80 శాతానికిపైగా ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు గెల్చుకోవడమే కొంప ముంచుతోందా ? వైఎస్ఆర్‌సీపీపై అసంతృప్తికి కారణం సిట్టింగ్‌లేనా ?
అత్యధిక మంది ప్రజాప్రతినిధులు ఉండటం వల్లే వైఎస్ఆర్‌సీపీపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోతోందా ? భారీ మెజార్టీ ప్రజాతీర్పు కోరే సమయానికి గుదిబండగా మారుతోందా ?
Ysrcp Majority Minus : ఎంత ఎక్కువ మెజార్టీ వస్తే అంత బలం ఉన్నట్లు. అయితే మెజార్టీ ఒక్క ఓటు వచ్చినా లక్ష ఓట్లు వచ్చినా పెద్ద తేడా ఉండదు. గెలుపు గెలుపే.. ఓటమి ఓటమే. ఇదే ఫార్ములా అన్ని చోట్లా వర్తిస్తుంది. అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన ఎమ్మెల్యే సీట్ల విషయంలోనూ వర్తిస్తుంది. మెజార్టీ ఒక్క ఎమ్మెల్యే వచ్చినా.. వంద ఎమ్మెల్యేలు వచ్చినా విజయంలో తేడా ఉండదు. ప్రస్తుతం మారిపోయిన కిస్సాకుర్సీకా రాజకీయంలో ఒక్క ఎమ్మెల్యే మెజార్టీ ఉంటే ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కష్టం అది వేరే విషయం కానీ రికార్డుల పరంగా విజయం అయితే మారదు. కానీ అలాగే థంపింగ్ మెజార్టీ సాధిస్తే మాత్రం కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అది పార్టీపై ప్రభావం చూపుతుంది. ఇప్పుడా సైడ్ ఎఫెక్ట్స్ ఏపీ అధికార పార్టీపై బాగా కనిపిస్తున్నాయి.
ఎమ్మెల్యేలతో తీరిగ్గా మాట్లాడకలేకపోతున్న సీఎం జగన్ !
వైఎస్ఆర్‌సీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరో ఐదుగురు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు ఉన్నారు. అధికార విధుల్లో సీఎం జగన్ బిజీగా ఉంటారు. వారెవరికీ గత మూడేళ్లలో సరిగ్గా సమయం ఇవ్వలేకపోయారు. కనీసం వంద మంది ఎమ్మెల్యేలతో ముఖాముఖి మాట్లాడలేకపోయారన్న అసంతృప్తి ఆ పార్టీ నేతల్లో ఉంది. అసెంబ్లీ సమావేశాలు.. పార్టీ సమావేశాలు లాంటి వాటిల్లో తప్ప.. సమస్యలు చెప్పుకునేందుకు చాలా మంది ఎమ్మెల్యేలకు అవకాశం దక్కలేదు. ఇలాంటి వారిలో అసంతృప్తి ఉంది. అదే సమయంలో ఐదారు సార్లు గెలిచిన వారు సహజంగానే మంత్రి పదవిని కోరుకుంటారు. కానీ అందరికీ చాన్సిచ్చే పరిస్థితి లేదు. కనీసం ఇరవై మంది ఆశావహులు మంత్రి పదవిని ఆశించి నిరాశకు గురయ్యారు. మెజార్టీ అత్యధికంగా ఉండటమే దీనికి కారణం.
అంతా వైఎస్ఆర్‌సీపీ అధికారమే - ప్రజల అసంతృప్తి వారిపైనే..!
