KCR Politics: కేసీఆర్ ఇప్పటికింతే! బీఆర్ఎస్ తెలంగాణకే పరిమితం, దేశంలో ప్రభావం లేనట్టే!
BRS Politics: జాతీయ స్తాయిలో చక్రం తిప్పాలనుకున్న మాజీ సీఎం కేసీఆర్.. యూటర్న్ తీసుకున్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ని తెలంగాణకే పరిమితం చేయాలని నిర్ణయించున్నారా!
Lok Sabha Elections in Telangana 2024: రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. నిన్నటి మాట నేడు మారిపోవచ్చు. నిన్న పరిస్థితి రేపు ఉండకపోవచ్చు. సో.. రాజకీయాల్లో నాయకులకు వ్యూహాలు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఇప్పుడు తెలంగాణ(Telangana) ప్రధాన ప్రతిపక్షం భారత్ రాష్ట్ర సమితి(Bharat Rastra Samithi) కూడా తన వ్యూహాలను మార్చుకున్నట్టు తెలుస్తోంది. పరిస్థితులు ప్రభావాలు.. కీలక అంశాలు.. ఎదురవుతున్న సవాళ్లు.. ఇప్పటికే ముంచెత్తిన కష్టాలు వంటి వాటిని పరిగణనలోకి తీసుకుని బీఆర్ ఎస్ తన వ్యూహాన్ని పరిమితం చేసుకుందని పక్కా సమాచారం.
ఏంటీ వ్యూహం?
తెలంగాణ ఉద్యమం కోసం.. అలుపెరుగని పోరాటం చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు(KCR) ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రసమితి(TRS) పార్టీని స్థాపించి.. ఎన్నికల్లో విజయం దక్కించుకున్నా రు. రాష్ట్రాన్ని సైతం ఇదే పేరుతో సాధించారు. వరుసగా తెలంగాణలో ఆయన అధికారంలోకి కూడా వచ్చారు. అయితే.. రెండో దఫా అధికారంలోకి వచ్చాక కేసీఆర్.. తన పార్టీని జాతీయ స్థాయి(National Politics)లో విస్తరించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే టీఆర్ ఎస్‌ను కాస్తా.. భారత రాష్ట్రసమితి(BRS)గా మార్చారు. ఈ పార్టీని దేశవ్యాప్తంగా ప్రచారంలోకి తీసుకువచ్చి 2024 పార్లమెంటు ఎన్నికల్లో ఇతర ప్రాంతీయ పార్టీలను కూడగట్టి `తృతీయ పక్షం` ఏర్పాటుకు వ్యూహం సిద్ధం చేశారు.
రాష్ట్రాలు చుట్టేసి..
ఈ క్రమంలో కర్ణాటక, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర సహా బిహార్, ఉత్తరప్రదేశ్‌లలో తనతో కలిసి వచ్చే వారిని కలుపుకొని ముందుకు సాగాలని భావించారు. మొత్తంగా కేంద్రంలోని బీజేపీ(BJP) సర్కారుపై ఒక పెద్ద యుద్ధమే ప్రకటించారు. ఇతర పార్టీలకు కూడా ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలోనే తమిళనాడుకు ఒకటికి పదిసార్లు కేసీఆర్ వెళ్లారు. ఇక, మహారాష్ట్రకు కూడా ఇలానే పయనమయ్యారు. తన వ్యూహాలను వివరించి.. జాతీయ స్థాయిలో మోడీ ప్రభుత్వంపై పోరాడదామన్నారు.
యూటర్న్ ఎందుకు?
జాతీయ స్తాయిలో చక్రం తిప్పాలని అనుకున్న మాజీ సీఎం కేసీఆర్(KCR).. ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ ఎస్ పార్టీని కేవలం రాష్ట్రానికే పరిమితం చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలి సింది. శుక్రవారం పార్టీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో అంతర్గతంగా ఈ నిర్ణయం వైపే కేసీఆర్ మొగ్గు చూపినట్టు విశ్వసనీయ సమాచారం. మరి ఇలా ఎందుకు జరిగినట్టు ? బీఆర్ ఎస్ గా పార్టీని మార్చడం వెనుక ఉన్న వ్యూహాన్ని హటాత్తుగా ఎందుకు మార్చుకున్నారనేది ఆసక్తికర విషయం. దీనికి ప్రధానంగా.. తెలంగాణలో మూడో సారి కూడా గెలుస్తామని అనుకున్న పార్టీ ఓడిపోవడం, కేంద్రంలో మోడీ ప్రభుత్వం, ఆయన వ్యక్తిగత ఇమేజ్ కూడా రెట్టింపు అయిందన్న సంకేతాలు, ప్రాంతీయ పార్టీల(local parties)తో సమన్వయ లేమి వంటివి కారణాలుగా ఉన్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. దీనికి తోడు అనారోగ్య సమస్యలు కూడా వెంటాడుతున్నాయి.
16 స్థానాల్లోనే పోటీ
ఇక, వీటితో పాటు కంటికి కనిపించని రెండు కారణాలు ఉన్నాయని కూడా చెబుతున్నారు. మాజీ సీఎం కుమార్తె కవిత(Kavitha)పై లిక్కర్ కేసు ఉండడం, రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై అవినీతి మరకలు పడిన దరిమిలా.. దూకుడు తగ్గిస్తేనే మంచిదని సార్ నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి బీఆర్ ఎస్ .. ఈ సారికి తెలంగాణకే అందునా.. 17 పార్లమెంటుస్థానాల్లో కేవలం 16 స్థానాల(ఒకటి ఎంఐఎంకు ఇస్తారు)కే పరిమితం కానుంది. అయితే.. కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం.. పార్టీ భవిష్యత్తుపై ప్రభావం పడుతుందని పరిశీలకులు చెబుతున్నారు. ఇప్పుడు పోటీ చేయకపోతే.. మరో ఐదేళ్లపాటు ఎదురు చూడడంతోపాటు అప్పటికి పరిస్థితులు ఎలా మారతాయో కూడా ఊహించలేమని కూడా వారు చెబుతున్నారు.