Gaza: పాలస్తీనా జెండా పట్టుకుని ఒంటికి నిప్పంటించుకున్న మహిళ, ఇజ్రాయేల్ కాన్సులేట్ ఎదుటే ఘటన
Israel Gaza Attack: అమెరికాలోని ఇజ్రాయేల్ కాన్సులేట్ ఎదురుగా పాలస్తీనా మహిళ ఒంటికి నిప్పంటించుకుంది.
Israel Gaza War:
ఇజ్రాయేల్ దాడుల్ని నిరసిస్తూ..
ఇజ్రాయేల్ దాడులను వ్యతిరేకిస్తూ పాలస్తీనా మద్దతుదారులు (Palestinian Protests) ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పటికే యూకేలో అక్కడక్కడా ఈ ఘటనలు జరిగాయి. అమెరికాలోనూ నిరనసలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే అట్లాంటాలో ఇజ్రాయేల్ కాన్సులేట్ ఎదుట ఓ మహిళ నిప్పంటించుకుంది. పాలస్తీనా జెండా ఒంటిమీద కప్పుకుని వచ్చిన మహిళ ఇజ్రాయేల్ దాడులపై (Israel-Hamas War) నిరసన వ్యక్తం చేస్తూ ఒంటికి నిప్పంటించుకుంది. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆమెని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమెకి తీవ్ర గాయాలయ్యాయి. ప్రాణాలతో బయటపడినప్పటికీ శరీరం చాలా వరకూ కాలిపోయింది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం...బాధిత మహిళ పాలస్తీనా జెండా చేతిలో పట్టుకుని ఇజ్రాయేల్ కాన్సులేట్ ముందుకు వచ్చింది. ఆ తరవాత ఆ జెండాని తన ఒంటిపై కప్పుకుంది. ఆ తరవాత ఒంటికి నిప్పు పెట్టుకుంది. సెక్యూరిటీ గార్డ్ ఆమెని ఆపేందుకు ప్రయత్నించాడు. కానీ కుదరలేదు. ఆమెని అడ్డుకోబోతుండగా గార్డ్‌కి కూడా గాయాలయ్యాయి. ఆ తరవాత మంటలు ఎక్కువయ్యాయి. వెంటనే అధికారులు అప్రమత్తమై మంటలు ఆర్పి దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. దాదాపు వారం రోజుల పాటు ఇజ్రాయేల్, హమాస్ మధ్య యుద్ధం నిలిచిపోయింది. ఈ విరామం మరి కొన్నాళ్ల పాటు కొనసాగుతుందని భావించినా మళ్లీ యుద్ధం మొదలైంది. దీన్ని నిరసిస్తూనే పాలస్తీనా మహిళ ఈ దారుణానికి పాల్పడింది.
"ఆఫీస్ కార్యాలయం వద్ద ఇలాంటి ఘటన జరగడం చాలా విచారకరం. ఇజ్రాయేల్‌పై విద్వేషాన్ని ఈ విధంగా చూపించడమే బాధగా అనిపిస్తోంది. అందరి జీవితాలూ విలువైనవే. ఈ ఘటనలో గాయపడ్డ సెక్యూరిటీ గార్డ్ కుటుంబానికి మేం అండగా ఉంటాం"
- కాన్సులేట్ అధికారులు
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Netanyahu) గాజాలో (Gaza) పర్యటించారు. ఆయన వెంట సీనియర్ అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా యుద్ధంలో పాల్గొంటున్న సైనికులతో సమావేశమయ్యారు. కమాండర్లు, సైనికులు ఆయనకు పరిస్థితి వివరించారు. లక్ష్యం నెరవేరేవరకూ తమ పోరాటం సాగుతుందని తెలిపారు. తమ సైనికుల్లో స్థైర్యం నింపేందుకు ఇక్కడకు వచ్చినట్లు ఆయన చెప్పారు.'మన వీరోచిత సైనికుల వల్లే మనం గాజాలో ఉన్నాం. మన పౌరులను విడిపించుకునేందుకు ఉన్న ప్రతీ అవకాశాన్నీ వినియోగించుకుంటాం. మనకు 3 లక్ష్యాలున్నాయి. హమాస్ ను అంతమొందించడం, మన బందీలందరినీ విడిపించుకోవడం, భవిష్యత్తులో గాజా ఎప్పటికీ మనకు ప్రమాదకరంగా మారకుండా చూసుకోవడం. ప్రస్తుతం మన ముందున్న లక్ష్యం విజయం సాధించేవరకూ పోరాడడమే. మనల్ని ఎవరూ ఆపలేరు. మనకూ బలం, బలగం ఉంది. యుద్ధంలో కచ్చితంగా లక్ష్యాలన్నీ సాధించగలం.' అని నెతన్యాహు వ్యాఖ్యానించారు.
యూఎస్ బిలియనీర్, టెస్లా అధినేత ఎలన్ మస్క్ (Elon Musk Israel Visit) ఇటీవలే ఇజ్రాయేల్‌లో పర్యటించారు. ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుని కలిశారు. హమాస్ ఉగ్రవాదుల దాడుల్ని ఖండించారు. ఇజ్రాయేల్‌కి మద్దతు (Israel-Hamas War) ప్రకటించారు. ఇటీవల జూదులకు వ్యతిరేకంగా ట్విటర్‌లో (ప్రస్తుతం ఎక్స్) ఓ పోస్ట్ వైరల్ అయింది. వెంటనే దాన్ని తొలగించింది ట్విటర్. విద్వేషాలు రెచ్చగొట్టే కంటెంట్‌ని అడ్డుకోవడంలో తమ కంపెనీ ఎప్పుడూ ముందుంటుందని ఎలన్ మస్క్ (Elon Musk) స్పష్టం చేశారు. అయితే...మస్క్ ఇజ్రాయేల్‌లో పర్యటించడంపై హమాస్ అసహనం వ్యక్తం చేసింది. ఓ సారి గాజాలోనూ పర్యటించాలని, ఇజ్రాయేల్ యుద్ధం పేరుతో ఎంత విధ్వంసానికి పాల్పడిందో చూడాలని అన్నారు హమాస్ అధికారి ఒసామా హమ్‌దన్.
Also Read: Gaza: AI టూల్స్‌తో హమాస్‌పై ఇజ్రాయేల్ యుద్ధం, టార్గెట్ ఫిక్స్ చేస్తే క్షణాల్లో విధ్వంసం