Nizamabad News: ఆర్మూర్ బీజేపీ టికెట్ ఆశావహుల్లో ఆందోళన, తెరపైకి కొత్త లీడర్!
ఆర్మూర్ నియోజకవర్గం బీజేపీ టికెట్ ఆశిస్తున్న వారిలో కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. గత ఎన్నికల్లో ఆర్మూర్ బీజేపీ అభ్యర్థిగా వినయ్ రెడ్డి పోటీ చేసి జీవన్ రెడ్డి మీద ఓడిపోయారు.
సాధారణ ఎన్నికలకు ఇంకా 6 నెలల సమయంలో ఉన్నప్పటికీ... ప్రధాన పార్టీల్లో రాజకీయంగా హీట్ మొదలైంది. ఎన్నికలకు అంతర్గతంగా ఎవరికి వారే సమాయత్తమవుతున్నారు. ఆయా ప్రధాన పార్టీల్లో ఆశావహులు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పార్టీలో లేని పారిశ్రామిక వేత్తలు కూడా ఈ సారి ఉమ్మడి జిల్లాలో కొందరు బరిలో దిగేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఆర్మూర్ నియోజకవర్గం బీజేపీలో కొత్త పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. గత ఎన్నికల్లో ఆర్మూర్ బీజేపీ అభ్యర్థిగా వినయ్ రెడ్డి పోటీ చేసి జీవన్ రెడ్డి మీద ఓడిపోయారు. ఈ సారి కూడా టికెట్ తనకే వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు వినయ్ రెడ్డి. గత పార్లమంట్ ఎన్నికల్లో అరవింద్ విజయంలో వినయ్ రెడ్డి కూడా కీలక పాత్ర పోషించారు. ఆర్మూర్ నుంచి ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి మంచి ఓట్లు వచ్చాయి.
ఆర్మూర్ నియోజకవర్గంలో బీజేపీని బలోపేతం చేయటంలో వినయ్ రెడ్డి బాగానే కష్టపడ్డారని చెప్పుకుంటారు క్యాడర్. వినయ్ రెడ్డికి అక్కడ ఫాలోయింగ్ కూడా ఉంది. అయితే వినయ్ రెడ్డి ఆర్మూర్ లోకల్ కావటం కూడా అతనికి కలిసోచ్చే అంశం. ఇప్పటి వరకు ఆర్మూర్ స్థానికులు ఎవరూ పోటీ చేయలేదు. అయితే, గత కొన్ని రోజులుగా వినయ్ రెడ్డికి, ఎంపీ అరవింద్ మధ్య బేదాభిప్రాయాలు ఉన్నాయన్న ప్రచారం ఉంది. ఎంపీ అరవింద్ వినయ్ రెడ్డికి ప్రాధాన్యం ఇవ్వటం తగ్గించారని పార్టీలో గుసగసలు వినిపిస్తున్నాయి. కానీ వినయ్ రెడ్డి మాత్రం ఆర్మూర్ లో పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు.
అసెంబ్లీకి పోటీ చేయాలని అర్వింద్ ఆలోచన!
అయితే ఈ సారి ఎంపీ అరవింద్ పార్లమెంట్ కు కాకుండా అసెంబ్లీకి వెళ్లాలని అనుకుంటున్నారన్న ప్రచారం కూడా ఉంది. ఎంపీ క్యాంపు కార్యాలయం కూడా ఆర్మూర్ లో ఏర్పాటు చేసుకున్నారు. ఎంపీ మనసంతా ఆర్మూర్ నియోజకవర్గంపై ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. ఆర్మూర్ లో మున్నూరు కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉంటాయి. అరవింద్ కూడా అదే సామాజిక వర్గం కావటంతో ఆర్మూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
అంకాపూర్ నుంచి ఇంకో వ్యక్తి
మరోవైపు ఆర్మూర్ నియోజకవర్గం అంకాపూర్ కు చెందిన పైడి రాకేష్ రెడ్డి పారిశ్రామిక వేత్త. గత కొద్ది రోజులుగా పైడి రాకేష్ రెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. పలు సందర్భాల్లో ఆయన ప్రజా సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొస్తున్నారు. అయితే రాకేష్ రెడ్డి బీజేపీ ఢిల్లీ పెద్దలతో టచ్ లో ఉన్నారన్న ప్రచారం జోరందుకుంది. త్వరలోనే బీజేపీలోకి చేరుతారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ఆర్మూర్ అసెంబ్లీ టికెట్ తనకు ఇస్తే పార్టీలో చేరేందుకు పైడి రాకేశ్ రెడ్డి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకింత రాకేశ్ రెడ్డికి ఢిల్లీ బీజేపీ పెద్దలు టికెట్ హామీ కూడా ఇచ్చారన్న ప్రచారం కూడా జరుగుతోంది.
అంటే ఆర్మూర్ బీజేపీలో టికెట్ కోసం ట్రయాంగిల్ వార్ నడుస్తోందన్నమాట. మొదట్నుంచి ఆర్మూర్ టికెట్ పై ఆశలు పెట్టుకుంటూ పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు వినయ్ రెడ్డి. మరోవైపు ఈ సారి ఆర్మూర్ నుంచే బరిలోకి ఎంపీ అరవింద్ ఉంటారన్న మరో ప్రచారం.. కొత్తగా రాకేష్ రెడ్డి పేరు తెరపైకి రావటం.. ఆర్మూర్ బీజేపీ క్యాడర్ ను కన్ఫ్యూజన్ లోకి నెట్టేస్తోంది. ఆర్మూర్ టికెట్ ఎవరికి దక్కనుందో చూడాలి మరి.