#Me Too: తైవాన్ లో మీటూ ఉద్యమం- నెట్‌ఫ్లిక్స్ హిట్టే కారణమా!
తైవాన్ రాజకీయలపై నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమైన ఓ డ్రామా, ఇప్పుడు ఆ దేశాన్నే ఊపేస్తోంది. లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా తాజాగా ప్రతిరోజూ ఆరోపణలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి.
తైవాన్ రాజకీయలపై నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమైన ఓ డ్రామా, ఇప్పుడు ఆ దేశాన్నే ఊపేస్తోంది. లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా తాజాగా ప్రతిరోజూ ఆరోపణలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి.
గత కొన్ని వారాలుగా తైవాన్ లో ఊపందుకున్న మీటూ ఉద్యమం (Me Too), ఇప్పుడు ఆ దేశాన్ని ఊపేస్తోంది. లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ప్రతి రోజూ వెల్లువెత్తుతున్న ఆరోపణలు, ప్రస్తుతం ఆ దేశ రాజకీయ, న్యాయ, కళా రంగాల వరకు పాకాయి. ఆసియాలోనే ప్రగతిశీల దేశంగా పేరొందిన ఈ ప్రజాస్వామ్య ద్వీపంలో మహిళల స్థితిగతులపై మరోసారి పునఃసమీక్షించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దాదాపు ప్రతిరోజూ వెల్లువెత్తుతున్న ఈ ఆరోపణలతో టాక్ షోలు, సోషల్ మీడియాలో చర్చలు ప్రారంభమయ్యాయి. వార్తాపత్రికలు, ఉద్యమకారులు బాధితుల రక్షణ కోసం పిలుపునిస్తున్నారు.
పలు విషయాల్లో తొలి దేశంగా తైవాన్..
యునైటెడ్ స్టేట్స్‌లో మీటూ ఉద్యమం మొదలవక ముందే, మొదటి మహిళా అధ్యక్షురాలిని ఎన్నుకోవడంలోనూ, మహిళల రక్షణ కోసం అనేక చర్యలు చేపట్టడంలోనూ తైవాన్ దేశం ముందుంది. లైగింక వేధింపులు, అత్యాచారాలకు వ్యతిరేకంగా చట్టాలను బలోపేతం చేయడంలోనూ పురోగతిని సాధించింది. అయితే కొత్తగా వెల్లువెత్తుతున్న లైగింక వేధింపుల ఆరోపణలు సమాజంలో పాతుకుపోయిన లింగ వివక్షకు నిదర్శనమని విద్యావేత్తలు, ఉద్యమకారులు అభిప్రాయపడుతున్నారు. బాధితులను త్వరగా నిందించి, వేధింపులకు గురి చేస్తున్న వారిని రక్షించే సంస్కృతి ఉన్నంత కాలం పని ప్రదేశాల్లో మహిళల పరిస్థితి మరింత దుర్భరంగా ఉంటుందంటున్నారు.
నెట్‌ఫ్లిక్స్ డ్రామానే కారణం!
తైవాన్ రాజకీయాలపై రూపొందించిన వేవ్ మేకర్స్ అనే డ్రామా సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమై ప్రజాదరణ పొందింది. ఇందులో ఓ రాజకీయ పార్టీకి చెందిన మహిళా సభ్యురాలు, తనను ఉన్నత స్థాయిలో ఉన్న పార్టీ సభ్యుడు లైంగికంగా వేధిస్తున్నాడంటూ తన బాస్‌కు ఫిర్యాదు చేస్తుంది. దీనిపై బాస్ ఆమెకు సాయం చేస్తానని వాగ్దానం చేయడంతోపాటు, రాజకీయంగా ఇబ్బందులకు గురిచేసే ఫిర్యాదులను ఎంత తరచుగా విస్మరిస్తారో సూచిస్తూ, "ఈ సారి దీనిని వదలం" అని వ్యాఖ్యానిస్తారు.
ఆ బాస్ నుంచి వచ్చిన ఈ వ్యాఖ్య ఇప్పుడు ఓ పిలుపుగా మారింది. వంద మందికి పైగా బాధితులు, ముఖ్యంగా మహిళలు లైంగిక వేధింపులపై తమ గళం విప్పారు. పని ప్రదేశాలలో తమ సహోద్యోగులు, బాస్‌లు తమతో అనుచితంగా ప్రవర్తించడం, అవాంఛిత ముద్దులు, కొన్ని సందర్భాలలో అత్యాచారానికి ప్రయత్నించిన సందర్భాలను వారు తమ సోషల్ మీడియా ఖాతాల్లో వెల్లడించారు. అసభ్యకరమైన వ్యాఖ్యలతో అవమానాలను ఎదుర్కొన్నామని వివరించారు.
అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ ఈ వ్యవహారంలో ఎక్కువ ఆరోపణలు ఎదుర్కొంటోంది. ప్రభుత్వాధికారులు, సీనియర్ పార్టీ నాయకులు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ముందు ఉన్నారు. అంతేకాకుండా బాధితులను మాట్లాడనీయకుండా చేస్తున్నారంటూ వచ్చిన అంతర్గత ఫిర్యాదులపై సరైన చర్యలు చేపట్టకపోవడం వంటి కారణాలతో ఆ దేశ ప్రెసిడెంట్ త్సాయ్ ఇంగ్-వెన్ రెండుసార్లు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.
2019లో స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేయడం, స్వలింగ సంపర్కులకు ఈ ఏడాది ప్రారంభంలో దత్తత తీసుకునే హక్కు కల్పించడం వంటి ఉదారవాద విధానాలకు ఈ విమర్శలు విరుద్ధంగా ఉన్నాయి. ఇది వచ్చే ఏడాది అధ్యక్ష ఎన్నికలపై ప్రభావం చూపించనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial