Annamalai: ఏపీ నుంచి రాజ్యసభకు అన్నామలై? ఢిల్లీలో ఖరారైన కాషాయ వ్యూహం.. దక్షిణాది రాజకీయాల్లో భారీ మార్పులు!
RajyaSabha 2026: తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఫైర్ బ్రాండ్ నేత అన్నామలై ఆంధ్రప్రదేశ్ కోటాలో రాజ్యసభకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే నెలలో ఏపీలో 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

Annamalai Enter Rajya Sabha From Andhra Pradesh: తమిళనాడు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన మాజీ ఐపీఎస్ అధికారి కె. అన్నామలై ఇప్పుడు పెద్దల సభలో అడుగుపెట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే నెలలో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో ఒకదానిని బీజేపీకి కేటాయించాలని కూటమి నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ స్థానంలో ఎవరిని పంపాలనే విషయంపై బీజేపీ హైకమాండ్ సుదీర్ఘంగా చర్చించి, చివరకు అన్నామలై పేరును దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం.
తమిళనాడు ప్రయోజనాల కోసమేనా?
అన్నామలైను ఏపీ నుంచి రాజ్యసభకు పంపడం వెనుక బీజేపీ పెద్ద వ్యూహమే పన్నింది. తమిళనాడులో బీజేపీ ఎదలేకపోతోంది. అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని పని చేసినా ప్రయోజనం లేకపోయింది. ఇప్పుడు అక్కడ సనాతన ధర్మ వివాదం ఉంది. ఈ కోణంలో విజయ్ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా ఢీకొట్టాలంటే అన్నామలైకు జాతీయ స్థాయి హోదా ఉండాలని బీజేపీ భావిస్తోంది. ఎంపీగా ఆయనకు దక్కే హోదా, తమిళనాడులో ఆయన గళాన్ని మరింత బలోపేతం చేస్తుందని, తద్వారా హిందూత్వ ముద్రతో బీజేపీని బలోపేతం చేయాలని అనుకుంటున్నారు.
ఏపీలో ఖాళీలు - కూటమి లెక్కలు
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ నుంచి ఎన్నికైన పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీ , సానా సతీష్‌ల పదవీ కాలం త్వరలో ముగియనుంది. అసెంబ్లీలో కూటమికి ఉన్న అఖండ మెజారిటీ దృష్ట్యా ఈ నాలుగు స్థానాలు ఏకగ్రీవంగా కూటమి ఖాతాలో పడటం ఖాయం. ఇందులో రెండు స్థానాలను టీడీపీ, ఒకటి జనసేన, మరొకటి బీజేపీ పంచుకునే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ తన కోటా స్థానాన్ని అన్నామలైకు కేటాయించాలని చంద్రబాబు నాయుడుతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది.
తమిళ నాడులో జోరుగా ప్రచారం
తమిళనాడులో అన్నామలై కేంద్ర మంత్రి కాబోతున్నారన్న ప్రచారంజరుగుతోంది. అన్నాడీఎంకేతో పొత్తు కోసం ఆయనను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించడంతో ..ఆయనకు ప్రాధాన్యత ఇవ్వాలని పార్లమెంటుకు పంపడం ద్వారా ఆయన స్థాయిని పెంచాలని బీజేపీ యోచిస్తోంది. గతంలోనే విజయసాయిరెడ్డి రాజీనామా సమయంలోనే అన్నామలై పేరు వినిపించినా, అప్పట్లో ఏపీ నేతకే అవకాశం దక్కింది. కానీ ఈ సారి మాత్రం అన్నామలై రాజ్యసభ ఎంట్రీ ఖాయమని తమిళ పొలిటికల్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.
విజయ్ వర్సెస్ అన్నామలై?
తమిళనాడులో అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు కొనసాగుతోంది. అయితే మెజార్టీ ఎమ్మెల్యేలు టీవీకేతో చేరిపోయారు. అన్నామలై రాజ్యసభ ఎంపీగా ఉంటే కూటమిలో ఆయన పాత్ర మరింత కీలకం కానుంది. అటు డీఎంకే, ఇటు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీలను ఎదుర్కోవడానికి అన్నామలై వంటి దూకుడున్న నేత అవసరమని బీజేపీ హైకమాండ్ గట్టిగా నమ్ముతోంది. ఏపీ నుంచి ఆయన పెద్దల సభకు వెళ్తే, అటు ఏపీ అభివృద్ధికి, ఇటు తమిళనాడు రాజకీయ బలోపేతానికి వారధిగా నిలుస్తారని భావిస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