సరే ఇవన్నీ పార్టీపరమైన సమస్యలు అనుకుందాం. కానీ అసలు సమస్య కూడా ఉంది. అదే ప్రజల్లో కలిగే అసంతృప్తి. మొత్తం రాష్ట్రంలో ఏ మూల చూసినా వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలే ఉంటారు కడప , కర్నూలు, నెల్లూరు లాంటి జిల్లాల్లో అసలు ప్రతిపక్ష ఎమ్మెల్యే లేడు. అధికారంలో ఉన్న పార్టీపై ప్రజల్లో ఎంతో కొంత అసంతృప్తి ఉంటుంది. ఎంతో ఊహించుకుంటే తమకు ఏమీ చేయలేదని వారు ఫీలవుతూంటారు. ఎమ్మెల్యేలపైనే ప్రధానంగా అసంతృప్తి వ్యక్తమవుతూ ఉంటుంది. ఈ పరిస్థితి వైఎస్ఆర్‌సీపీకి కనిపిస్తోంది. అనేక సర్వేల్లో సీఎం జగన్ మీ పని తీరు బాగో లేదంటూ ఎమ్మెల్యేల మొహంపైనే చెబుతున్నారు. ఇప్పటి వరకూ సర్వేల్లో సానుకూల ఫలితం రాని దాదాపుగా70 మందికి టిక్కెట్లు నిరాకరించి కొత్త వారికి ఇస్తామన్న సంకేతాలు పంపారు. ఉన్న ఎమ్మెల్యేలంతా వైఎస్ఆర్‌సీపీ వారే కావడంతో.. ప్రజల్లో కనిపించే అసంతృప్తి కూడా వారిపైనే ఉంటోంది. అది గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలోనూ స్పష్టంగా కనిపిస్తోంది.
అన్ని స్థాయిల్లోనూ వైఎస్ఆర్‌సీపీ ప్రజాప్రతినిధులే !
ఒక్క ఎమ్మెల్యేలు మాత్రమే కాదు.. ఎంపీలు కూడా ముగ్గురు తప్ప అందరూ వైఎస్ఆర్‌సీ వాళ్లే. ఎంపీలు ఏం చేస్తున్నారో నియోజకవర్గ ప్రజలకు ఎవరికీ తెలియదు. అంత కామ్‌గా ఉంటున్నారు. సహజంగానే ప్రజల్లో వారిపై నెగెటివ్ ప్రచారం జరుగుతుంది. వారి సంగతి పక్కన పెడితే.. ఇక పంచాయతీ వార్డు మెంబర్ నుంచి జడ్పీ చైర్మన్ వరకూ అన్ని రకాల పదవుల్లోనూ వైఎస్ఆర్‌సీపీ నేతలే ఉన్నారు. ఇక ప్రజల్లో సమస్యలపై ఆగ్రహం వస్తే ఎవరి మీద చూపిస్తారు ?. ఆలోచించాల్సిన పని లేదు. ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ నేతలకు ఇదే పెద్ద సమస్యగా మారింది. అధికారం అందిందని చాలా మంది నేతలు ప్రజలను ఇబ్బంది పెట్టడం వంటి చర్యలకు పాల్పడటం వల్ల కూడా అసంతృప్తి పెరిగిపోతుంది. చాలా పార్టీలు అధికారంలోకి వచ్చినా నామినేటెడ్ పోస్టులు పెద్దగా భర్తీ చేయకపోవడానికి కారణం.. వారు చేసే వ్యవహారాల్లో ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనే. కానీ జగన్ అలాంటివేమీ పట్టించుకోలేదు. అందుకే ఎక్కడ చూసినా వైఎస్ఆర్‌సీపీ తరపు అధికారం చెలాయించేవాళ్లే కనిపిస్తున్నారు.
ఇది అతివృష్టి అసంతృప్తి - కంట్రోల్ చేయడం కష్టమే.
ఓ రకంగా ప్రస్తుతం వైఎస్ఆర్‌సీపీ అధికార అతివృష్టి అసంతృప్తిని ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితిని సద్దుమణిగేలా చేయడం అంత తేలిక కాదన్న అభిప్రాయం ఉంది. అత్యధిక మంది ఎంపీ, ఎమ్మెల్యేలను గెలవడం బాగానే ఉంటుంది కానీ.. మళ్లీ ఎన్నికల దగ్గరకు వచ్చే సరికి వారి పై ప్రజల్లో పెరిగే అసంతృప్తి మొదటికే మోసం రావడానికి కారణం అవుతోంది. ఈ పరిస్థితిని అధిగమించడానికి వైఎస్ఆర్‌సీపీ చాలా కష్టపడాల్సి ఉంటుంది.