Delivery boy Bode Prasad: గిగ్ వర్కర్‌గా మారిన పెనమలూరు ఎమ్మెల్యే - ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ఇదో మార్గం - బోడె ప్రసాద్ అంతే !
MLA Bode Prasad : గిగ్ వర్కర్‌గా మారిన పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఏదో కాసేపు వీడియో కోసం కాకుండా రోజంతా ఆయన డెలివరీలు చేశారు.

Gig worker MLA Bode Prasad : విజయవాడ శివారులోని పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ సరికొత్త అవతారమెత్తి అందరినీ ఆశ్చర్యపరిచారు. నియోజకవర్గ ప్రజలతో మమేకమయ్యేందుకు ఆయన ఎంచుకున్న తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సామాన్య డెలివరీ బాయ్ కష్టాలను తెలుసుకునేందుకు ఆయన స్వయంగా ఒక రోజు గిగ్ వర్కర్ గా మారి వీధుల్లో చక్కర్లు కొట్టారు.
మంగళవారం ఉదయం బోడె ప్రసాద్ ప్రముఖ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టామార్ట్ డెలివరీ బాయ్ యూనిఫాం ధరించి, తలకు హెల్మెట్ పెట్టుకుని సిద్ధమయ్యారు. తన సొంత కారు పక్కన పెట్టి, ద్విచక్రవాహనంపై ఆర్డర్లను తీసుకుని కస్టమర్ల ఇళ్లకు వెళ్లారు. ఎమ్మెల్యే స్వయంగా సరుకులు పట్టుకుని ఇంటి తలుపు తట్టడంతో నియోజకవర్గ ప్రజలు అవాక్కయ్యారు. రాజకీయ నాయకుడంటే కేవలం సభలు, సమావేశాలకే పరిమితం కాకుండా, ఇలా సామాన్యుడిలా తమ మధ్యకు రావడం చూసి స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.
ఒక రోజు అనుభవం.డెలివరీ బాయ్
— Ram Rahim Robert (CBN FAMILY) (@bobbysairam) January 20, 2026
కష్టాన్ని ప్రత్యక్షంగా అనుభవించి తెలుసుకున నేత.పని చేసే చేతులకు గౌరవం ఇచ్చే నాయకుడు మన @BodePrasad గారు.#BodeForDevelopment #BodeForPeople#BodeForPenamaluru #PenamaluruTDP#TeluguDesamParty#ManaPenamaluruManaBode #TeamBode #BodeDalam #BodeYuvatha pic.twitter.com/yoZWWSJJiM
ఈ వన్ డే డెలివరీ బాయ్ ప్రయోగం వెనుక ఒక బలమైన ఉద్దేశం ఉందని బోడె ప్రసాద్ చెబుతున్నారు. ఎండనక, వాననక గంటల తరబడి కష్టపడే డెలివరీ బాయ్స్ పడే ఇబ్బందులను క్షేత్రస్థాయిలో తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే తాను ఈ పని చేసినట్లు ఆయన వివరించారు. ఈ క్రమంలో ట్రాఫిక్ సమస్యలు, రోడ్ల పరిస్థితి ,డెలివరీ రంగంలో ఉన్న ఒడిదుడుకులను ఆయన స్వయంగా అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. రాజకీయం అంటే కేవలం ఓట్లు వేయించుకోవడం మాత్రమే కాదు, ప్రజల జీవనశైలిని అర్థం చేసుకోవడం కూడా అని ఆయన చెబుతున్నారు.
బోడె ప్రసాద్ ఎప్పుడూ వినూత్న కార్యక్రమాలతో వార్తల్లో నిలుస్తుంటారు. గతంలోనూ నియోజకవర్గంలోని పారిశుద్ధ్య కార్మికులతో కలిసి పని చేయడం, సామాన్యులతో కలిసి హోటళ్లలో టీ తాగడం వంటి పనుల ద్వారా ఆయన పీపుల్స్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా యువతలో ఆయనకు ఉన్న క్రేజ్ ఈ తాజా డెలివరీ బాయ్ అవతారంతో మరింత పెరిగింది. ఆయన చేసిన ఈ పనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం వాట్సాప్ స్టేటస్‌లు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో వైరల్ అవుతున్నాయి.
ప్రజాప్రతినిధులు ఏసీ గదులకే పరిమితం కాకుండా ఇలా ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకోవడం మంచి పరిణామంగా భావిస్తున్నారు. 2014లో మొదటి సారి గెలిచిన ఆయన 2019లో రెండో సారి ఓడిపోయారు. ఆ సమయంలో కూడా నియోజకవర్గాల్లో పలు కాలనీల్లో పర్యటించి..బైక్ మీద ఓటర్ల ఇంటికి తాను తప్పు చేసి ఉంటే క్షమించాలని కూడా అడిగారు.





















