పాలస్తీనా పౌరుల ఆకాంక్షలకి హమాస్ చర్యలకు పొంతనే లేదు - కమలా హారిస్
Hamas Palestine Attack: హమాస్ దాడులపై అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ అసహనం వ్యక్తం చేశారు.
Hamas Palestine Attack:
కమలా హారిస్ వ్యాఖ్యలు..
ఇజ్రాయేల్, హమాస్ యుద్ధంపై (Israel Palestine War) అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ (Kamala Harris) స్పందించారు. పాలస్తీనా హక్కుల గురించి మాట్లాడిన ఆమె...హమాస్‌పై మండి పడ్డారు. వాళ్లకు స్వతంత్ర హోదా ఇవ్వాలని, అందుకు మద్దతునిస్తానని స్పష్టం చేశారు. పాలస్తీనా హక్కులకు హమాస్ ఉగ్రవాదులు ఎప్పటికీ ప్రతినిధులు కాలేరని తేల్చి చెప్పారు. ట్విటర్‌లో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ఇజ్రాయేల పౌరులతో పాలస్తీనా ప్రజలకూ సమాన హక్కులుండాలని అన్నారు. వాళ్ల భద్రతకు భరోసా ఇవ్వాల్సిన అవసరాన్నీ గుర్తు చేశారు. పాలస్తీనా ప్రజల ఆకాంక్షలకు, హమాస్ ఉగ్రవాదులు చేస్తున్న పనులకు ఎలాంటి పొంతన లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఉగ్రచర్యలపై తీవ్రంగా మండి పడ్డారు కమలా హారిస్. అలాంటి వాళ్లపై అమెరికా నిఘా పెట్టిందని, అన్ని దేశాలూ ఈ దారుణాలను ఖండించాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదులు తమ చర్యల్ని సమర్థించుకోవడాన్నీ వ్యతిరేకించాలని అన్నారు.
"ఇజ్రాయేల్ పౌరులతో సమానంగా పాలస్తీనా ప్రజలకూ హక్కులుండాలి. వాళ్లకూ భద్రత కల్పించాలి. వాళ్లకూ ఆత్మగౌరవం ఉంటుంది. హక్కులుంటాయి. వాటికి మేం ఎప్పుడూ మద్దుతుగానే ఉంటాం. పాలస్తీనా ప్రజల ఆకాంక్షలకి హమాస్ ఉగ్రవాదులు ఎప్పటికీ ప్రాతినిధ్యం వహించలేరు. ఇలాంటి ఉగ్రచర్యల్ని ఏ మాత్రం సహించకూడదు. ప్రస్తుతం గాజాలో జరుగుతున్న దారుణాలను చూస్తున్నాం. హక్కుల పేరు చెప్పి ఉగ్రచర్యలకు పాల్పడడాన్ని ఖండించాల్సిందే. ఈ సమయంలో ఇజ్రాయేల్‌కి అన్ని విధాలుగా అండగా ఉండేందుకు అమెరికా సిద్ధంగా ఉంది"
- కమలా హారిస్, అమెరికా వైస్ ప్రెసిడెంట్
"Hamas does not represent Palestinian people"; says US Vice President Kamala Harris
— ANI Digital (@ani_digital) October 19, 2023
Read @ANI Story | https://t.co/yx17nKS3ug#KamalaHarris #Hamas #IsraelPalestineConflict #Gaza #USA pic.twitter.com/cQ2ITkzOaQ
ఈజిప్ట్ బార్డర్ ఓపెన్..
ఇక గాజా బాధితులు క్రమంగా ఆ ప్రాంతం వదిలి వెళ్లిపోతున్నారు. దీనిపైనా అమెరికా చొరవ తీసుకుంది. పక్కనే ఉన్న ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దేల్ ఫతాహ్ అల్ సిసి (Abdel Fattah Al-Sisi)తో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడారు. సరిహద్దు ప్రాంతాలను తెరిచి గాజా బాధితులకు ఆశ్రయం ఇవ్వాలని కోరారు. మానవతా దృక్పథంతో సాయం చేయాలని అడిగారు. అందుకు ఈజిప్ట్ అంగీకరించింది. దాదాపు 20 ట్రక్కులను అనుమతించింది.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) టెల్ అవీవ్ పర్యటనకు వెళ్లారు. అక్కడ ఇజ్రాయేల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహుతో(Benjamin Netanyahu) భేటీ అయ్యారు. గాజాలోని ఓ ఆసుపత్రిపై దాడులు జరిగి 500 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో జో బైడెన్ భేటీ కీలకంగా మారింది. ఇజ్రాయేల్‌కి ముందు నుంచి మద్దతునిస్తోంది అగ్రరాజ్యం. ఈ సారి నేరుగా బైడెన్ వెళ్లి నెతన్యాహుని కలిశారు. అంతే కాదు. గాజాలోని హాస్పిటల్‌పై దాడి చేసింది ఇజ్రాయేల్ కాదని తేల్చి చెప్పారు. అది కచ్చితంగా ఉగ్రవాదులు చేసిన పనే అని అన్నారు. ఈ సందర్భంగా నెతన్యాహు బైడెన్‌కి థాంక్స్ చెప్పారు. ఇజ్రాయేల్‌కి మద్దతుగా ఉంటున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. గత వారమే యూఎస్ స్టేట్ సెక్రటరీ యాంటోని బ్లింకెన్ టెల్ అవీవ్‌లో పర్యటించారు. ఇలా వరుస పర్యటనలతో అమెరికా సపోర్ట్ ఇస్తూ వస్తోంది.
Also Read: అమెరికాలో పాలస్తీనా మద్దతుదారుల నిరసనలు, వందలాది మంది అరెస్ట్