Anantapur News: తాడిపత్రిలో ఉద్రిక్తత; మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్!
Anantapur News: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు వద్దంటున్న తాడిపత్రి వచ్చినందుకు చర్యలు తీసుకున్నారు.

Anantapur News: అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి టెన్షన్ వాతావరణం ఏర్పడింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి రావడం. ఆయన్ని అడ్డుకునేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రయత్నించడంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఉద్రిక్తత నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న పరిస్థితి ఉంది.
గత ఏడాదికాలంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి రానివ్వకుండా మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి అడ్డుకుంటున్నారు. పెద్దారెడ్డి హైకోర్టు నుంచి అనుమతులు తెచ్చుకున్నప్పటికీ శాంతిభద్రతల నేపథ్యంలో తాడిపత్రికి వెళ్లేందుకు పోలీసులు నిరాకరిస్తూ వస్తున్నారు. ఇప్పటికే చాలాసార్లు తాడిపత్రికి వెళ్ళేందుకు యత్నించినా పోలీసులు అడ్డుకున్నారు.
చివరకు ఆదివారం ఉదయం ఎవరికి చెప్పకుండా పెద్దారెడ్డి తాడిపత్రిలోకి ఎంట్రీ ఇచ్చారు. తన నివాసంలోకి వెళ్లి కూర్చున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని ఆయన్ని తిరిగి పంపించేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. పెద్దారెడ్డి మాత్రం తాను తాడిపత్రి నుంచి వెళ్లేది లేదని స్పష్టం చేస్తున్నారు.
శనివారం రోజున తాడిపత్రిలోని పెద్దారెడ్డి ఇంటికి మున్సిపల్ అధికారులు సర్వే నిర్వహించారు. మున్సిపల్ స్థలంలో ఇల్లు నిర్మించారన్న ఆరోపణలతో సర్వే నిర్వహించారు. దీంతో పెద్దారెడ్డి ఉదయం ఎవరికి చెప్పకుండా తాడిపత్రికి వచ్చారు. ప్రస్తుతం ఈ పరిణామాలతో టెన్షన్ వాతావరణం నెలకొంది. జెసి ప్రభాకర్ రెడ్డి ఈ అంశంపై ఎలా రియాక్ట్ అవుతారన్న దానిపై ఆందోళన నెలకొంది.
ఇలాంటి పరిస్థితుల్లో మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని పోలీసు అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. పోలీసులకు సమాచారం లేకుండా తాడిపత్రి రావడంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు పోలీసులు. తాడిపత్రిలోని ఆయన నివాసంలోనే పెద్దారెడ్డిని అదుపులోకి తీసుకొని.. అక్కడి నుంచి అనంతపురం తరలిస్తున్నరు.
తాడిపత్రిలో శాంతి భద్రతల సమస్య లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామంటున్నారు పోలీసులు. తాడిపత్రిలోని తన నివాసానికి పెద్దిరెడ్డి రావటంతో ప్రస్తుతం తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొనింది.





















