YSRCP Vs Janasena : వైఎస్ఆర్‌సీపీ నేతలది బ్రిటిష్ డీఎన్‌ఏ - కులాల మధ్య చిచ్చు పెట్టడమే వారి రాజకీయమన్న జనసేన !
వైఎస్ఆర్‌సీపీ నాయకులది బ్రిటిష్ డీఎన్‌ఏ అని జనసేన మండిపడింది. కులాలకు వ్యతిరేకంగా ఆ పార్టీ మంత్రి చేసిన వ్యాఖ్యలను ఖండించింది.
YSRCP Vs Janasena : కాపు కాదు కమ్మ జనసేన అంటూ వైఎస్ఆర్‌సీపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ మండి పడింది. వైఎస్ఆర్‌సీపీ నాయకుల్లో బ్రిటీష్ రక్తం ప్రవహిస్తోందని... వారి ఆలోచనలు, పని తీరు మొత్తం కులాల మధ్య చిచ్చు పెట్టు.. విభజించి పాలించు అనే ధోరణిలో ఉన్నాయని జనసేన పార్టీ మండిపడింది. బ్రిటీష్ డీఎన్ఏ ఎక్కించుకున్న వైసీపీ పార్టీ కులాల మధ్య గొడవలు పెట్టి రాజకీయ లబ్ది పొందాలని చూస్తోందని ఆ పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేష్ విమర్శించారు. కమ్మ, కాపుల మధ్య చిచ్చుపెట్టేందుకు మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని తెలిపారు. పెట్టుబడులు, ఐటీ పాలసీల గురించి మాట్లాడాల్సిన మంత్రి కులాల గురించి మాట్లాడడం ఏంటని నిలదీశారు.
వైఎస్ఆర్‌సీపీ నేతలది బ్రిటిన్ డీఎన్‌ఏ !
మంత్రి పదవి చేపట్టిన 150 రోజుల్లో ఆయన 150 మందికైనా ఉద్యోగాలు ఇచ్చారా అని పోతిన మహేష్ ప్రశ్నించారు. జనసేన పార్టీ కులాల్ని కలపాలి, మతాల్ని గౌరవించాలనే సిద్ధాంతం మీద ముందుకు వెళ్తుందన్నారు. రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా స్పందించే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అన్న సంగతి గుర్తు పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. జనసేన పార్టీ అంటే ఒక మార్పుకి సంకేతమని పోతిన మహేష్ స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ సమాజంలో మార్పు కోసం.. అన్ని కులాలు, మతాల్ని కలిపి ఉంచాలని నిత్యం తపన పడతారు. అంతా బాగుండాలని కోరుకుంటారు. కష్టాల్లో ఉన్న ప్రజల కన్నీరు తుడిచే లక్ష్యంతో పని చేస్తారు. పవన్ కళ్యాణ్ కేవలం ప్రజల డైరెక్షన్ లోనే ప్రజల కోసం పని చేస్తారు. మరెవరి డైరెక్షన్ లోనూ పని చేయరన్నారు.
సామాజికవర్గాల మధ్య చిచ్చు పెట్టి.. ప్రజల మధ్య అడ్డుగోడలు కట్టి.. కొన్ని కులాలను వర్గ శత్రవులుగా మార్చేందుకు ఆయన పార్టీ పెట్టలేదు. ఏ రోజూ కూడా ఆ విధంగా పార్టీని ముందుకు తీసుకువెళ్లలేదు. మాలాంటి బలహీన వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ జనసేన పార్టీ అని గుర్తు చేశారు.
అన్ని కులాలను మోసం చేసి దూరమైన వైఎస్ఆర్‌సీపీ !
ఒక సామాజిక వర్గాన్ని వర్గ శత్రువుగా చూపి రాష్ట్ర అభివృద్ధిని సర్వనాశనం చేసిన పార్టీ వైఎస్ఆర్‌సీపీ అని పోతిన మహేష్ విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి దుర్మార్గపు పాలన వల్ల ఆ పార్టీని అన్ని సామాజిక వర్గాలు శత్రువుగా భావిస్తున్నాయి. బీసీలకు 10 శాతం రిజర్వేషన్లు తీసేసినందుకు, 18 వేల మంది బీసీ లకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాతినిధ్యం లేకుండా చేసినందుకు వైసీపీని బీసీలు శత్రువుగా భావిస్తున్నారు. ఎస్సీ ఎస్టీల రక్షణ కోసం తీసుకువచ్చిన చట్టాన్ని వారి మీదే ప్రయోగిస్తున్నందుకు ఆ రెండు వర్గాలు వైసీపీని శత్రువుగా చూస్తున్నారని స్పష్టం చేశారు.
వైసీపీ నాయకులే అమర్నాథ్ రెడ్డి అని పిలుస్తున్నారు...!
ముస్లింల దర్గా మాన్యాలు, వక్ఫ్ బోర్డు మాన్యాలు కాజేయడంతోపాటు ఆ వర్గాల మీద అనేక రకాలుగా దాడులు చేస్తున్నందుకు మైనారిటీలు ఆ పార్టీని శత్రువుగా భావిస్తున్నారు. ప్రజల్ని పక్నిదారి పట్టించాలి. కాపు, కమ్మ కులాల మధ్య చిచ్చుపెట్టాలనే ఉద్దేశంతోనే మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. వైసీపీ నాయకులే అతన్ని అమర్నాథ్ రెడ్డి అని పిలుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వర్గం వద్ద బంట్రోతు పని చేస్తున్నందునే నిన్ను ప్రజలు ఆ కులానికి చెందిన వ్యక్తిగా భావిస్తున్నారు.
రికార్డింగ్ డాన్సులకే మంత్రి అమర్నాథ్ పనికొస్తారు !
మంత్రిగా అమర్నాథ్ రెడ్డి ఐటీ పాలసీ గురించి మాట్లాడాలి.. మంత్రి అయిన తర్వాత 150 రోజుల్లో కనీసం ఒక్కసారైనా ఐటీ పాలసీ గురించి మాట్లాడారా? రాష్ట్రానికి ఎన్ని కోట్ల పెట్టుబడులు తెచ్చారు? ఎన్ని పరిశ్రమలు తెచ్చారు? సేవా రంగాన్ని ఎంత అభివృద్ధి చేశారు? ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారో శ్రీ గుడివాడ అమర్నాథ్ రెడ్డి చెప్పాలి? మీకు పదవి వచ్చిన 150 రోజుల్లో 150 ఉద్యోగాలిచ్చారా? రికార్డింగ్ డాన్సులు, ఎడ్ల బండ్ల మీద స్టెప్పులు వేయడానికి తప్ప మీరు మంత్రిగా పనికిరారన్న సంగతి రాష్ట్ర ప్రజలకు అర్ధం అయిపోయిందని జనసేన తేల్చింది.