AP BJP: జోరు పెంచిన ఏపీ బీజేపీ, నేటి నుంచి పల్లెబాట
BJP Palle Bata : రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ జోరు పెంచుతోంది. పల్లెబాట పేరుతో రెండు రోజులపాటు గ్రామాల్లో ఇంటింటికీ తిరిగాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది.
Andhra Pradesh BJP Palle Bata: రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ జోరు పెంచుతోంది. కేంద్ర నాయకత్వం ఒకవైపు కూటమిలో చేరే దిశగా చర్చలు జరుపుతుంటే.. రాష్ట్ర నాయకత్వం రాష్ట్రంలో బలాన్ని పెంచుకునే దిశగా కార్యకలాపాలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే పల్లెబాట పేరుతో రెండు రోజులపాటు గ్రామాల్లో ఇంటింటికీ తిరిగాలని నిర్ణయించింది. గడిచిన పదేళ్లలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఎటువంటి లబ్ధి చేకూర్చింది, భవిష్యత్‌లో ఏం చేయబోతోందన్న విషయాలను ప్రజలకు ఈ కార్యక్రమంలో భాగంగా వివరించనున్నారు. పల్లెకుపోదాం పేరుతో ఈ కార్యక్రమాన్ని శనివారం నుంచి నిర్వహించేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం సిద్ధమైంది. ఒక పక్క కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ప్రజలు దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఈ రెండు రోజుల కార్యక్రమంలో భాగంగా వివిధ స్థాయిల్లోని పార్టీ బాధ్యుతలు గ్రామాలకు వెళ్లనున్నారు.
కృష్ణా జిల్లా గుడివాడలో పురందేశ్వరి
పల్లెకు పోదాం కార్యక్రమంలో భాగంగా పాల్గొనేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం పరిధిలోని క్రోసూరు గ్రామంలో శని, ఆదివారాల్లో ఆమె పర్యటించనున్నారు. రెండు రోజులపాటు ఇదే గ్రామంలో ఉండి ఇంటింటికి వెళ్లి సమస్యలను తెలుసుకోవడంతోపాటు కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించి బీజేపీకి అండగా ఉండాలని కోరనున్నారు. పల్లెకు పోదాం కార్యక్రమంలో బీజేపీతోపాటు బీజేపీ అనుబంధ విభాగాలు పాల్గొనేలా ఇప్పటికే పార్టీ నాయకత్వం నుంచి ఆదేశాలు అందాయి. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉన్న నాయకులు, కార్యకర్తలు ఈ రెండురోజులపాటు గ్రామాల్లోని ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలవనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గత వారం 25 పార్లమెంట్ నియోజకవర్గాలు పరిధిలో కార్యాలయాలు ఏర్పాటు చేసిన బీజేపీ.. తాజాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. రానున్న సార్వత్రిక ఎన్నికలకు కేడర్‌ను సమాయత్తపరిచే దిశగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం అడుగులు వేస్తోంది.
కేంద్ర పార్టీకి నివేదిక
పల్లెకు పోదాం కార్యక్రంలో భాగంగా గుర్తించిన అంశాలు, సమస్యలను రాష్ట్ర నాయకత్వం కేంద్ర నాయకత్వానికి నివేదిక రూపంలో అందించనుంది. ఆయా గ్రామాల్లో పర్యటించే నేతలు, కార్యకర్తలు ప్రజలతో మమేకమవుతూ వివిధ అంశాలపై చర్చిస్తారు. మరో వైపు స్థానికంగా ఉన్న పరిస్థితులను అవగతం చేసుకోవడంతోపాటు కేంద్ర నాయకత్వం దృష్టికి అక్కడ ఉన్న ఇబ్బందులు, ఇతర అంశాలను తీసుకెళ్లనున్నారు. అవసరమైతే స్థానికంగా ఉండే సమస్యలను పరిష్కరించేందుకు పోరాటాలు, నిరసన కార్యక్రమాలను భవిష్యత్‌లో నిర్వహించేలా బీజేపీ రాష్ట్ర నాయకత్వం దృష్టి సారించనుంది. మరో మూడు నెలలపాటు ప్రజాక్షేత్రంలోనూ ఉంటే పార్టీని బలోపేతం చేయడంతోపాటు పదేళ్లలో మోదీ ప్రభుత్వం చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం అడుగులు వేస్తోంది. మరో వైపు పొత్తు చర్చలు ముగిసి, సీట్ల పంపకాలు పూర్తయితే బీజేపీ రాష్ట్రంలో మరింత జోరు పెంచే అవకాశముందని చెబుతున్నారు. రానున్న ఎన్నికల్లో కనీసం మూడు నుంచి ఐదు పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా రాష్ట్ర బీజేపీ పెట్టుకుంది. ఇందుకోసం ఇప్పటికే గ్రౌండ్ లెవెల్‌లో పని చేస్తోంది. తాజాగా చేపట్టిన కార్యక్రమం అందుకు మరింత బలాన్ని చేకూరుస్తుందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.