Governor Vs CM: తెలంగాణలో బెంగాల్ సీన్ రిపీట్ అవుతుందా? గవర్నర్ వర్సెస్ సీఎం ఎపిసోడ్‌లో ఎవరిది పైచేయి ?
సిఎం కెసిఆర్, గవర్నర్ తమిళిసై మధ్య కూడా వార్ పతాకస్థాయిలోనే ఉంది. రాష్ట్రపాలన వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం ఎక్కువైందన్న ప్రభుత్వ విమర్శని లెక్క చేయకుండా తమిళిసై దూసుకుపోతున్నారు.
నిన్నటి వరకు గవర్నర్లను రబ్బర్ స్టాంప్‌గా అభివర్ణించేవాళ్లు. అయితే ఇప్పుడు వాళ్లు కూడా మారారు. రాష్ట్రంలో సిఎంలకు సమాంతరంగా పాలిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఈ ఆరోపణలకు అసలు కారణం ప్రధాని మోదీనే అన్న టాక్ రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. ఎందుకు అంటే…!
ఈ మధ్యన రాజకీయాల్లో నోరు పారేసుకునే వాళ్లకే ప్రాముఖ్యతనిస్తున్నారన్న వార్తలైతే ఉన్నాయి. ముఖ్యంగా బీజేపీలో అయితే ఇది మరీ ఎక్కువ. మతపరమైన విమర్శలు చేసేవారికి, నమో నమః అనని పార్టీలు, నేతలపై ఒంటికాలిపై లేస్తారు. ఇలా చేస్తేనే బీజేపీ అదేవిధంగా ఆర్‌ఎస్‌ఎస్ కంటిలో పడచ్చన్న ఆశతో పార్టీలో ఫైర్ బ్రాండ్లుగా పేరుతెచ్చుకుంటున్నారు. అలా ఈ మధ్యన గవర్నర్లలో ఈ పోకడ ఎక్కువగా కనిపిస్తోందంటున్నరు విశ్లేషకులు.
కాంగ్రెస్, ఇతర పార్టీలు పాలించే రాష్ట్రాల్లో గవర్నర్లు ఫైర్ బ్రాండ్లుగా ఉంటున్నారన్న విషయం బహిరంగ రహస్యమే. బీజేపీ, మోదీకి వ్యతిరేకంగా ఉన్న ముఖ్యమంత్రులను టార్గెట్ చేయడానికి గవర్నర్లను వాడుకుంటోందని టీఆర్ఎస్‌తో పాటు అనేక పార్టీలు గగ్గొలు పెడుతున్నాయి.
ఇప్పటికే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో బీజేపీ అధికారాన్ని సొంతం చేసుకుంది. హస్తం నేతల్లో చీలికలు తెచ్చి వారికి కాషాయం కప్పేసి అధికారాన్ని అందుకుంది. ఇక ప్రాంతీయపార్టీలున్న రాష్ట్రాల్లో చీలికలు తేవడం కాస్తంత కష్టంగానే మారిందట బీజేపీకి. అందుకే ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను ముప్పతిప్పలు పెట్టడానికి గవర్నర్లను ఉసిగొల్పుతోందని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఆప్ నుంచి స్టార్ట్ అయ్యింది. ఆపమన్నా ఆపడంలేదు.
దిల్లీలో కేజ్రీవాల్ పాలనకు బ్రేక్ వేసేందుకు చేయని ప్రయత్నాలు లేవని ఆప్ నేతలు అడపాదడపా చెప్తూనే ఉన్నారు. స్వయంగా కేజ్రీవాలే ఎన్నోసార్లు ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకెళ్లారు కూడా. ఆప్ పార్టీలోనే చీలికలు తెచ్చి ప్రభుత్వాన్ని పడకొట్టింది. కానీ ప్రజల మద్దతుతో మళ్లీ కేజ్రీవాల్ విజయాన్ని అందుకొని బలమైన నేతగా దిల్లీ పాలన కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ పాలనపరమైన నిర్ణయాల్లో లెఫ్ట్ నెంట్ గవర్నర్ జోక్యం ఉంటూనే ఉంది. రెండురోజుల క్రితం కూడా సిఎం వర్సెస్ లెఫ్ట్ నెంట్ గవర్నర్ వీకె సక్సెనా పోరు మీడియాలో హైలెట్ అయ్యింది.
పశ్చిమబెంగాల్లోనూ సేమ్ సీనే. మొన్నటి వరకు ఆ రాష్ట్ర గవర్నర్‌గా ఉన్న జగదీప్ ధన్‌కర్, మమతా బెనర్జీల మధ్య ఎంతటి వార్ కొనసాగిందో చెప్పాల్సిన పనిలేదు. టామ్ అండ్ జెర్రీలాగా సమయం దొరికనప్పుడల్లా నువ్వా నేనా అన్నరేంజ్ లో ఇద్దరూ కూడా అధికారబలాన్ని చూపించారు. ఇప్పుడు ఇదే సీన్ తెలంగాణలోనూ కనిపిస్తోందంటున్నారు రాజకీయవిశ్లేషకులు.
తమిళిసై సౌందరరాజన్ మందు పనిచేస్తుందా?
సిఎం కెసిఆర్, గవర్నర్ తమిళిసై మధ్య కూడా వార్ పతాకస్థాయిలోనే ఉంది. రాష్ట్రపాలన వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం ఎక్కువైందన్న ప్రభుత్వ విమర్శని లెక్క చేయకుండా తమిళిసై దూసుకుపోతున్నారు. మొన్నటివరకు ఆచితూచి అడుగులేసిన తమిళిసై దిల్లీ వెళ్లొచ్చినప్పటి నుంచి దూకుడు చూపిస్తున్నారు. అత్యాచార బాధితులను పరామర్శించడం, వరదబాధిత ప్రాంతాల్లో పర్యటించడం, కోవిడ్ టైమ్‌లో రాజ్ భవన్ లో ఉచిత భోజన పథకం ఏర్పాటు చేయడంతోపాటు తాజాగా ప్రజా దర్బార్ కూడా ఓపెన్ చేసి కెసిఆర్ ను కాస్త ఇబ్బంది పెట్టారనేది అంతా అనుకుంటున్నారు. ఇలా గవర్నర్ తమిళిసై చాప కిందనీరులా కెసిఆర్ ని ఇరుకున పెట్టడానికి కారణం మరొకటి కూడా ఉందంటున్నారు రాజకీయవిశ్లేషకులు. ఈమధ్యన పార్టీలోని ఫైర్ బ్రాండ్లకు బీజేపీ పట్టం కడుతోంది. బండి సంజయ్‌నే అందుకు ఉదాహరణ చూపిస్తున్నారు. అలాగే బెంగాల్లో దీదీకి చుక్కలు చూపించిన జగదీప్‌కి ఇప్పుడు ఉపరాష్ట్రపతి అయ్యే ఛాన్స్ ఇచ్చింది. అందుకే తమిళిసై కూడా పార్టీలో..అధిష్ఠానం దృష్టిలో పడేందుకు ఈ రకంగా వ్యహరిస్తున్నారన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తున్నారు రాజకీయవిశ్లేషకులు. రానున్న రోజుల్లో తమిళిసై కూడా ఉన్నతమైన స్థాయిలో కనిపించడం ఖాయమంటున్నారు. తమిళనాట ఎన్నికల టైమ్ లో బీజేపీ తమిళిసై ని అస్త్రంగా వాడుతుందని జోస్యం చెబుతున్నారు.