Nara Lokesh vs Jagan: మీ ఏడుపులే మాకు దీవెనలు జగన్, మీకు కడుపుమంట రావడం సహజం- లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్
#PsychoFekuJagan | వైసీపీ హయాంలో ఏ టైంలో ఏపీ ఈసెట్ కౌన్సెలింగ్ నిర్వహించారో తెలియకుండా పోస్ట్ చేశారంటూ జగన్ పై నారా లోకేష్ మండిపడ్డారు. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

అమరావతి: విద్యా వ్యవస్థను కూటమి ప్రభుత్వం సర్వనాశనం చేసిందని మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన విమర్శలకు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మీ ఏడుపులే మాకు దీవెనలు జగన్ గారూ అంటూ తేదీలతో సహా వైసీపీ పాలనలో జరిగిన జాప్యాన్ని వివరించారు.
వైసీపీ హయాంలో 5 ఏళ్లు వైఎస్ జగన్ విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేసి పోయారు. నేను ఏడాదిలోనే అనేక సంస్కరణలు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వ విద్యా వ్యవస్థను గాడిన పెట్టాను. ఇది చూసి మీకు కడుపుమంట రావడం సహజం అని నారా లోకేష్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. మీ YSRCP హయాంలో ఎప్పుడు కౌన్సిలింగ్ పెట్టారో కూడా మీకు ఐడియా కూడా లేదు. కరోనా తరువాత మీరు 2022 ఏడాదిలో సెప్టెంబర్‌లో, 2023లో జూలై చివరికి పాలిటెక్నిక్ విద్యార్థులకు ఈసెట్ కౌన్సిలింగ్ పూర్తి చేశారు. అలాంటి మీరు కూడా కూటమి ప్రభుత్వాన్ని విమర్శించటం మీ అజ్ఞానానికి నిదర్శనం అని ఎద్దేవా చేశారు.

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఈసెట్ మొదటి కౌన్సిలింగ్‌ని జూలై మూడో వారం కల్లా పూర్తిచేశామని, ఈ సంవత్సరం కూడా మొదటి కౌన్సిలింగ్‌ని జూలై మూడో వారానికి పూర్తి చేస్తామని నారా లోకేష్ తెలిపారు. ఈసెట్ ఫలితాలు వచ్చి 45 రోజులు పూర్తవుతున్నా కౌన్సెలింగ్ నిర్వహించడం లేదని, కూటమి ప్రభుత్వంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందనడానికి ఇదే నిదర్శనమని మాజీ సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. రేపటి నుంచి ఇంజినీరింగ్ క్లాసులు మొదలవుతున్నా, కూటమి ప్రభుత్వానికి విద్యార్థుల జీవితాలంటే లెక్కలేదని విమర్శించారు.






















