Russia Ukraine War: చల్లబడిన రష్యా సైనికులు- తిండి లేక, బండిలో ఇంధనం లేక, అంతా తికమక!
ఉక్రెయిన్‌లో యుద్ధం చేస్తోన్న రష్యా సైనికులు తికమక పడుతున్నట్లు, తీవ్ర నిరాశలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. రష్యా సైనికులు తీవ్ర అవస్థలు పడుతున్నట్లు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి.
ఉక్రెయిన్‌లో యుద్ధం చేస్తోన్న రష్యా బలగాల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. తినడానికి తిండి లేక, వాహనాల్లో ఇంధనం లేక, ఏం చేయాలో తెలియక రష్యా సేనలు చల్లబడిపోతున్నట్లు పెంటగాన్ (అమెరికా రక్షణశాఖ) అధికారి పేర్కొన్నట్లు న్యూయార్క్ టైమ్స్ పత్రిక కథనం ప్రచురించింది.
యువకులే ఎక్కువ
ఉక్రెయిన్‌పై దాడికి రష్యా పంపిన బలగాల్లో ఎక్కువ మంది యువకులే ఉన్నారు. వీరికి సరైన శిక్షణ కూడా లేదని, ఉక్రెయిన్ ఈ స్థాయిలో ప్రతిఘటిస్తుందనే ఆలోచన కూడా వారికి లేదని కథనం పేర్కొంది. ఇందులో కొంతమందికి తమని యుద్ధం చేయడానికి పంపినట్లు కూడా తెలియదని సంచలన విషయాలను బయటపెట్టింది. దీంతో రష్యా సేనల్లో చాలా మంది వారి ఆయుధాలను వదిలేసి, యుద్ధం చేయకుండా ఉండేందుకు వాహనాల టైర్లకు పంచర్లు పెడుతున్నారట.
అందుకే ఆ క్యూ
రాజధాని కీవ్వైపు రష్యా సేనలు ముందుకు సాగుతున్నట్లు ఓ భారీ సాయుధ కాన్వాయ్‌ను ఉపగ్రహ చిత్రాలు ఇటీవల గుర్తించాయి. దీని పొడవు 65 కి.మీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ సైన్యాన్ని ఎలా ఎదుర్కొవాలనే విషయంపై రష్యా బలగాలు పునరాలోచనలో పడేందుకే ఇలా వాహనాలను నిలిపివేసి సమావేశమైనట్లు అమెరికా వెల్లడించింది.
కలవరంలో బలగాలు
బ్రిటీష్ నిఘా సంస్థ రష్యా సేనల వాయిస్ రికార్డింగ్‌లను బయటపెట్టినట్లు డైలీ మెయిల్ పేర్కొంది. వీటి ప్రకారం రష్యా సైనికులు తీవ్ర కలవరంలో ఉన్నట్లు తెలుస్తోంది. అలానే రష్యా సెంట్రల్ కమాండ్ ఇచ్చే ఆదేశాలను కూడా కొంతమంది సైనికులు పట్టించుకోవడం లేదట. తమ వద్ద ఉన్న బుల్లెట్లు, బాంబులు అయిపోయాయని సమాధానమిస్తున్నారని డైలీ మెయిల్ వెల్లడించింది. రష్యా సైనికులు కూడా తమ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపింది.