Janasena Vs Ysrcp : మూడు పెళ్లిళ్ల కామెంట్స్ జనసేనకు మైనస్ అయ్యాయా? వైసీపీ వ్యూహం ఫలించిందా?
Janasena Vs Ysrcp : జనసేనాని పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్ల కామెంట్స్ పై ఏపీలో ఇంకా చర్చ జరుగుతోంది. మహిళలను కించపరిచారని రాజకీయ మైలేజ్ పొందేందుకు వైసీపీ తీవ్ర ప్రయత్నం చేస్తుంది.
Janasena Vs Ysrcp : జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల తన పెళ్లిళ్ల వ్యవహరంలో చేసిన కామెంట్స్ పై తెలుగు రాష్ట్రాల్లో చర్చకు తెర తీసింది. పవన్ చేసిన కామెంట్స్ ను సీఎం జగన్ సైతం ఎత్తి చూపించి,రాజకీయంగా ఇరకాటంలోకి నెట్టేందుకు చేసిన ప్రయత్నం దాదాపు సక్సస్ అయ్యిందని వైసీపీ భావిస్తుంది. అయితే జనసేనలో కూడా ఈ వ్యవహరంపై చర్చ మొదలైంది. పవన్ చేసిన కామెంట్స్ మహిళలను చులకన చేసేలా ఉన్నాయని ప్రతిపక్ష పార్టీలు చేసే విమర్శలను జనసైనికులు కూడా తిప్పికొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
పవన్ అన్నదాంట్లో వాస్తవం ఇది
ఇటీవల పవన్ కల్యాణ్ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. విశాఖపట్టణం ఎయిర్ పోర్టు ఘటన తరువాత పవన్ కల్యాణ్ విజయవాడ వచ్చి ఆ తరువాత పార్టీ కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్టీలోని నేతలతో కూడా పవన్ చర్చించుకున్న తరువాత కార్యకర్తల సమావేశంలో పవన్ చేసిన కామెంట్స్ రాజకీయంగా చర్చనీయాశంగా మారాయి. తన పెళ్లిళ విషయంలో వైసీపీ నేతలు పదే పదే చేస్తున్న వ్యాఖ్యలకు పవన్ ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. తాను వివాహం చేసుకున్న మహిళలకు చట్టప్రకారం విడాకులు ఇచ్చి, వారికి భరణం కూడా చెల్లించిన తరువాతే మరొక వివాహం చేసుకున్నానని పవన్ క్లారిటీ ఇచ్చారు. అయితే ఇదే సమయంలో పవన్ కల్యాణ్ మరిన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. అవసరం అయితే మీరు చేసుకోండి, వారికి కూడా నష్ట పరిహరం ఇవ్వండని వ్యంగంగా అన్నారు. అంతే కాదు మీలాగా ఒకరితో వివాహం చేసుకొని, ముఫ్పై మందితో కులకటం లేదని పవన్ వైసీపీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
పవన్ కు జగన్ కౌంటర్
పవన్ పెళ్లిళ్ల వ్యవహరంలో చేసిన కామెంట్స్ పై సీఎం జగన్ బహిరంగ వేదికపై స్పందించారు. మహిళలను కించపరచేలా పవన్ వ్యాఖ్యలు ఉన్నాయని, జనసేన పార్టీ పేరు చెప్పకుండానే సీఎం తీవ్రంగా స్పందించారు. ఇలా ఇష్టం వచ్చినట్లు పెళ్లిళ్లు చేసుకోవటంతో పాటు, మీరు కూడా పెళ్లిళ్లు చేసుకోండి, విడాకులు ఇచ్చి పరిహారం చెల్లించండని పవన్ చేసిన వ్యాఖ్యలు మహిళల మనోభావాలను దెబ్బతీశాయని జగన్ అన్నారు. ఇలా అయితే మహిళలకు రక్షణ ఎలా ఉంటుందని ప్రశ్నించారు. అంతే కాదు ఇలాంటి వారు మనకు రాజకీయ నాయకులా అని జగన్ నిలదీశారు. దీంతో పవన్ చేసిన కామెంట్స్ ఒక ఎత్తయితే, దానికి కౌంటర్ గా జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు తెరతీశాయి.
అదే దారిలో మంత్రులు
పవన్ కామెంట్స్ పై స్వయంగా జగన్ రియాక్ట్ అవ్వటంతో అదే దారిలో మంత్రులు విమర్శలు చేస్తున్నారు. వైసీపీలోని పవన్ సామాజిక వర్గానికి చెందిన మంత్రులు విమర్శలు చేశారు. మహిళా కమిషనర్ కూడా పవన్ కు నోటీసులు ఇచ్చింది. మహిళా ఓటు బ్యాంక్ ను నేరుగా టార్గెట్ చేసిన వైసీపీ, పవన్ చేసిన కామెంట్స్ లో మహిళలను కించపరచే విధంగా ఉన్నాయని రాజకీయంగా మైలేజ్ ను సంపాదించేందుకు వైసీపీ దూకుడు ప్రదర్శించింది.
జనసేనలో చర్చ
పవన్ చేసిన కామెంట్స్ తరువాత ఏపీలో రాజకీయం వేడెక్కింది. వైసీపీకి వ్యతిరేకంగా అన్ని శక్తులు కలవాలని, అందుకు అన్ని వర్గాలు మద్దతు తెలిపిన చంద్రబాబు పిలుపు నిచ్చారు. అంతకు ముందు బీజేపీ నేతలు పవన్ కు సంఘీభావం తెలిపారు. రాజకీయ పార్టీలను అణగతొక్కే విధా సరైంది కాదని వామపక్షాలు కూడా వైసీపీని టార్గెట్ చేశారు. ఇక్కడ వరకు రాజకీయంగా పవన్ హైలైట్ అయినప్పటికీ మూడు పెళ్లిళ్ల వ్యవహారంలో పవన్ చేసిన కామెంట్స్ సున్నితంగా మారిందని జనసేన భావిస్తోంది. మహిళా వర్గంపై ప్రభావితం చేసే విధంగా వ్యవహారం మారటంతో దీనిపై జనసేన నాయకులు కూడా చర్చించారు. అయితే పవన్ చేసిన వ్యాఖ్యలు తన వ్యక్తిగతం అని వైసీపీ దానిని మహిళాలోకానికి ఆపాదించి రాజకీయం చేసిందని జనసేన అంటోంది.