Maha Sivaratri Celebrations: పాకిస్థాన్ లో ఘనంగా మహా శివరాత్రి వేడుకలు - పాల్గొన్న భారతీయ హిందూ యాత్రికులు
Sivaratri: పాకిస్థాన్ లోనూ మహా శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో హిందువులే కాకుండా అన్ని మతాల వారు పాల్గొన్నారు. మరి ఆ విశేషాలేంటో తెలుసుకుందామా.!
Sivaratri Celebrations in Pakistan: ఇండియాలో హిందువులకు అతి పెద్ద పండుగ మహా శివరాత్రి. కానీ, ఈ పండుగను పాకిస్తాన్ లోనూ ఘనంగా జరుపుకొంటారన్న విషయం మీకు తెలుసా..?. అక్కడ మహా శివరాత్రి వేడుకల్లో కేవలం హిందువులే కాదు, అన్ని మతాల వారూ పాల్గొనటం గమనార్హం. అయితే, ప్రతి యేటా మహా శివరాత్రిని జరుపుకోవటానికి భారతీయ హిందువులు కూడా కొందరు పాకిస్తాన్ వెళ్తారు. ఈసారి కూడా 62 మంది యాత్రికులు అక్కడికి చేరుకున్నారు. అయితే వీరి కోసం పాకిస్తాన్ హై కమాండ్ వీసాలు కూడా జారీ చేయటం విశేషం. హిందూ భక్తులు వాఘా సరిహద్దు మీదుగా లాహోర్ చేరుకున్నారు. లాహోర్‌కు 300 కి.మీల దూరంలో ఉన్న చక్వాల్ ప్రాంతంలో నిర్మించిన ప్రసిద్ధ కటాస్ రాజ్ ఆలయంలో పాకిస్తాన్‌లో ఉన్న హిందూ సమాజంతో పాటు ఇతరులు వారు మహా శివరాత్రిని జరుపుకొంటారు. ఈ వేడుకలో రాజకీయ నాయకులూ భాగమవుతారు. శివ కళ్యాణం జరిపిస్తారు. భారతదేశంలోని వివిధ శైవ దేవాలయాల్లో జరిపినట్టే ఘనంగా మహా శివరాత్రి జరుపుతారు. శుక్రవారం శివరాత్రి సందర్భంగా ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మార్చి 9న..
భారతదేశంలో, మార్చి 8న దేశవ్యాప్తంగా మహా శివరాత్రి పండుగను జరుపుకొంటున్నారు. అయితే, పాకిస్థాన్‌లో ఈ పండుగను మార్చి 9న జరుపుకొంటారు. పాక్ లోని ఇతర హిందూ దేవాలయాల్లోనూ వేడుకల నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇండియా నుంచి విశ్వనాథ్ బజాజ్ నేతృత్వంలో వచ్చిన హిందూ యాత్రికులకు వాఘా వద్ద అదనపు కార్యదర్శి రాణా షాహిద్ సలీం స్వాగతం చెప్పారు. మార్చ్ 6 నుంచి 12 వరకు పంజాబ్ లోని కటాజ్ రాజ్ ఆలయాన్ని సందర్శిస్తున్న భారతీయ హిందూ యాత్రికుల కోసం పాకిస్థాన్ హైకమాండ్ వీసాలు జారీ చేసిన విషయం తెలిసిందే.