Andhra Politics : వైఎస్ఆర్‌సీపీని విమర్శించి అంతకు మించి ఉచిత హామీలు - చంద్రబాబు నిధులెక్కడి నుంచి తెస్తారు ?
వైఎస్ఆర్‌సీపీని విమర్శించి అంతకంటే ఎక్కువ ఉచిత పథకాలు ప్రకటించారు చంద్రబాబు. ఆయన కూడా గెలవడానికి ఉచితపథకాల్నే నమ్ముకుంటున్నారా? ఆర్థిక సామర్థ్యం ఎలా సమీకరించుకుంటారు ?
Andhra Politics : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నవరత్నాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. నాలుగేళ్లుగా పథకాల అమలు కోసం అభివృద్ధిని పక్కన పెట్టడంతో విపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. పథకాల పేరుతో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారని ఆరోపిస్తున్నాయి. టీడీపీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు ఈ విషయంపై తీవ్ర విమర్శలు చేసేవారు. మరి ఇప్పుడు మహానాడులో మొదటి విడత మేనిఫెస్టోలో ఆరు పథకాలను ప్రకటించారు. ఇవన్నీ ఉచిత పథకాలే. మరి వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్ అమలు చేస్తున్న పథకాల వల్ల రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు పడితే... మరి చంద్రబాబు ప్రకటించిన పథకాల వల్ల సమస్యలు రావా ? అనేది ఎక్కువ మందికి వస్తున్న సందేహం. చంద్రబాబు తన సహజశైలికి విరుద్ధంగా వెళ్లారా అన్న అభిప్రాయం కూడా అక్కడే వినిపిస్తోంది.
జీతాలకూ ఆర్బీఐ దగ్గర అప్పు తెచ్చుకోవాల్సిన ఆర్థిక పరిస్థితి .
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి ఎలా ఉంది ?. ఒకటో తేదీన ఉద్యోగులకు జీతం ఇవ్వాలంటే ఆర్బీఐ దగ్గర అప్పు పుట్టించుకోవాల్సిన పరిస్థితి. ఒక్క జీతాలే కాదు ఏ పథకం ఇవ్వాల్సి వచ్చినా అదే. రాష్ట్రం ఎక్కడ ఆస్తులు తాకట్టు పెట్టగలిగేవి ఉంటే తాకట్టు పెట్టి తెచ్చుకునే అప్పులు తెచ్చారని టీడీపీ నేతలు చాలా కాలంగా ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితి రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా మారదు. ఇప్పుడు పథకాలకే సరిపోని నిధులు.. అప్పుడు టీడీపీ పథకాలు అమలు చేయడానికి ఎలా సరిపోతాయన్నది ఇప్పుడు ప్రజలకూ వస్తున్న సందేహం. దీనికి టీడీపీ నేతలు సంపద సృష్టి అనే మాట ద్వారా సమాధానం చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
వచ్చే ప్రభుత్వం ముందు అనేక ఆర్థిక సవాళ్లు
ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య పరిస్థితి దీన స్థితికి చేరిందని నిపుణులు చెబుతున్నారు. వచ్చే ప్రభుత్వానికి అప్పులు, తాకట్టు అనే ఆప్షన్ కూడా ఉండదని అంటున్నారు. ఖచ్చితంగా వచ్చే ప్రభుత్వం పథకాలు అమలు చేయాలంటే సంపద సృష్టించాలి. ఆదాయం పెంచుకోవాలి. ఆ సంపదనే ప్రజలకు పంచాలి. సంపద సృష్టి చేతనైన నాయకుడికే పథకాలు అమలు చేసే సామర్థ్యం ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఐదేళ్ల కిందట లక్ష రూపాయల ఆదాయం ఉంటే.. ఇప్పుడు లక్షన్నర ఉండాలి. అలా ఉంటే జీతం పెరిగినట్లుగా కాదు. ద్రవ్యోల్బణంకు తగ్గట్లుగా ఆదాయం సమాన స్థితికి చేరినట్లు. అంత కంటే ఎక్కువగా ఉంటే.. సంపదను సృష్టించుకున్నట్లు. చంద్రబాబు హయాంలో ఐదేళ్లలో ఏపీ ప్రభుత్వ పన్ను ఆదాయం రెట్టింపు అయిందని.. కానీ జగన్ ప్రభుత్వం ఉన్న నాలుగేళ్లలో ఇరవై ఐదు శాతం కూడా పెరగలేదని టీడీపీ నేతలు కొన్ని లెక్కలు సోషల్ మీడియాలో విడుదల చేశారు. అది చంద్రబాబు పాలనా సామర్థ్యమని చెబుతున్నారు.
ప్రభుత్వ ఆదాయం పెరగాలంటే వ్యాపారాలు పెరగాలి !
ఏ రాష్ట్రంలో అయినా ఆదాయం పెరగాలంటే వ్యాపార వ్యవహారాలు పెరగాలి. ఉదాహరణకు ప్రభుత్వం ఒక్క ఏడాదిలో రూ. లక్ష కోట్లు ఇన్ ఫ్రా మీద ఖర్చు పెడితే నేరుగా పన్నుల రూపంలో కనీసం నలభై శాతం అంటే నలభై వేల కోట్లు ప్రభుత్వానికే వస్తాయి. అంటే నికరంగా ప్రభుత్వం పెట్టే ఖర్చు అరవై వేల కోట్లే ఉంటుంది. అదే లక్ష కోట్లు.. బటన్ నొక్కి అకౌంట్లలో వేస్తే.. రూపాయి కూడా రాదు. ఒక వేళ ఆ డబ్బుతో లబ్దిదారులు మద్యంతాగితే అంత కంటే ఎక్కువే వస్తుంది. కానీ ఇలాంటి పథకం వల్ల అటు తీసుకున్న వారికి.. లఇటు ఖర్చు పెట్టుకున్న వారికీ అసంతృప్తే ఉంటుంది. అదుకే ఏపీలో వ్యాపార వ్యవహారాలు పెరిగితే ఆటోమేటిక్ గా ఆదాయం పెరుగుతుందని అంచనా. ఇదే అంశాన్ని టీడీపీ హైలెట్ చేస్తోంది.చంద్రబాబు ఇచ్చే పథకాలు అమలు చేయడానికి ఆయనకు సంపద సృష్టి అనే మార్గం ఉందని.. వాదిస్తున్నారు. చంద్రబాబు తన సహజ శైలికి భిన్నంగా వెళ్లలేదని.. గతంలోనూ పథకాలు పెట్టారని గుర్తు చేస్తున్నారు. ట
మొత్తంగా చంద్రబాబు ప్రకటించిన ఆరు భవిష్యత్ గ్యారంటీ పథకాలు ప్రజల్లో చర్చకు కారణం అవుతున్నాయి. ఓ రాజకీయ పార్టీకి కావాల్సింది కూడా ఇదే.