Ganta Srinivas Rao: గంటా శ్రీనివాసరావు టీడీపీలో ఉన్నట్టా? లేనట్టా?- అధినాయకత్వం నుంచి శ్రేణుల వరకు అంతా కన్ఫ్యూజ్!
గతంలో గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరతారంటూ పెద్ద ఎత్తున ఊహాగానాలు వెలువడ్డాయి. అలాగే, జనసేన వైపు కూడా ఓ లుక్కేసి ఉంచారని కూడా ప్రచారం జరిగింది.
Ganta Srinivas Rao: విశాఖ నార్త్ ఎమ్మెల్యే.. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైఖరి టీడీపీలోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఆసక్తి రేపుతోంది. 2019 ఎన్నికల్లో జగన్ హవాను తట్టుకొని మరీ ఆయన విజయం సాధించారు. అయితే, ఆ తర్వాత నుంచి గడచిన మూడేళ్లలో పార్టీ కీలక కార్యక్రమాల్లో పాల్గొన్న సంఘటనలు చాలా తక్కువ. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్రలో చేపట్టిన కొన్ని కార్యక్రమాలకు కూడా ఆయన డుమ్మా కొట్టిన సందర్భాలు ఉన్నాయి. ఆ సమయంలో తాను విశాఖలో లేకపోవడం వల్లే ఆయా ప్రోగ్రామ్స్ లో పాల్గొన లేకపోయానని ఆయన చెబుతుంటారు. ఇక గతంలో ఆయన వైసీపీలో చేరతారంటూ పెద్ద ఎత్తున ఊహాగానాలు వెలువడ్డాయి. అలాగే, జనసేన వైపు కూడా ఓ లుక్కేసి ఉంచారని కూడా ప్రచారం జరిగింది.
అదే సమయంలో, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలను వైజాగ్ లో ఘనంగా నిర్వహించి షాక్ ఇచ్చారు ఆయన. ఆ తర్వాత మళ్ళీ సైలెంట్ అయిన గంటా శ్రీనివాసరావు మరోవైవు కాపు సామాజిక వర్గ నేతల మీటింగ్స్ లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే, అదంతా పార్టీలకు అతీతంగా జరిగే కార్యక్రమం అని ఆయన అంటున్నారు.
ఏ నియోజక వర్గం ఇచ్చినా గెలుపు గంటాదే
భీమిలి, అనకాపల్లి, విశాఖ సౌత్ ఇలా ఎక్కడ నుండి పోటీ చేసినా గంటా శ్రీనివాసరావు గెలుపు మాత్రం పక్కా. ఇది ఇప్పటికీ ఆయన ప్రత్యర్థులకు ఓ మిస్టరీ. ప్రజారాజ్యం నుండి కాంగ్రెస్ కూ.. ఆ తర్వాత టీడీపీ ఇలా అన్ని పార్టీలనూ చుట్టేసిన గంటా ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నారు. అయితే, గడచిన మూడేళ్ళలో టీడీపీ చేపట్టిన వైసీపీ వ్యతిరేక కార్యక్రమాల్లో ఆయన స్వయంగా పాల్గొన్న సందర్భాలు చాలా అంటే చాలా తక్కువ. అయినప్పటికీ గంటా పై తెలుగుదేశం హై కమాండ్ బహిరంగంగా సీరియస్ అయిన సందర్భాలు లేవు. ఆర్థికంగానూ, సామాజికంగానూ బలవంతుడైన గంటాను పార్టీ ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కోల్పోవడం ఇష్టంలేక పోవడమే దీనికి కారణం అని విశ్లేషకులు చెబుతున్నారు.
చివరికి, వారం క్రితం చంద్రబాబు పిలుపు మేరకు టీడీపీ చేపట్టిన రిషికొండ సందర్శన - నిరసనల కార్యక్రమానికి సైతం గంటా దూరంగా ఉన్నారు. అయితే సడన్ గా టీడీపీకే చెందిన మరో సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు అరెస్ట్ విషయంలో ఆయనకు అండగా నిలుస్తూ.. సోషల్ మీడియాలో ఆ అరెస్ట్ ను ఖండించారు. నిజానికి వీరిద్దరి మధ్య పార్టీలో సఖ్యత లేదు అనే ప్రచారం ఉంది. అలాంటి సమయంలో ఒక్కసారిగా అయ్యన్న అరెస్ట్ ను ఖండిస్తూ గంటా శ్రీనివాసరావు స్పందించండం.. అదీ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా ఏళ్ల తర్వాత కావడంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో మళ్లీ చర్చలోకి వచ్చారు గంటా శ్రీనివాసరావు. రానున్న రోజుల్లో గంటా శ్రీనివాసరావు మరిన్ని ఆసక్తికర పరిణామాలకు కారణం అవుతారో చూడాలి.