Chandrababu Naidu: రాయలసీమలోనూ చంద్రబాబు వదల్లేదుగా- వైసీపీని కుదేలు చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ
Rayalaseema Election Result 2024: గతంలో రాయలసీమలో తమ పార్టీకి జరిగిన పరాభవానికి చంద్రబాబు తగిన ప్రతీకారం తీర్చుకున్నారని రాయలసీమ ఫలితాలు చూసిన విశ్లేషకులు చెబుతున్నారు.
Rayalaseema Assmbly Elction Result 2024: ఈ ఎన్నికల్లో ఏపీ లోని మిగతా ప్రాంతాల్లో ఎన్ని సీట్లొచ్చాయన్న విషయం కన్నా రాయలసీమలో జగన్, చంద్రబాబు ప్రాభవంపైనే పెద్దగా చర్చ జరుగుతోంది. గతంలో రాయలసీమలో తమ పార్టీకి జరిగిన పరాభవానికి చంద్రబాబు తగిన ప్రతీకారం తీర్చుకున్నారని రాయలసీమ ఫలితాలు చూసిన విశ్లేషకులు చెబుతున్నారు.
2019లో రాయలసీమ నుంచి తెదేపా గెలిచిన సీట్లు కేవలం మూడు. మరి ఇప్పుడు..? 52 నియోజకవర్గాలకు గానూ 10 సీట్లలో మాత్రమే వైకాపా అభ్యర్థులు లీడ్ లో ఉన్నారు. అంటే మిగిలిన 42 సీట్లలోనూ కూటమి అభ్యర్థులే విజయ కేతనం దిశగా దూసుకుపోతున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ని మినహాయిస్తే కేవలం తొమ్మిది మందికి మాత్రమే ప్రస్తుతం విజయావకాశాలున్నాయి.
తెదేపా 2019 ఎన్నికల్లో రాయల సీమ నుంచి ఉరవకొండ, కుప్పం, హిందూపురం నియోజకవర్గాల్లో మాత్రమే విజయం సాధిచింది. ప్రస్తుతం 42 సీట్లలో కూటమి గెలవబోతోంది.
రాయలసీమలో వైకాాపా లీడింగ్ లో ఉన్న 10 నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి జగన్ పోటీ చేసిన కడప జిల్లా పులివెందుల ఒకటి. ఇక్కడ 17 రౌండ్ల కౌంటింగ్ పూర్తవ్వగా సీఎం జగన్ తన సమీప తెదేపా అభ్యర్థి బీటెక్ రవిపై 50 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు. ఆయన విజయం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.
ఆ తరువాతి స్థానంలో కడప జిల్లాకే చెందిన బద్వేల్ నియోజక వర్గంలో దాసరి సుధ తన సమీప తెదేపా అభ్యర్థి బొజ్జా రోషణ్ణపై ప్రస్తుతానికి 16 వేల ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు. మరో మూడు రౌండ్ల ఓట్ల లెక్కింపూ మిగిలి ఉన్న నేపథ్యంలో ఈమె విజయం కూడా దాదాపు ఖరారైనట్లే.
మంత్రాలయంలో బాలనాగిరెడ్డి 11 వేల ఓట్ల మెజారిటీ, తంబాళపల్లిలో ద్వారకానాథ్ రెడ్డి 9500 ఓట్ల మెజారిటీ, రాజంపేటలో అమర్ నాథ్ రెడ్డి 8300 ఓట్ల మెజారిటీ, పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 6600 ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు.
ధర్మవరం వైకాపా అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తన సమీప అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ పై కేవలం 115 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. అలాగే సత్యవేడులో వైకాపా అభ్యర్థి నూకతోటి రాజేశ్ సమీప తెదేపా అభ్యర్థి కోనేటి ఆదిమూలంపై 133 ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో ఇంకా చాలా రౌండ్ల కౌంటింగ్ బాకీ ఉంది కాబట్టీ.. ఏదైనా జరగొచ్చు. ఇకపోతే.. రాయచోటిలో గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఆలూరు నియోజకవర్గంలో విరూపాక్షిసైతం నాలుగు వేల లోపు మెజారిటీతోనే కొనసాగుతున్నారు. ఇంకా అయిదు రౌండ్లకు పైగా కౌంటింగ్ మిగిలి ఉండటంతో ఇక్కడా ఫలితాలు తారుమారయ్యే అవకాశముంది.
ఇలా చూస్తూ రాయలసీమలో పది లోపే స్థానలతో ఈ సారి వైకాపా సింగిల్ డిజిట్ స్థానాలకే పరిమితమయ్యే అవకాశం కనిపిస్తోంది.