YSRCP Latest News : అమరావతిపై వైసీపీ వ్యూహం బెడిసికొట్టిందా? ముంపు విమర్శలు రివర్స్ అవుతున్నాయా? రైతుల ఆగ్రహం, తాజా పరిణామాలు!
YSRCP Latest News : అమరావతి విషయంలో పదే పదే వైసీపీ పొరపాటు చేస్తోందా? అమరావతికి జై కొడుతూనే చేస్తున్న ప్రచారంపై జనం కన్ఫ్యూజ్ అవుతున్నారు. క్లారిటీ లేదనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి.

YSRCP Latest News : ఎందుకో తెలియదు గాని అమరావతి విషయంలో విపక్ష వైసిపి మొదటి నుంచి రాంగ్ స్ట్రాటజీలోనే వెళుతోంది అన్న డిస్కషన్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. గడిచిన కొద్ది రోజుల నుంచి 'వర్షాలకు అమరావతి మునిగిపోయింది.. రాజధాని ప్రాంతం చెరువులను తలపిస్తోంది " అంటూ వైసిపి నేతలు వారి అనుబంధ మీడియా ఛానల్స్‌లో కథనాలు వండివారుస్తున్నారు. ఇలా వస్తున్న కథనాలఫై అమరావతి ప్రాంత వాసుల నుంచి పెద్దగా స్పందన రావడం లేదు. రాజధాని ప్రాంతంలో ప్రస్తుతం పనులు మొదలయ్యాయి. దానికోసం ఎక్కడికక్కడ గుంతలు తీసి ఉంచారు. మరికొన్నిచోట్ల పునాదుల కోసం నేలను తవ్వారు. వర్షాలు వల్ల వాటిలోకి నీరు చేరుకుంది. అలాగే రాజధాని ప్రాంతం కావడంతో భూ కేటాయింపులు జరిపిన సంస్థలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు తమ పనులు మొదలెట్టాయి. అయితే దాని కంటే ముందు జరగాల్సిన డ్రైనేజీ పనులు అవ్వాల్సిన అంత స్పీడ్ గా కావడం లేదు అనేది వాస్తవం. దానితో కొన్ని చోట్ల నీరు నిలబడింది. ఈలోపులోనే రాజధాని ప్రాంతం మునిగిపోయింది అంటూ ఒక్కసారిగా విపక్ష నేతలు చేస్తున్న ప్రచారం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.
29 గ్రామాలు.. 32 వేల ఎకరాలు.. అమరావతి రైతుల సాహసం
అమరావతి రాజధాని అనే ప్రాంతం 29 గ్రామాల పరిధిలోని ముప్పై రెండువేల ఎకరాల స్థలంలో రాబోతోంది. 2014-19 మధ్యకాలంలో రైతులతో ప్రభుత్వం చర్చలు, ఆ ప్రాంతంలో ఉన్న గ్రామస్తులలో నెలకొన్న అనుమానాలు భయాలు, ధర్నాలు నిరసనలు,ఒప్పందాలు వంటి సంఘటనలతోనే గడిచిపోయింది. నిజానికి అప్పటికి అమరావతిపై రాష్ట్రవ్యాప్తంగా ఏమీ ఏకాభిప్రాయం లేదు. 2019-24 మధ్య కాలంలో అధికారంలోకి వచ్చిన వైసిపి అనూహ్యంగా మూడు రాజధానుల బిల్లు తెరపైకి తేవడంతో అమరావతికి భూములు ఇచ్చిన రైతులు రోడ్డెక్కారు. నచ్చ చెప్పాల్సింది పోయి వారితో జగన్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు రాష్ట్రవ్యాప్తంగా విమర్శల పాలైంది. దానితో 2024 ఎన్నికల సమయానికి అమరావతిపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో తెలియకుండానే ఒక సమ్మతి వచ్చేసింది. దాని ప్రభావం ఆ ఎన్నికల ఫలితాలలో కనపడింది కూడా. ఇది ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి పెద్ద బూస్ట్‌నే ఇవ్వడంతో అమరావతి పనులు ఈ టైంలో కొంతమేరైనా పూర్తి చేయాలనే ఉద్దేశంతో వేగంగా పనులు చేస్తున్నారు.
