AP Capital News: మోసం చేసేందుకే 3 రాజధానులు: రెబల్ ఎంపీ రఘురామ సంచలన వ్యాఖ్యలు
Capital News: మూడు రాజధానుల పేరుతో ప్రజలను వైసీపీ సర్కారు మోసం చేస్తోదంని ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు.
Capital News: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కారు 3 రాజధానుల పేరుతో ప్రజలను మోసం చేస్తోందని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. శాసన సభలో మరో సారి 3 రాజధానుల బిల్లు పెడతామంటున్నారని, అది ప్రజలను మోసగించడానికే ఉపయోగపడుతుందని విమర్శించారు. దిల్లీలో మీడియాతో మాట్లాడిన రఘురామ.. ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఏపీ రాజధానులపై రాష్ట్ర హైకోర్టు ఇప్పటికే తీర్పు ఇచ్చిందని గుర్తు చేసిన రఘురామ కృష్ణరాజు.. ఆ తీర్పుపై జగన్ సర్కారు అప్పీలుకు వెళ్లలేదని అన్నారు. ప్రజా రాజ్యం పార్టీలో ఉన్నప్పుడు వైసీపీని జైలు పార్టీ అని మాజీ మంత్రి కన్న బాబు విమర్శించారు. రేపు ఆయన మరోసారి పార్టీ మారితే ఎవరిని విమర్శస్తారోనని ఆర్ఆర్ఆర్ ఎద్దేవా చేశారు.
మంత్రులు, మాజీ మంత్రులపై కేసు పెట్టాలి
రాష్ట్ర మంత్రులు, మాజీ మంత్రులు.. ప్రజల మధ్య, వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడాన్ని ఏమాత్రం సహించవద్దని ఎంపీ రఘురామ సూచించారు. అలాంటి వ్యాఖ్యలు చేసిన వారిపై ప్రతిపక్ష నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. పోలీసులు మంత్రులు, మాజీ మంత్రులపై కేసు నమోదు చేయకపోతే మేజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేటు పిటిషన్ దాఖలు చేయాలని చెప్పారు.
అభివృద్ధి వికేంద్రీకరణ అనేది సాకు మాత్రమే
ఈ మధ్యే ఏపీ 3 రాజధానులపై రఘురామకృష్ణరాజు షాకింగ్ కామెంట్స్ చేశారు. రాజధానిని నిర్ణయించే హక్కు ఆయా రాష్ట్రాలకే ఉందని కేంద్రం అఫిడవిట్ లో చెప్పడం బాధ కలిగించిందని అన్నారు. అమరావతి నుండి రాజధానిని ఎందుకు మార్చారని అడిగితే.. అభివృద్ధి వికేంద్రీకరణ అని చెబుతున్నారని ఆర్ఆర్ఆర్ వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలో లేనిది ఏంటి అని ప్రశ్నించారు.
విశాఖ ఇప్పటికే అభివృద్ధి చెందింది
విశాఖ ఇప్పటికే ఎంతో అభివృద్ధి చెందిందని రఘురామ కృష్ణ రాజు అన్నారు. విశాఖలో లేనిది ఏముందని ప్రశ్నించారు. దేశంలోనే అతి పెద్ద స్టీల్ ప్లాంట్ వైజాగ్ లో ఉందన్నారు. దేశంలోని ప్రధాన పోర్టుల్లో ఒకటి అయిన విశాఖ పోర్టు దేశంలోనే అత్యధిక ఎగుమతులు జరుపుతోందని అన్నారు. గంగవరం పోర్టు కూడా విశాఖపట్నం దగ్గర్లోనే ఉందని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్ పోర్టు సైతం సమీపంలోనే వస్తోందని గుర్తు చేశారు. శ్రీకాకుళంలో చాలా పరిశ్రమలు ఉన్నాయన్నారు. ఇప్పటికే ఎంతో అభివృద్ధి చెందిన విశాఖను రాజధాని పేరు చెప్పి, అభివృద్ధి వికేంద్రీకరణ అని అంటూ ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్పడం కామెడీ చేసినట్టేనని ఎద్దేవా చేశారు. ఎంతో ఎదిగిన విశాఖ నగరాన్ని మీరు పాడు చెయ్యడం తప్పా.. రాజధాని పేరుతో అక్కడ ఏమీ జరగదని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు.
Also Read: AP Assembly Live Updates: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం, వాయిదా తీర్మానంపై చర్చకు విపక్షాల పట్టు
Also Read: Three Capital Agenda : సంక్షేమ జెండానా .. మూడు రాజధానుల అజెండానా ? సీఎం జగన్ ఎంచుకునే ఆప్షన్ ఏది ?