BJP Dilemma : ఏపీ, తెలంగాణలో బీజేపీకి బ్రేకులేస్తోంది హైకమాండేనా ? - ఎందుకీ గందరగోళం ?
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని ఎదగకుండా చేస్తోంది హైకమాండేనా ?కేసీఆర్‌తో రాజీ చేసుకున్నారన్న ప్రచారం జరుగుతున్నా ఎందుకు సైలెంట్ ?ఏపీలో రెండు ప్రాంతీయ పార్టీలతో అంటకాగడం ఎందుకు?
BJP Dilemma : తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ పెరుగుతున్నట్లుగా కనిపిస్తోంది కానీ ఎదగడం లేదు. దేశం మొత్తం ఎంతో కొంత ప్రభావాన్ని చూపిస్తున్నా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లు అయింది పరిస్థితి. అధికారానికి పోటీ పడుతున్నట్లుగా కనిపించినా తెలంగాణ బీజేపీ పరిస్థితి ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది. ఏపీలో అయితే చెప్పాల్సిన పని లేదు. అయితే హైకమాండ్ వ్యూహాలు, ఢిల్లీ బీజేపీ రాజకీయాల కోసమే తెలుగు రాష్ట్రాల బీజేపీని .. హైకమాండ్ బలిపశువుల్ని చేస్తోందన్న అభిప్రాయం ఇప్పుడు గట్టిగానే వినిపిస్తోంది.
తెలంగాణ బీజేపీ ఊపు ఒక్క సారిగా ఎందుకు తగ్గిపోయింది ?
తెలంగాణలో కొద్ది కాలం క్రితం వరకు బీజేపీ వర్సస్ బీఆర్ఎస్ గా పోటీ కనిపించింది. బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అంటూ చాలా మంది పార్టీలో చేరిపోయారు. కానీ కర్ణాటక ఎన్నికల తర్వాత సీన్ మారిపోయింది. ఇప్పుడు తెలంగాణ బీజేపీలో అంచనాలు మారుతున్నాయి. నాయకత్వం మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. ఒకరి పైన మరొకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. పార్టీలో కొత్తగా చేరికలు లేవు. ఇదే సమయంలో కర్ణాటక ఎన్నికల తరువాత తెలంగాణ కాంగ్రెస్ లో మార్పు కనిపిస్తోంది. కొత్తగా చేరికలను ప్రోత్సహించేలా పార్టీ అగ్ర నాయకత్వం రంగంలోకి దిగింది. అందులో భాగంగా మాజీ ఎంపీ పొంగులేటి , మాజీ మంత్రి జూపల్లి తో సహా కొందరు బీజేపీలోకి వెళ్లిన నేతలు కాంగ్రెస్ లోకి తిరిగి వచ్చేందుకు లైన్ క్లియర్ అయింది. ఇదంతా ఎందుకు అంటే.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పినట్లుగా బీఆర్ఎస్‌తో బీజేపీ గల్లీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీ అన్నట్లుగా ఉండటమేనని చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి భావన రావడానికి అవకాశం కల్పించింది బీజేపీ హైకమాండే. లిక్కర్ స్కాంలో అందర్నీ అరెస్ట్ చేసినా కవితను అరెస్ట్ చేయకపోవడం.. బీజేపీ పై కాలు దువ్విన కేసీఆర్ సైలెంట్ కావడంతో ఏదో రాజీ ఒప్పందం జరిగిపోయిందన్న భావన అందరిలో ఏర్పడింది.
ఢిల్లీ రాజకీయాల కోసం ఉమ్మడి ఏపీలోనూ బీజేపీ నిర్వీర్యం
గుజరాత్, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లలో ఒకప్పుడు బీజేపీకి ఒక్క సీటే ఉండేది. ఇప్పుడు గుజరాత్ లో తిరుగులేని స్థానంలో ఉంది. కర్ణాటకలో నిన్నటి వరకూ అధికారంలో ఉంది. కానీ ఏపీలో ఒక్క శాతం ఓట్లు కూడా తెచ్చుకోలేకపోతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పొత్తులు ఉన్నా లేకపోయినా బీజేపీకి పది శాతం వరకూ ఓట్లు ఉండేవి. కొందరు బీజేపీ నేతలు గట్టి పోటీ ఇస్తూండేవారు. పొత్తులు లేనప్పుడు కూడా ఉభయగోదావరి జిల్లాలో బీజేపీకి పద్దెనిమిది శాతం వరకూ ఓట్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో కిషన్ రెడ్డి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. చాలా నియోజకవర్గాల్లో బలమైన క్యాడర్ ఉంది. కానీ ఢిల్లీ రాజకీయాల కోసం పొత్తుల ప్రయోగాలు చేయడంతో పార్టీ బలం రాను రాను తగ్గిపోయింది.
బీజేపీ బలపడకపోవడానికి కేంద్ర నాయకులే కారణం !
న బీజేపీ ఎదగలేకపోవడానికి రాష్ట్ర నాయకులు కారణం కాదు.. కేంద్ర నాయకత్వమే అసలు కారణం. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ అవసరాల కోసం.. ఏపీలో ప్రాంతీయ పార్టీలతో పరోక్షంగా అయినా సన్నిహిత సంబంధాలు కొనసాగించడం వల్ల సమస్యలు వస్తున్నాయి. కొన్ని సార్లు టీడీపీతో పొత్తు పెట్టుకోవడం.. కొన్ని సార్లు వైఎస్ఆర్‌సీపీ లాంటి పార్టీలతో అంతర్గత అవగాహనతో పోరాటాలు చేయకుండా ఉండటంతో సమస్య జఠిలమవుతోంది. తెలంగాణలో బీఆర్ఎస్ తో యుద్దం చేయడానికి రెడీ అయిపోయారు. ఇప్పుడు సైలెంట్ అయ్యారు. కేసీఆర్ కు వ్యతిరేకం కాదు అన్న భావన రావడం వల్ల ఎక్కువ మంది పార్టీకి గుడ్ బై చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. బీజేపీ అగ్రనేతల ఢిల్లీ రాజకీయ వ్యూహాలను ఆసరాగా చేసుకుని ప్రాంతీయ పార్టీల నేతలు ఎదిగే బీజేపీని మరింత పాతాళంలోకి నెట్టే ప్లాన్లు చేస్తున్నారు. కేసీఆర్ .. ఇప్పుడు బీజేపీ పార్టీని పల్తెత్తు మాట అనడం లేదు. దీంతో అందరూ చేస్తున్న విమర్శలు నిజమేనన్న అభిప్రాయం కలుగుతోంది. దీని వల్ల కేసీఆర్ కు ఎలాంటి నష్టం జరగదు. కానీ బీజేపీకి మాత్రం పూర్తి స్థాయిలో మైనస్ అవుతుంది. ఏపీలో రెండు ప్రధాన పార్టీలతో సన్నిహితంగా ఉండటం వల్ల బీజేపీ ఎదగలేపోతోంది.
ఎప్పటికప్పుడు బీజేపీ నాయకత్వం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల పైన ఫోకస్ పెట్టిందని చెబుతూ ఉటారు. కానీ ఆ ఫోకస్ ఢిల్లీలో మద్దతు కోసమే. తమ పార్టీని తెలుగు రాష్ట్రాల్లో బలపరచాలని వారు అనుకోవడం లేదు. బలపడుతుందనుకునే సమయంలో ప్రాంతీయ పార్టీల ట్రాప్‌లో పడిపోతున్నారు. ఫలితంగా బీజేపీ ఎదగడం లేదు.