Kondagattu Temple: కనీస సౌకర్యాల్లేవ్, ఇవ్వలేరు కానీ రేట్లు పెంచేస్తారా? కొండగట్టు దేవస్థాన ఆర్జిత సేవా రుసుం పెంపుపై బండి సంజయ్ ఆగ్రహం
Kondagattu Temple: కనీస సౌకర్యాలు కల్పించకుండా కొండగట్టు దేవస్థానంలో ఇష్టమొచ్చినట్లు రేట్లు పెంచడాన్ని కేంద్రమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ఫెసిలిటీస్ కల్పించాలని డిమాండ్ చేశారు.

Kondagattu Temple: కొండగట్టు దేవస్థానంలో ఆర్జిత సేవా రుసుంను భారీగా పెంచడంపట్ల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండగట్టు ఆలయంలో కనీస సౌకర్యాల్లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారని, సౌకర్యాల మీద దృష్టి సారించాల్సిన అధికారులు, వాటిని విస్మరించడమే కాకుండా ఆర్జిత సేవా రుసుం పేరుతో అడ్డగోలుగా ధరలు పెంచడమేంటని ప్రశ్నించారు.
ఈరోజు ఉదయం కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ దేవాదాయ శాఖ అధికారులతో ఫోన్ మాట్లాడుతూ కొండగట్టులో ఆర్జిత సేవా రుసుం పెంపుపై అసహనం వ్యక్తం చేశారు. ‘‘కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తులకు కనీస సౌకర్యాల్లేవు. తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ టైంలో కనీస సౌకర్యాలపై దృష్టి సారించకుండా అడ్డగోలుగా ఆర్జిత సేవా రుసుంను పెంచడమేంటి?’’అని ప్రశ్నించారు. తక్షణమే ఆర్జిత సేవా రుసుంను తగ్గించాలని సూచించారు. అట్లాగే కొండగట్టు దేవస్థానంలో కనీస సౌకర్యాల కల్పనపై దృష్టి పెట్టి భక్తులకు ఇబ్బందులను తొలగించాలని కోరారు.





















