CM Chandrababu: 15 మంది ఎమ్మెల్యే లకు చంద్రబాబు వార్నింగ్, ఇలాగైతే సీటు గల్లంతే అంటూ అసహనం
Andhra Pradesh News | టీడీపీ విస్తృత స్థాయి సమావేశానికి డుమ్మా కొట్టిన ఎమ్మెల్యేకు చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ఇలాగైతే సీటు గలంతే అంటూ అసహనం వ్యక్తం చేశారు.

సొంత పార్టీ ఎమ్మెల్యేలపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది ముగిసిన సందర్భంగా ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశానికి 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. వారే కాకుండా పార్టీకి సంబంధించిన వివిధ పదవుల్లో ఉన్న ఆహ్వానితులు మరో 41 మంది కూడా ఏకంగా చంద్రబాబు ఏర్పాటు చేసిన కీలక సమావేశానికి రాలేదు. "మీరు ఏం చేస్తున్నారో నాకు తెలుసు" అంటూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వారిలో కొంతమంది దైవ కార్యక్రమాల్లో ఉన్నామనీ మరి కొంతమంది విదేశాల్లో ఉన్నామని తెలపడంతో ఇంత పెద్ద పార్టీ కార్యక్రమం ఉండగా వేరే ప్రోగ్రామ్స్ ఎలాగ ఫిక్స్ చేసుకుంటారంటూ చంద్రబాబు ప్రశ్నించారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాలని నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండకుండా ఇవి ఇతర కార్యక్రమాలు ఏంటి అంటూ ఆయన గట్టిగానే అడిగారు.
విదేశాల్లోనే ఉండిపోండి : ఎమ్మెల్యే లపై చంద్రబాబు ఫైర్
విదేశాల్లో ఉన్న కొన్ని తెలుగు సంఘాలు ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఈ 15 మంది ఎమ్మెల్యేల్లో కొంతమంది వెళ్లినట్టు తెలియడంతో "ప్రజలు, పార్టీ కంటే విదేశీ టూర్లు ఎక్కువైతే మీరు అక్కడే ఉండిపోండి " అంటూ చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు.
ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేలకు చంద్రబాబు క్లాస్
అలాగే ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యేలకు కూడా చంద్రబాబు నాయుడు క్లాస్ పీకారు. జనాల్లో ఉండమని తాను చెబుతుంటే ఈ ఎమ్మెల్యేలు తనకే సలహాలు ఇస్తున్నారు అంటూ సెటైర్స్ వేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఎవరెవరు ఎంతెంత సేపు ఉన్నారో తనకు తెలుసని ఆయన అన్నారు. 15 మంది ఎమ్మెల్యేలతో కలిపి ఏకంగా 56 మంది ఆహ్వానితులు ఏకంగా తన కార్యక్రమానికే డుమ్మా కొట్టడంతో ఆయన కోపం కట్టలు తెంచుకుంది. ఇలాగైతే 2029 ఎన్నికల్లో పార్టీ టికెట్ లభించదనీ అంతేకాకుండా పొలిటికల్ కెరీర్ మొత్తం నాశనం అవుతుందని హెచ్చరించారు.
అభివృద్ధి పనులను ఇంటింటి కీ తిరిగి ప్రచారం చేయండి : నారా లోకేష్
“సుపరిపాలనలో- తొలి అడుగు” పేరుతో ఈ ఏడాది లో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాల్ని నెల రోజుల పాటు ఇంటింటికీ తీసుకెళ్లి విజయవంతం చేయాలని విద్య, ఐటీ శాఖల మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తమ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 2024 ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా 94 శాతం సీట్లను ప్రజలు తమను గెలిపించారనీ దీనికి ప్రధాన కారణం గత పాలకులకు ఉన్న అహంకారం, వారి పని విధానం. అందుకే మనల్ని పెద్దఎత్తున ఆశీర్వదించారనీ అన్నారు.ఈ గెలుపు వెనుక కార్యకర్తల కష్టం చాలా ఉందన్న లోకేష్ దీనిని అందరూ గుర్తు పెట్టుకోవాలని సూచించారు. 164 మంది ఎమ్మెల్యేల్లో 88 మంది మొదటిసారి గెలిచినవారు ఉన్నారనీ మంత్రివర్గంలో ఉన్న 25 మందిలో 17 మంది మొదటిసారి గెలిచినవారు ఉన్నారనీ ఇక్కడ ఉన్న వారిలో చాలా మంది ప్రతిపక్షంలో ఉండగా వేధింపులకు గురైనవారు,జైలుకు వెళ్లిన వారు అక్రమ కేసులు నమోదైన వారు ఉన్నారనీ వారితో పాటు కష్టపడిన కార్యకర్తలను మరువద్దని కోరుతున్నా అంటూ ఆయన ఎమోషనల్ అయ్యారు.
పార్టీనే సుప్రీమ్ అనీ, దేశం మొత్తం తిరిగినా, ప్రపంచం మొత్తం తిరిగినా తిరిగి వచ్చేది పవిత్ర దేవాలయంలా భావించే పార్టీ కార్యాలయానికే అన్న లోకేష్ జాతీయ స్థాయిలో బీజేపీకి,, టీడీపీ కి తప్ప ఇంత పెద్ద కార్యాలయం మరే పార్టీకి లేదని అన్నారు సీనియర్ల అనుభవం, యువతకు ఉన్న శక్తి రెండింటినీ జోడించాల్సిన అవసరం ఉందన్న లోకేష్ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఇంటింటికీ తీసుకెళ్లాలని లీడర్ల ను ఆదేశించారు. కుటుంబ సాధికార సారథి నుంచి పొలిట్ బ్యూరో సభ్యుల వరకు అందరూ నెల రోజుల పాటు రోడ్డెక్కాలని. ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలి. డోర్ టూ డోర్ వెళ్లినప్పుడు ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ ను యాప్ లో నమోదు చేయాలనీ " మై టీడీపీ యాప్ "ద్వారా తాము చేసిన పనులు పార్టీకి తెలియజేయాలనీ నెల రోజుల పాటు తూచా తప్పకుండా అందరూ డోర్ టూ డోర్ ప్రచారం చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అయితే ఏకంగా చంద్రబాబు కార్యక్రమానికే డుమ్మా కొట్టిన ఈ నేతలు ఎవరూ అంటూ ప్రస్తుతం నెటిజెన్స్ సెర్చ్ చేయడం మొదలు పెట్టారు.





















