Olena Zelenska: ఒలెనా పిరికిది కాదు దేశం విడిచి పారిపోవడానికి, భర్తకే కాదు దేశ ప్రజల్లోనూ ధైర్యం నింపగలదు
తన కుటుంబమే రష్యా టార్గెట్ అని తెలిసినా దేశం విడిచిపోకుండా కీవ్‌లోనే ఉంది ఉక్రెయిన్ ప్రథమ మహిళ ఒలెనా జెలెన్ స్కా.
‘నేను కుంగిపోను, ఏడవను. నిశ్శబ్ధంగా, నిబ్బరంగా ఉన్నాను. నా పిల్లలూ, నేను కీవ్‌లోనే ఉన్నాం, ఇక్కడే ఉంటాం. భర్తా,పిల్లల పక్కనే కాదు, ఉక్రెనియన్ ప్రజల వెంట కూడా ఉంటా’
ఉక్రెయిన్ ప్రథమ మహిళ, అధ్యక్షుడు జెలెన్ స్కీ సతీమణి ఒలెన్ మాటలివి. ఒక పక్క ఉక్రెయిన్ తగలబడిపోతున్నా ఆమెలోని ఆత్మవిశ్వాసాన్ని ఇసుమంతైన తగ్గించలేకపోయాయి రష్యా సైనిక బలగాలు. తన పిల్లల్ని చూస్తున్నప్పుడల్లా వారిద్దరి ప్రాణాలు, భవిష్యత్తే కాదు, యావత్తు ఉక్రెయిన్ ప్రజల భవితవ్యం గుర్తుకువస్తుందని చెబుతోంది ఒలెనా. ఎన్నో దేశాలు ఉక్రెయిన్ వదిలి రమ్మని తమ వద్ద క్షేమంగా ఉండమని ఆఫర్ ఇస్తున్నా కూడా జెలెన్ స్కీ దంపతులు తిరస్కరించారు. ఒలెనా కూడా వెళ్లేందుకు ఇష్టపడలేదు. దేశంలోని ప్రజలు అల్లాడిపోతుంటే తాము మాత్రం ఎలా వేరే దేశంలో తలదాచుకుంటామని ప్రశ్నించింది.
ఆయన ధైర్యం ఆమెనే
రష్యాలాంటి అణుదేశం, పుతిన్‌లాంటి నియంత నిప్పులు రువ్వుతున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెనీ స్కీ ఏమాత్రం తడబడకుండా పోరాడుతూనే ఉన్నారు. తాను కూడా సైనికుడిలా యుద్ధభూమిలో దిగారు. ఇది కేవలం అతని ధైర్యమే అనుకోవద్దు, అతనికి తోడుగా ఆమె కూడా అడుగువేసింది. యుద్ధ సైనికుల్లో ధైర్యం, ఉత్సాహం నింపింది. భర్తను సగర్వంగా యుద్ధ భూమిలోకి పంపింది. పక్కదేశానికి పారిపోదామని వెనక్కి లాగలేదు. చావైనా, బతుకైనా పుట్టిన గడ్డ మీదే అని భర్తతో చెప్పింది. కీవ్‌లోనే ఓ రహస్య ప్రదేశంలో తమ పిల్లల్ని దాచి ఉంచారు జెలెన్ స్కీ దంపతులు.
Also read: ఉక్రెయిన్లో ఒక నెల ఖర్చు ఎంత తక్కువో తెలుసా? మనం హ్యాపీగా బతికేయచ్చు
ఎవరీమె?
ఉక్రెయిన్ ప్రథమ మహిళ కాకముందు ఈమె ఓ అందమైన ఇల్లాలు. ఇద్దరు పిల్లల తల్లి. నైపుణ్యం కలిగిన స్క్రీన్ రైటర్. ఇంకా చెప్పుకోవాలంటే ఒకప్పుడు జెలెన్‌స్కీ క్లాస్‌మేట్ కూడా. ఆ పరిచయం కాలం గడిచేకొద్దీ ప్రేమగా మారి పరిణాయానికి దారి తీసింది. మొదట్లో భర్త రాజకీయాల్లోకి వెళ్తానంటే ఒప్పుకోలేదు. ఇప్పుడు రాజకీయమంటే మురికి కాదని, ప్రజలకు మంచి చేసే అవకాశమున్న ఓ ఉద్యోగమని గుర్తించింది. అన్నింటి కన్నా ఇది చాలా బాధ్యతాయుతమైనది భావించింది. దేశ ప్రజల ఉన్నతి, పిల్లల పోషకాహారం కోసం ప్రథమమహిళగా ఎన్నో ప్రాజెక్టులు చేపట్టింది. అంతర్జాతీయ వేదికపై లింగ వివక్షకు వ్యతిరేకంగా ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చింది.
ఉక్రెయిన్ ఫ్యాషన్ రంగంపై కూడా ఆమె తనదైన ముద్ర వేసింది. ఆమె వేసే డ్రెస్సులన్నీ ఉక్రెయిన్లో తయారయ్యే ఫ్యాబ్రిక్‌తో కుట్టినవే. స్థానిక ఉత్పత్తులకే ఆమె అధిక ప్రాధాన్యత ఇచ్చేది. ఆమె ప్రస్తుతం ఎక్కడున్నారో బయటికి తెలియనివ్వకపోయినా ఎప్పటికప్పుడు ఇన్ స్టాలో ప్రజల పరిస్థితిని ప్రతిబింబించే పోస్టులను పెడుతున్నారు. అప్పుడు పుట్టిన ఓ శిశువు వీడియోను పెట్టిన ఆమె ‘కీవ్ బాంబ్ షెల్టర్లో... భయంకర యుద్ధ బాంబు శబ్ధాల మధ్య జన్మించిన శిశువు. ఇతని జననమే ఓ యుద్ధం. అయినా వైద్యులు ఇతడిని చక్కగా చూసుకుంటున్నారు’ అని పోస్టు పెట్టారు. ఈ పోస్టులను చూసినప్పుడు ప్రతి ఒక్కరి మనసు కరగడం ఖాయం.
View this post on Instagram
View this post on Instagram