Andhra Pradesh Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ యాక్టివ్ - విజయసాయి, మిథున్ రెడ్డిల విచారణ తర్వాత ఏం జరుగుతుంది?
Liquor scam:ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాంలో ఈడీ ఒక్క సారిగా యాక్టివ్ అయింది. వైసీపీ కీలక నేతల విచారణ తరవాత సంచలన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.

Andhra Pradesh liquor scam ED active: ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఒక్కసారిగా దూకుడు పెంచడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. గత రెండు రోజులుగా చోటుచేసుకున్న పరిణామాలు ఏదో జరగబోతోందన్న సంకేతాలు ఇస్తున్నాయి. మాజీ ఎంపీ విజయసాయిరెడ్, ప్రస్తుత ఎంపీ మిథున్ రెడ్డిలను ఈడీ వరుసగా విచారణకు పిలవడం ఈ కేసులో కీలక మలుపుగా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో మిథున్ రెడ్డి జైలుకు వెళ్లి రాగా, విజయసాయిరెడ్డి మాత్రం తనను తాను విజిల్ బ్లోయర్ గా ప్రకటించుకుని అరెస్టు నుంచి తప్పించుకున్నారు.
విజయసాయిరెడ్డి ఈడీకి అన్నీ చెప్పేస్తారా?
విజయసాయిరెడ్డి ఇటీవల పార్టీ అధినేత జగన్‌కు దూరం జరిగి.. రాజకీయాల నుంచి వైదొలిగారు. వైసీపీకి రాజీనామా చేశారు. సిట్ విచారణలో ఆయన కీలకంగా ఉన్నారని చాలా వివరాలు చెబుతున్నారన్న ప్రచారం ఉంది. నిందితుడిగా ఉన్నప్పటికీ ఆయనన ుసిట్ అరెస్టు చేయలేదు. తనను తాను విజిల్ బ్లోయర్ గా ప్రకటించుకున్నారు. అదే సమయంలో రాజకీయంగా సైలెంట్ గా లేరు. జగన్ చుట్టూ ఉన్న కోటరీపై బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు. అంతర్గతంగా ఆయన సిట్ , ఈడీ అధికారులకు కీలక సమాచారం అందిస్తున్నట్లు వైసీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి. తనపై ఉన్న కేసుల నుంచి బయటపడేందుకు విజయసాయిరెడ్డి అప్రూవర్ గా మారుతున్నారని.. భావిస్తున్నారు. ఆర్థిక వ్యవహారాలన్నీ చూసుకున్న వ్యక్తిగా విజయసాయిరెడ్డి ఇచ్చే స్టేట్‌మెంట్ ఈ కేసులో అత్యంత కీలకం కానుంది.
సిట్ విచారణలో బలమైన ఆర్థిక లావాదేవీల ఆధారాలు?
ఇప్పటికే జైలు నుంచి బయటకు వచ్చిన మిథున్ రెడ్డిని ఈడీ మళ్ళీ విచారించడం వెనుక బలమైన ఆర్థిక లావాదేవీల ఆధారాలు ఉన్నట్లు తెలుస్తోంది. మద్యం కంపెనీల నుంచి వచ్చిన ముడుపులు ఎక్కడికి వెళ్లాయి? ఎవరి ఖాతాల్లోకి చేరాయి? అన్న అంశాలపై ఈడీ ఆరా తీస్తోంది. విజయసాయిరెడ్డి సహకారం అందిస్తున్నందున ఆయన ఇచ్చిన సమాచారాన్ని మిథున్ రెడ్డి ముందు ఉంచి ఈడీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ ఇద్దరు కీలక నేతల విచారణ పూర్తయిన తర్వాత, ఈ కేసు నేరుగా పార్టీ అత్యున్నత నాయకత్వం చుట్టూ ముసురుకునే అవకాశం ఉంది.
వైసీపీ నాయకత్వానికి సమస్యే
ఒకవైపు విజయసాయిరెడ్డి తిరుగుబావుటా ఎగురవేయడం, మరోవైపు దర్యాప్తు సంస్థల వేగం పెరగడం జగన్ కోటరీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వీరిద్దరి విచారణ తర్వాత మరికొన్ని కీలక అరెస్టులు ఉండవచ్చని లేదా విదేశీ నిధులకు సంబంధించిన ఆధారాలు బయటపడవచ్చని అంచనా వేస్తున్నారు. మొత్తం మీద ఏపీ లిక్కర్ స్కామ్ ఇప్పుడు కేవలం అవినీతి కేసుగా కాకుండా, వైసీపీ, జగన్ రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేసే దిశగా సాగుతోందని ఆ పార్టీ వర్గాలు ఆందోళనతో ఉన్నాయి.





















