NDA New Parties : ఎన్డీఏలోకి కొత్త పార్టీల కోసం బీజేపీ అగ్రనేతల ప్రయత్నాలు - ఏ పార్టీలు రెడీగా ఉన్నాయి ?
కొత్త మిత్రుల కోసం బీజేపీ వెదుకులాటపాత మిత్రుల్ని మళ్లీ కలుపుకునేందుకు ప్రయత్నాలు ఎన్డీఏలో చేరేందుకు ఎన్ని పార్టీలు ఆమోదం చెబుతాయి ?
NDA New Parties : 2024 లోక్‌సభ ఎన్నికలలోపు బీజేపీకి వ్యతిరేకంగా బలమైన కూటమిని ఏర్పాటు చేసుకోవాలని విపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అదే సమయంలో ఎన్‌డిఎలో తాజా శక్తిని నింపేందుకు బిజెపి కొత్త పొత్తులు పెట్టుకోవాలని చూస్తోంది. బీజేపీకి ప్రస్తుతం పూర్తి మెజార్టీ ఉంది. కానీ రాజకీయాల్లో ఎల్లప్పుడూ ఒకేరకమైన బలం ఉండదని అందరికీ తెలుసు. అందుకే వచ్చే ఎన్నికల నాటి పరిస్థితుల్ని గుర్తించి.. మిత్రపక్షాలతో తమ బలగాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో వచ్చినట్లుగా ఏకపక్ష ఫలితాలు వచ్చే రాష్ట్రాల్లో ఈ సారి ఎదురుగాలి వీస్తోంది. అందుకే కొత్త మిత్రుల కోసం బీజేపీ వేట సాగిస్తోంది.
తగ్గిపోతున్న సీట్ల భర్తీ మిత్రపక్షాలతోనే !
గతంలో వచ్చిన ఏకపక్ష పలితాలు ఈ సారి రాకపోవచ్చని బీజేపీకి కూడా తెలుసు. కొన్ని సీట్లకు కోత పడుతుంది. తగ్గిపోతున్న సీట్లన్నింటినీ భర్తీ చేసుకోవాలంటే.. బీజేపీకి ఉన్న ఒకే ఒక్క మార్గం మిత్రపక్షాలను సాధించుకోవడం. ఇప్పటికి అయితే ఎన్‌డీఏలో లో భాగస్వామ్యం లేని ఆంధ్ర ప్రదేశ్ లోని వై.ఎస్.ఆర్. సి.పి, ఒడిశాలోని బిజూ జనతా దళ్ , తెలంగాణలోని బి.ఆర్.ఎస్. బీజేపీకి దగ్గరగా ఉంటున్నారు. కానీ ఈ మూడు పార్టీలు ఎన్డీఏ కూటమిలో చేరడానికి మాత్రం సిద్దంగా లేవు. బిజూ జనతాదళ్ కేంద్రంలో ఎవరు ఉంటే వారికి మద్దతు ఇస్తుంది. వారు రాష్ట్ర ప్రయోజనాలే చూసుకుంటారు. వైఎస్ఆర్‌సీపీకి బీజేపీతో పొత్తు అంటే.. కోర్ ఓటు బ్యాంక్ ను దూరం చేసుకుని రాజకీయంగా ఆత్మహత్య చేసుకోవడమే. ఇక బీఆర్ఎస్ .. బీజేపీతో పొత్తు అనే ఆలోచనే చేయదు.
పాత మిత్రపక్షాలను మళ్లీ కలుపుకునే ప్రయత్నం
పాతికేళ్ల కింద అటల్ బిహారీ వాజపేయి నాయకత్వంలో ఎన్.డి.ఏ. ఏర్పడినప్పుడు దాదాపు మూడు పదుల పార్టీలు ఆ కూటమిలో ఉండేవి. ఇప్పుడు ఎన్.డి.ఏ. లో మిగిలిందల్లా మహారాష్ట్రలో శివసేన నుంచి చీలిపోగా మిగిలిన షిండే వర్గం, పశుపతి పారస్ నాయకత్వంలోని రాష్ట్రీయ లోక్ జనశక్తి, అప్నా దళ్‌కు చెందిన సోనేలాల్ వర్గం, తమిళనాడులో అన్నా డి.ఎం.కె. మాత్రమే. ఇవన్నీ చాలా చిన్న పార్టీలే. అసలు సీట్లు సాధిస్తాయో లేదో చెప్పలేని పార్టీలు. అందుకని ఒకప్పుడు ఎన్.డి.ఏ. భాగస్వామ్యం ఉన్న తెలుగు దేశం, పంజాబ్‌లోని అకాలీ దళ్ లాంటి పార్టీలను మళ్లీ ఎన్.డి.ఏ. లో భాగం చేయాలని బీజేపీ అగ్రనాయకత్వం ప్రయత్నిస్తోంది. పాత మిత్రులు పోతే కొత్త మిత్రులతో భర్తీకి యత్నం మోడీ అమిత్‌షాల ద్వయం చేస్తోంది.తద్వారా తగ్గిందనుకుంటున్న కూటమి బలం యాదాతధంగానే వుందనిచూపించుకునే యోచనలో ఉంది కమలం పార్టీ.
టీడీపీ, అకాలీదళ్, జేడీఎస్‌లకు ఆహ్వానం
తెలుగుదేశం పార్టీకి మా తలుపులు శాశ్వతంగా మూసుకుపోయాయని చెప్పిన అమిత్‌షా స్వయంగా టీడీపీ అధ్యక్షడు చంద్రబాబుతో సమావేశం కావడం, ఆ సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షలు జేపీ నడ్డాకూడా పాలు పంచుకోవండం చూస్తే పరిణామాలు కొత్త సమీకరణాలకు సంకేతాలని ఎవరైనా ఇట్టే చెప్పేయొచ్చు. 2018కి పూర్వం ఎన్డీయేలో భాగస్వామిగా వున్న చంద్రబాబు పార్టీని తిరిగి చేర్చుకుంటే ఖచ్చితంగా అది జాతీయ స్ధాయిలో బీజేపీకి కలిసివచ్చే అంశమే అంటున్నారు. పొరుగు రాష్ట్రం కర్నాటకలో మొన్నటి ఎన్నికల్లో తీవ్రంగా నష్టపోయిన కుమారస్వామి పార్టీ జేడీఎస్ కూడా ఎన్డీయేలో చేరేందుకు చాలా ఆసక్తిగా వుంది. పంజాబ్ ఎన్నికల్లోఘోర పరాజయాాన్ని చవిచూసి తమ పట్టున్న ప్రాంతాల్లో కూడా ఆప్ పార్టీ పాగా వేయడంతో అక్కడి అకాలీదళ్ కూడా తిరిగి ఎన్డీయే గూటికి చేరే యోచనలో వుంది. అయితే కొత్త మిత్రుల్ని పొందడానికి బీజేపీ చేస్తే ప్రయత్నాలు ఎంత సక్సెస్ అవుతాయన్నది రాజకీయవర్గాలకు సైతం అంతుబట్టడం లేదు.