Ukraine Russia War: అమ్మా యుద్ధం చాలా కష్టంగా ఉంది, చనిపోవాలని ఉంది: రష్యా సైనికుడి చివరి సందేశం
ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తోన్న సమయంలో ఓ రష్యా సైనికుడు తన తల్లికి పంపిన సందేశం వైరల్ అవుతోంది. ఈ సందేశం పంపిన తర్వాత ఆ సైనికుడు మృతి చెందాడు.
ఉక్రెయిన్‌పై రష్యా చేస్తోన్న యుద్ధంపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కానీ పుతిన్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. కానీ యుద్ధంలో రష్యా సైనికులు కూడా ప్రాణాలు కోల్పోతున్నట్లు ఉక్రెయిన్ మొదటి నుంచి చెబుతోంది. రష్యా మాత్రం తమ సైనికులు ఎవరూ చనిపోలేదని వాదిస్తోంది. ఇలాంటి తరుణంలో రష్యా సైనికుడు తన తల్లికి పంపిన చివరి సందేశం వైరల్ అవుతోంది.
"మామ్, నేను ఉక్రెయిన్‌లో ఉన్నాను. నిజంగా ఇక్కడ యుద్ధం భయంకరంగా ఉంది. నాకు చాలా భయంగా ఉంది. అన్ని నగరాలపైనా మేం బాంబుల వర్షం కురిపిస్తున్నాం. చివరికి పౌరులను కూడా లక్ష్యంగా చేసుకోవాల్సి వస్తోంది" ఉక్రెయిన్‌లో ఉన్న రష్యన్ సైనికుడు తన తల్లికి పంపిన చివరి సందేశమిది.
ఈ సందేశం పంపిన తర్వాత ఉక్రెయిన్ సైనికుల కాల్పుల్లో అతను చనిపోయాడు. ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై ఐక్యరాజ్య సమితి సోమవారం నిర్వహించిన అత్యవసర జనరల్ అసెంబ్లీలో ఐరాసలో ఉక్రెయిన్ రాయబారి.. రష్యా సైనికుడు తన తల్లికి రాసిన ఈ సందేశాన్ని చదివి వినిపించారు.
చివరి సందేశం
అమ్మ: నేను ఓ పార్శిల్ పంపాలి రా.. నువ్వు ఎక్కడున్నావు?
కుమారుడు: నాకు ఉరేసుకుని చనిపోవాలని ఉందమ్మా
అమ్మ: ఏమైంది నాన్న ఎందుకు అలా అంటున్నావు?
కుమారుడు: యుద్ధంలో వారు (ఉక్రేనియన్లు) మమ్మల్ని స్వాగతిస్తారని మా అధికారులు చెప్పారు. కానీ వారు మా సాయుధ వాహనాల కిందపడి నలిగిపోతున్నారు. చక్రాల కింద పడుతున్నారు. మమ్మల్ని ముందుకు కదలనివ్వడం లేదు. వారు మమ్మల్ని ఫాసిస్టులు అంటున్నారు. అమ్మా.. ఇక్కడ యుద్ధం చాలా కష్టంగా ఉంది.
ఈ సందేశాన్ని చదివి వినిపించిన ఉక్రెయిన్ రాయబారి సెర్గీ కిస్లెత్స్యా ఉక్రెయిన్‌లోని విషాదభరిత పరిస్థితిని ఊహించుకోవాలన్నారు. తమ సైనికులు చనిపోలేదని రష్యా బుకాయిస్తోందని ఆయన అన్నారు. నిజానికి ఎక్కువ ప్రాణనష్టం రష్యా వైపే జరిగిందన్నారు. రష్యా ఇప్పటికైనా యుద్ధాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. ప్రాణాలను రక్షించుకునేందుకు తమ దేశం విడిచి వెళ్లాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ రష్యా సైనికులను మరోసారి హెచ్చరించారు. ఉక్రెయిన్ లెక్కల ప్రకారం ఈ యుద్ధంలో ఇప్పటి వరకు 4500 మందికిపైగా రష్యా సైనికులు చనిపోయారు.
Also Read: Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌లో భారత విద్యార్థి మృతి- భారత విదేశాంగ శాఖ ప్రకటన
Also Read: Ukraine Russia War: ఈయూ దేశాలపై పుతిన్ ప్రతీకారం- రష్యా గగనతలంలోకి ఆ దేశ విమానాలు వస్తే!