాయించింది.ఈ ఎన్నికల్లో తెలుగుదేశం జయకేతనం ఎగురవేసింది. 2004లో జరిగిన ఎన్నికల్లో మరోసారి అదే అభ్యర్థులు పోటీపడగా...ఈసారి విజయం కాంగ్రెస్‌ను వరించింది. ఆ పార్టీ అభ్యర్థి పేర్నినాని తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అనంతరం నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా బందర్ నియోజకవర్గం రద్దయ్యి.... మచిలీపట్నం(Machilipatnam) ఏర్పడింది. 2009లో మచిలీపట్నం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పేర్నినాని మరోసారి పోటీ చేయగా.. తెలుగుదేశం మాజీమంత్రి నదికుదిటి నరసింహారావు మేనల్లుడు కొల్లు రవీంద్ర(Kollu Ravindra)కు టిక్కెట్ కేటాయించింది. ఈ ఎన్నికల్లోనూ పేర్నినాని రెండోసారి విజయం సాధించారు.
రాష్ట్రవిభజన అనంతరం జరిగిన 2014 ఎన్నికల్లో పేర్నినాని వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగగా... తెలుగుదేశం నుంచి కొల్లురవీంద్ర మరోసారి పోటీ చేసి విజయం సాధించారు. చంద్రబాబు ప్రభుత్వంలో మాంత్రిగానూ పనిచేశారు. గత ఎన్నికల్లో మరోసారి ఇదే ప్రత్యర్థులు పోటీపడగా... మరోసారి పేర్నినానిని విజయం వరించింది. ఈసారి ఆయన జగన్ ప్రభుత్వంలో మంత్రిగా చోటు దక్కించుకున్నారు. ఈసారి ఎన్నికల్లో పేర్ని కుటుంబం నుంచి మూడోతరం వారసుడు పేర్నినాని కుమారుడు పేర్ని కృష్ణమూర్తి (Perni Krishnamurthy) వైసీపీ తరపున బరిలో దిగుతుండగా... తెలుగుదేశం మరోసారి కొల్లు రవీంద్రకు సీటు కేటాయించింది.