అయితే రాజధాని ప్రాంతంలో నుంచి వర్షపు నీరు బయటకు పోయేలా చేయాల్సిన ఏర్పాట్లపై మాత్రం మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిపై రాజకీయ విశ్లేషకులు, అనుభవజ్ఞుల నుంచి విమర్శలు వెలువడుతున్న మాట వాస్తవం. అయితే సరిగ్గా ఇక్కడే విపక్ష వైసిపి పొరపాటు చేస్తుంది అన్న వాదన పొలిటికల్ సర్కిల్స్‌లో వినబడుతోంది. రాజధాని రైతుల నుంచి ఎలాంటి విమర్శలు వినిపించని ప్రస్తుత తరుణంలో " అమరావతి మునిగిపోతుంది.. అక్కడ చేపలు తిరుగుతున్నాయంటూ చేస్తున్న విమర్శలు " నేతలకి బూమ్ రాంగ్ అయ్యే ప్రమాదం లేకపోలేదనే వాదన వినిపిస్తోంది.
రాజధానిపై స్పష్టత లేని వైసీపీ ఎజెండా
అమరావతిపై వైసీపీ ఎజెండా ఇప్పటికీ స్పష్టంగా కనిపించడం లేదు. అవునన్నా కాదన్నా 2024 ఎన్నికలు అమరావతి రాజధాని ఎజెండాగానే సాగాయి. ప్రజలంత స్పష్టంగా తీర్పు ఇచ్చాక అమరావతిని ఏపీకి ఏకైక రాజధానిగా వైసిపి ఒప్పుకున్నట్టే కనిపించింది. దానికి తగ్గట్టే పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కూడా "అమరావతిని నాగార్జున యూనివర్సిటీ పరిధిలో పెడితే బాగుంటుంది కదా "అని కూడా అనడం వైసీపీ తన స్టాండ్ మార్చుకుంది అన్న వాదనకు బలాన్ని ఇచ్చింది. అయితే ఇప్పుడు రాజధాని మునిగిపోయింది అంటూ వైసిపి నేతలు చేస్తున్న విమర్శల అంతిమ ఫలితం ఏంటి అనేదానికి వైసీపీ దగ్గర స్పష్టత ఉందా అనేది అనుమానమే. అంటే రాజధానిని అమరావతిలో వద్దు అంటున్నారా.. లేక అమరావతి లోనే వేరే ప్రాంతానికి తరలించమంటున్నారా అనే విషయంపై క్లారిటీ రావడం లేదు. ఇప్పటికీ అమరావతి రైతులు జగన్ మోహన్ రెడ్డిపై కోపంతోనే ఉన్నారు. అది వారి మాటల్లోనే తెలుస్తోంది. గత పాలనలో జరిగిన పరిణామాలు వారు ఎదుర్కొన్న కేసులు వారిని అలాంటి అభిప్రాయంలోకి నెట్టివేసాయి. అలాంటి తరుణంలో తిరిగి వారికి దగ్గరయ్యే ప్రయత్నం చెయ్యాల్సిన విపక్ష పార్టీ అదే అమరావతిపై విమర్శలు చేయడాన్ని అధికార కూటమి తనకు ఆయుధంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది.
ప్రజలు ఏదైనా ఒక సమస్యపై బయటకు వస్తే వారి తరఫున విపక్షాలు పోరాటం చేస్తాయి. కానీ అమరావతిలో దీనికి రివర్స్‌లో జరుగుతోంది. నిజానికి అమరావతి రైతులు ఆందోళన చెందుతుంది తమకు ఇస్తామన్న ఫ్లాట్లు ఇంకా ఇవ్వక పోవడం అమరావతి పనులు అనుకున్నంత వేగంగా జరగకపోవడం పట్ల. అలాగే కొత్తగా మరో 34 వేల ఎకరాలు భూ సమీకరణ చేస్తామని చెప్పడంతో తమ పరిస్థితి ఏంటి అనే దానిపైన వారు ఆగ్రహంతో ఉన్నారు. దీనిపై పోరాటం చేయడం ద్వారా అమరావతి ప్రాంతానికి దగ్గరయ్యే ప్రయత్నం చేసే అవకాశం వైసీపీకి ఉంది. కానీ వైసీపీ ఎంతసేపూ వర్షాలు వస్తే "అమరావతి మునిగిపోతుంది.. భూములు చెరువుల్లాగా అయిపోతున్నాయి" అంటూ చేస్తున్న విమర్శల ద్వారా అసలు ఏం సాధించదలుచుకుంది అనే దానిపై స్పష్టత ఇవ్వలేక పోతోంది అని అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా నడుస్తోంది.





















