Tragedy After Game Changer Event: ‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్ చూసి వెళుతూ ఇద్దరు మృతి.. తీవ్ర ఆవేదనకు గురైన పవన్ కళ్యాణ్.. జనసేన పార్టీ తరపున ఆర్థిక సాయం
Pawan Kalyan on Tragedy After Game Changer Event: ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ వేడుక అనంతరం చోటు చేసుకున్న విషాద ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆ ఘటనకు ఆయన చెప్పిన కారణం ఏమిటంటే..
రాజమండ్రిలో జరిగిన ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ వేడుకలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఇంటికి వెళ్లండి. మాకంటే మీ ఇంట్లో మీ అమ్మనాన్నలు, అన్నదమ్ములు ముఖ్యం. కుదిరితే వారందరినీ అడిగానని చెప్పండి. పెద్దవాళ్ల నుండి ఆశీస్సులు కోరానని చెప్పండి అంటూ.. అభిమానులకు ఒకటికి రెండు సార్లు పవన్ కళ్యాణ్ అప్రమత్తం చేశారు. అంత చేసినా కూడా ఆ ఈవెంట్ చూసి.. ఇంటికి వెళుతున్న సమయంలో ప్రమాదానికి గురై ఇద్దరు చనిపోయినట్లుగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం గేమ్ చేంజర్ ప్రమోషనల్ ఈవెంట్‌లో దిల్ రాజు చెబుతూ.. మృతుల కుటుంబాలకు చెరో రూ. 5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఇద్దరు అభిమానుల మృతి చెందడం ఎంతో బాధగా ఉందంటూ ఆయన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ ఘటనపై తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందిస్తూ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఏడీబీ రోడ్డుపై ప్రమాదంలో యువకుల మృతి బాధాకరమని, కాకినాడ – రాజమహేంద్రవరం నగరాల మధ్య ఉన్న ఏడీబీ రోడ్డు ఛిద్రమైపోయిందని, గత అయిదేళ్ళల్లో ఈ రోడ్డు గురించి పట్టించుకున్న నాధుడే లేదని వాపోయారు. బాగా పాడైపోయిన ఈ రోడ్డును ప్రస్తుతం బాగు చేస్తున్నారని తెలిపారు. ఈ దశలో ఏడీబీ రోడ్డుపై చోటు చేసుకున్న ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారని తెలిసి ఆవేదనకు లోనయ్యానని తెలిపారు. ఆరవ మణికంఠ, తోకాడ చరణ్ బైక్ మీద వెళ్తుండగా వాహనం ఢీ కొట్టడంతో ప్రాణాలు విడిచారు. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఈ ప్రమాదంలో మరణించిన యువకులు గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ వేడుక నుంచి తిరిగి ఇళ్లకు వెళ్తున్న సమయంలో దుర్మరణానికి గురయ్యారు. ఇళ్లకు సురక్షితంగా వెళ్ళండి అని ఆ వేడుకలో ఒకటికి రెండు సార్లు విజ్ఞప్తి చేశా. అయినా ఇలా జరగడం నన్ను కలిచి వేసిందని అన్నారు. జనసేన పార్టీ తరఫున మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున ఆర్థిక సాయం అందించడమే కాకుండా.. ప్రభుత్వం తరపున తగిన సహాయం అందించేలా చూస్తామని తెలిపారు.
ఏడీబీ రోడ్డుపై ప్రమాదంలో యువకుల మృతి బాధాకరం
— Pawan Kalyan (@PawanKalyan) January 6, 2025
కాకినాడ – రాజమహేంద్రవరం నగరాల మధ్య ఉన్న ఏడీబీ రోడ్డు ఛిద్రమైపోయింది. గత అయిదేళ్ళల్లో ఈ రోడ్డు గురించి పట్టించుకోలేదు. పాడైపోయిన ఈ రోడ్డును బాగు చేస్తున్నారు. ఈ దశలో ఏడీబీ రోడ్డుపై చోటు చేసుకున్నా ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం…
గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే..
‘‘గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే రహదారులు అద్వాన్నంగా తయారయ్యారని మండిపడ్డారు పవన్ కళ్యాణ్. కాకినాడ – రాజమహేంద్రవరం నగరాల మధ్య ప్రయాణానికి ఎంతో కీలకమైన రహదారి ఏడీబీ రోడ్డు. గత ప్రభుత్వం ఈ రోడ్డు విస్తరణ, పునర్నిర్మాణం గురించి పట్టించుకోలేదు. కనీస నిర్వహణ పనులు కూడా చేపట్టలేదు. సరైన విద్యుత్ దీపాలు కూడా లేవు. ఈ దశలో చోటు చేసుకున్న ప్రమాదం బాధాకరం. కూటమి ప్రభుత్వం ఏడీబీ రోడ్డు పనులు చేపట్టింది. ఇక నుంచి పిఠాపురం నియోజకవర్గ పర్యటనలకు ఏడీబీ రోడ్డు మీదుగానే రాకపోకలు సాగించాలని నిర్ణయించుకున్నాను..’’ అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
రామ్ చరణ్‌కు విషయం తెలిసి..
తన సినిమా ఈవెంట్ చూసి ఇంటికి వెళుతున్న ఇద్దరు అభిమానులు మృతి చెందారని తెలిసిన రామ్ చరణ్.. వెంటనే తన మనుషులను ఆ మృతుల కుటుంబాల ఇంటికి పంపించినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆ కుటుంబాలకు కావాల్సిన అవసరాన్ని తీర్చాలని వారికి సూచించినట్లుగా సమాచారం. మరి ఆయన ఎంత ఆర్థిక సాయం అందిస్తారనేది తెలియాల్సి ఉంది.