Iran Missile Attack: ట్రంప్ ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే మిస్సైల్స్‌తో విరుచుకుపడ్డ ఇరాన్, తగ్గేదేలేదని క్లారిటీ!
డొనాల్డ్ ట్రంప్ మంగళవారం వేకువజామున కాల్పుల విరమణ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్ పై ఇరాన్ క్షిపణి దాడి చేసింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారని ఇజ్రాయెల్ నిర్ధారించింది..

Iran Israel Ceasefire: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఇరాన్ బిగ్ షాకిచ్చింది. మొదట ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం నిలిచిపోయిందని, కాల్పుల విరమణకు రెండు దేశాలు అంగీకరించాయని ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణకు అంగీకారం కుదిరిందని అన్నారు. ట్రంప్ చేసిన ప్రకటనలో వాస్తవం లేదని, ఇరాన్ పోరాటం కొనసాగిస్తుందని ఖమేనీ స్పష్టం చేశారు. కాల్పుల విరమణపై ట్రంప్ ప్రకటన చేసిన కొన్ని గంటల తర్వాత ఇజ్రాయెల్ పై ఇరాన్ క్షిపణులతో దాడి చేసింది. ఈ దాడిలో ముగ్గురు మరణించినట్లు వెల్లడించారు. ఇజ్రాయెల్ సైన్యం కూడా ఇరాన్ చేసిన మిస్సైల్స్ దాడిపై ఓ ప్రకటన విడుదల చేసింది.
ఇజ్రాయెల్ మీద మిస్సైల్స్ ప్రయోగించిన ఇరాన్
ఇజ్రాయెల్ నగరమైన బీర్ షెవాలోని ఒక నివాస భవనంపై ఇరాన్ మంగళవారం నాడు దాడి చేసింది. ఈ దాడిలో కనీసం ముగ్గురు మరణించారు. దాడి జరిగిన ప్రదేశానికి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతోంది. ఆ బిల్డింగ్ కాంప్లెక్స్ పూర్తిగా ధ్వంసమైనట్లు వీడియోలో కనిపిస్తోంది. కాల్పుల విరమణ ప్రకటించిన గంటల వ్యవధిలో ఇరాన్ మూడుసార్లు క్షిపణులతో దాడులు ముమ్మరం చేసింది. ఇజ్రాయెల్ బలగాలు సైతం ఇరాన్ దాడులను నిర్ధారించింది. ఇజ్రాయెల్ సైన్యం ఎక్స్ లో తాజా దాడి వివరాలు షేర్ చేసింది. "ఇరాన్ గత గంట సమయంలో మూడుసార్లు క్షిపణులతో దాడి చేసింది. ప్రజలు ప్రాణాలు కాపాడుకునేందుకు షెల్టర్ల వైపు పరుగెత్తుతున్నారు" అని పేర్కొంది.
⚡️Be’er Sheba pic.twitter.com/ajHQBpGaDK
— War Monitor (@WarMonitors) June 24, 2025
ఇజ్రాయెల్ లో సైరన్లు మోగుతున్నాయి
ఇరాన్ నుండి బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించిన తరువాత ఉత్తర, మధ్య, దక్షిణ ఇజ్రాయెల్ లోని కొన్ని ప్రాంతాలలో సైరన్లు మోగాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో ప్రజలను అధికారులు ముందే అప్రమత్తం చేశారు. తదుపరి ఆదేశాల వరకు బాంబు షెల్టర్లలో ఉండాలని పౌరులకు ఇజ్రాయెల్ ప్రభుత్వం సూచించింది. ఇరాన్ దాడులు జరుగుతున్న ప్రాంతాల్లో సైరన్లు మోగించి తమ ప్రజలను సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని ఎప్పటికప్పుడూ అప్రమత్తం చేస్తోంది ఇజ్రాయెల్.
కాల్పుల విరమణపై ట్రంప్ స్పందన ఇలా
కొన్ని గంటల క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగినట్లు ప్రకటించారు. ఆయన తన 'ట్రూత్' లో ఇలా రాసుకొచ్చారు. "అందరికీ అభినందనలు, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పూర్తి కాల్పుల విరమణపై అంగీకారం కుదిరింది. దాంంతో 12 రోజుల యుద్ధానికి స్వస్తి పలికినట్లు అయింది. కాల్పుల విరమణ మరో ఆరు గంటల్లో ప్రారంభమవుతుంది. ఇరాన్, ఇజ్రాయెల్ దీనిపై అధికారిక ప్రకటన చేస్తారని" డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. 24 గంటల తర్వాత ఈ దేశాల మధ్య యుద్ధం ముగిసినట్లు అధికారికంగా పరిగణిస్తారని స్పష్టం చేశారు. ఇరాన్ పోరాటం కొనసాగిస్తుందని, చివరి రక్తపు బొట్టు వరకు పోరాటం ఆగదని అధినేత ఖమేనీ స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ మాత్రం అమెరికా అండదండలు చూసుకుని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇజ్రాయెట్ శాంతిమంత్రం పఠించనుందని, ఇరాన్ సైతం దౌత్యపరమైన చర్చలకు దారులు తెరవాలని డొనాల్డ్ ట్రంప్ సూచించారు.






















