Khammam Politics : ఖమ్మం జిల్లాలో పట్టుసాధించేందుకు భట్టి వ్యూహం, రేవంత్ వర్గానికి చెక్ పెట్టేందుకేనా?
Khammam Politics : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలకనేత, సీఎల్‌పీ నాయకుడు భట్టి విక్రమార్క వ్యూహం మార్చారా? ఖమ్మం జిల్లాలో తన సత్తా చాటేందుకు అనుచరులను రంగంలోకి దించారా? అంటే అవుననే సమాధానం వస్తుంది.
Khammam Politics : కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2018 ఎన్నికల తర్వాత పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లోకి వెళ్లడంతో గత మూడేళ్లుగా క్షేత్రస్థాయి క్యాడర్‌లో నిస్తేజం నెలకొంది. అయితే ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే మిగిలి ఉండటం, మరోవైపు రేవంత్‌రెడ్డి అనుచరులు జిల్లా వ్యాప్తంగా పెరుగుతుండటంతో ఇప్పుడు జిల్లాలో భట్టి స్పీడ్ పెంచినట్లు కనిపిస్తోంది. భట్టి తమ వర్గం నేతలను నియోజకవర్గాలకు పంపి అక్కడ కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో పనిచేసిన వారి పనితీరు ఆధారంగానే ఈ దఫా టిక్కెట్ల కేటాయింపు ఉంటుందని వరంగల్ సభలో రాహుల్‌గాంధీ ప్రకటించడంతో జిల్లా కాంగ్రెస్‌లో తన ఆధిపత్యం తగ్గకుండా, తన అనుచరులే అన్ని నియోజకవర్గాల్లో ఉండేలా ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది.
చాపకింద నీరులా రేవంత్ వర్గం
ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌లో ఆరు నెలలుగా స్తబ్ధత నెలకొనడం, గ్రూపుల పేరుతో ఎవరికి వారే యమునా తీరే అన్నచందాన వ్యవహరిస్తుండటంతో రేవంత్‌కు సన్నిహితంగా ఉండే కొందరు నేతలు దూకుడు పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఓ వైపు జిల్లా సరిహద్దులో ఉండే ములుగు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సీతక్క ఏజెన్సీ ప్రాంతాల వైపు దృష్టి సారించడంతో కొంత మంది నాయకులు రేవంత్ వర్గానికి జై కొట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో సత్తుపల్లిలో మాజీ మంత్రి సంబాని ఉన్నప్పటికీ రేవంత్‌కు సన్నిహితుడిగా ఉన్న మానవతారాయ్ అక్కడ కార్యక్రమాలు చేసేందుకు సిద్ధం కావడం, సత్తుపల్లి నియోజకవర్గంలో సీతక్క పర్యటనలు చేయడంతో జిల్లా కాంగ్రెస్‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు భట్టి వ్యూహం మార్చినట్లు తెలుస్తోంది. రేవంత్ వర్గం చాపకింద నీరులా జిల్లాలో విస్తరించక ముందే తన అనుచరులకు నియోజకవర్గాలను కేటాయించి అక్కడ్నుంచే కార్యక్రమాలను నిర్వహించేందుకు భట్టి వ్యూహం సిద్ధం చేసినట్లు సమాచారం.
కొత్తగూడెంకు పోట్ల.. పాలేరుకు రాయల
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రధాన నియోజకవర్గాలపై దృష్టి పెట్టిన భట్టి కొత్తగూడెంకు తన అనుచరుడిగా మారిన మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావును పంపినట్లు తెలుస్తోంది. కేవలం ఖమ్మంకి పరిమితమైన పోట్ల నాగేశ్వరరావు గత కొద్ది రోజులుగా కొత్తగూడెంలో ఉండటంతోపాటు ఇక్కడే క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దీంతో ఇప్పటికే ఇక్కడున్న స్థానిక నేతలు, పోట్ల నాగేశ్వరరావుల మధ్య వర్గ విభేదాలు నెలకొన్నాయి. మరోవైపు ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన రాయల నాగేశ్వరరావును పాలేరు నియోజకవర్గానికి పగ్గాలు ఇప్పించే దిశగా అక్కడ ఆయనతో కార్యక్రమాలు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టున్న వైరా నియోజకవర్గంలో కూడా మాలోత్ రాందాస్ నాయక్‌కు భట్టి సపోర్ట్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక నేతగా ఉన్న భట్టి విక్రమార్క రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా ఉండటంతోపాటు తన సొంత జిల్లా అయిన ఖమ్మంలో తన మార్కు చూపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే భవిష్యత్‌లో భట్టి వ్యూహం ఫలిస్తుందా? లేదా ? అనేది వేచి చూడాల్సిందే.