Bandi Sanjay : తెలంగాణ బీజేపీలో రహస్య సమావేశాల కలకలం - గీత దాటితే వేటు తప్పదన్న బండి సంజయ్ !
బండి సంజయ్‌కు వ్యతిరేకంగా బీజేపీ అసమ్మతి వాదులు సమావేశం అయ్యారు. అయితే గీత దాటితే వేటు వేస్తామని వారికి బండి సంజయ్ నేరుగా హెచ్చరికలు పంపారు.
తెలంగాణ బీజేపీలో సీక్రెట్ మీటింగ్స్ కలకలం రేపుతున్నాయి. నేరుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు వ్యతిరేకంగా కరీంనగర్ నేతలు ఏకమవుతున్నారు. హైదరాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన గుజ్జుల రామకృష్ణారెడ్డి, రాములు, సుగుణాకర్ రావు, వెంకటరమణి వంటి పలువురు నేతలు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో సమావేశమయ్యారు. బండి సంజయ్ తీరుపైనే అసమ్మతి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వడం లేదనే అంశంపై పలువురు సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. వీరి సమావేశం కలకలం రేపడంతో మాజీ ఎమ్మెల్యే ఇంద్రసేనారెడ్డి అసమ్మతి నేతలతో చర్చించారు. భవిష్యత్తులో ఈ రకంగా అసమ్మతి సమావేశాలు నిర్వహించవద్దని సూచించారు.
ఈ సమావేశాలపై బండి సంజయ్ మండిపడ్డారు. పార్టీ సిద్దాంతాలు, విధానాలకు లోబడి అందరూ పనిచేయాల్సిందేనని ..ఎవరైనా గీత దాటితే వేటు తప్పదని హెచ్చరించారు. ఏ పార్టీలోనైనా కొందరు నిత్య అసంతృప్తి వాదులుంటారన్నారు. వారు పని చేయరు. పనిచేసే వారిపై అక్కసు వెళ్లగక్కుతారని బండి సంజయ్ మండిపడ్డారు.అలాంటి వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. పార్టీ కోసం చిత్తశుద్దతో కృషి చేయాలని బండి సంజయ్ కోరారు.అధికారంలోకి వచ్చే సమయమిదని ఆయన చెప్పారు. తప్పుదారి పట్టించే మాటలు నమ్మి దారి తప్పితే మీ రాజకీయ భవిష్యత్తు దెబ్బతింటుందని బండి సంజయ్ అసమ్మతి నేతలకు హెచ్చరికలు పంపారు.
పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్టీ తమను పట్టించుకోవడం లేదని కరీంనగర్ జిల్లా స్థానిక నేతలు ఆరోపణలు చేస్తున్నారు. బండి సంజయ్ స్థానిక కార్యక్రమాలకు తమకు సమాచారం ఇవ్వడం లేదని, కొత్తగా పార్టీలో చేరిన వారికి ఇచ్చిన గుర్తింపు తమకు దక్కడం లేదని ఆత్మగౌరవ సమావేశం నిర్వహించారు. బీజేపీలో కొత్తగా చేరిన వారికే ప్రాధాన్యత ఇవ్వడంపై ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఇంతకాలం పార్టీ అభివృద్ది కోసం పనిచేయలేదా అని ప్రశ్నించారు. ఈ రకమైన రహస్య సమావేశాలపై బీజేపీ నాయకత్వం సీరియస్ అయ్యింది. కొందరిపై పార్టీ నాయకత్వం చర్యలు తీసుకొంటారనే చర్చ కూడా సాగింది. కానీ అసమ్మతి నేతలపై చర్యలు తీసుకోలేదు.
కొంత కాలం సైలెంట్‌గా ఉన్న అసమ్మతి నేతలు మరోసారి తమ వాదన వినిపిస్తూ తెరపైకి వచ్చారు. అయితే మరోసారి అదే తరహాలో సమావేశం కావడంతో పార్టీ నాయకత్వం ఏ రకమైన చర్యలు తీసుకొంటుందనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. బండి సంజయ్ కూడా ఇలాంటి నేతలపై తక్షణం వేటు వేయాలని లేకపోతే ఇలాంటి రహస్య సమావేశాల సంస్కృతి పెరిగిపోతుందని భావిస్తున్నారు. హైకమాండ్ అనుమతిస్తే కొంత మందిపై ఆయన వేటు వేసే అవకాశం ఉంది