Marburg Virus: ఆఫ్రికాను కమ్మేస్తున్న మరో ప్రాణాంతక వైరస్.. మార్‌బర్గ్ ధాటికి రువాండాలో ఎమర్జెన్సీ
Highly contagious Marburg virus: మార్‌బర్గ్ వైరస్ ఆఫ్రికాను కమ్మేస్తోంది. ఈ మహమ్మారి రువాండాలో 8 మందిని బలిగొంది.వ్యాక్సిన్ లేని ఈ వైరస్ ఫాటలిటీ రేట్ 88 శాతం కాాగా ఆరోగ్య అత్యయికస్థితి విధించారు.
Africa News: ల్యాబ్‌లో పురుడు పోసుకున్న మరో ప్రాణాంతక మహమ్మారి మార్‌బర్గ్ వైరస్ ఆఫ్రికాలో మృత్యుఘంటికలు మోగిస్తోంది. రువాండాలో 300 మందికి ఈ మహమ్మారి సోకగా ఇప్పటి వరకు 8 మంది బలయ్యారు. ఆరోగ్య అత్యయిక స్థితి విధించి మరీ వైరస్ బారిన పడిన వారి కాంటాక్ట్‌ల కోసం అన్వేషణ మొదలు పెట్టారు. రువాండా సహా ఆఫ్రికా దేశాల్లో ఈ మహమ్మారి ప్రబలకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ- WHO ప్రకటించింది.
మార్‌బర్గ్ ల్యాబ్‌లో నుంచి బయటకు వచ్చిన వైరస్:
ఎబోలా మాదిరిగానే ఈ మార్‌బర్గ్ వైరస్ కూడా చాలా త్వరగా ఇతరులకు వ్యాపించే ప్రాణాంతక వైరస్. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం ఈ వ్యాధి సోకిన వారిలో 24 శాతం నుంచి 88 శాతంగా మరణాల రేటు ఉంది. వ్యాధి నిర్ధరణ జరిగిన తర్వాత ఎంత త్వరగా వైద్యం అందుతున్న దానిపై ఆధారపడి మరణాల రేటు పెరుగుతుంది. ఇంత ప్రాణాంతమైన వ్యాధి ల్యాబ్‌లలో నుంచే బయటకు వచ్చింది. గబ్బిలాల ద్వారా సంక్రమించే ఈ వైరస్‌ను తొలుత 1967లో గుర్తించారు. ఉగాండా నుంచి ఆఫ్రికా లోని గ్రీన్ మంకీస్‌ను తీసుకొచ్చి జర్మనీలోని మార్‌బర్గ్, ఫ్రాంక్‌ఫర్టులో , సెర్బియాలోని బెల్‌గ్రేడ్‌లో ప్రయోగాలు చేస్తున్న సమయంలో ఈ వైరస్ ప్రబలింది. దాదాపు 31 మందికి ఈ వైరస్ సోకగా ఏడుగురు మృత్యువాత పడ్డారు.
ప్రస్తుతం ఆఫ్రికా దేశాలపై మళ్లీ విరుచుకుపడుతున్న మార్‌బర్గ్ వైరస్:
మళ్లీ ఆఫ్రికా దేశాలపై ఈ వైరస్ విరుచుకు పడుతోంది. ఇన్నేళ్లలో ఈ వైరస్ అంతానికి వ్యాక్సిన్ తయారు కాలేదు. ఇప్పటి వరకూ కెన్యా, టాంజానియా, దక్షిణాఫ్రికా, కాంగో వంటి దేశాల్లో ఈ కేసులు వెలుగు చూశాయి. ప్రస్తుతం రువాండాలో పరిస్థితి విషమంగా మారింది. దాదాపు 300 మందికి ఈ వైరస్ సోకినట్లు తేలగా అందులో ఇప్పటికే 8 మంది మృత్యువాత పడ్డారు. మిగిలిన వాళ్ల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వీరితో కాంటాక్ట్‌లో ఉన్న వారిని కనిపెట్టడం కోసం దేశ వ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీ విధించారు. రువాండాలోని 30 జిల్లాల్లో ఏడు జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు అల్‌జజీరా పేర్కొంది. రువాండాలో తొలిసారి ఈ మహమ్మారి వెలుగు చూడగా, దాని కట్టడికి అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు రువాండా ఆరోగ్య శాఖ తెలిపింది. డబ్ల్యూహెచ్‌ఓ రువాండా కార్యాలయం కూడా స్థానిక ఆరోగ్య నిపుణులతో కలిసి పని చేస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ స్పష్టం చేశారు.
Strong infection prevention measures are pivotal to curbing the spread of #Marburg virus disease. Supporting Rwanda’s efforts to end the Marburg outbreak, @WHO, with @USAID support, has delivered over 500 kits of clinical care & infection prevention and control supplies as… pic.twitter.com/OiUVHsXoRh
— WHO African Region (@WHOAFRO) October 2, 2024
మార్‌బర్గ్ వైరస్ సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే?
మార్‌బర్గ్ వైరస్ బాడీ ఫ్లూయిడ్స్ ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది. ఆ ఫ్లూయిడ్స్ పడిన ప్రదేశాల్లో తిరిగిన వారికి కూడా ఈ వైరస్ సోకుతుంది. ఈ వైరస్ సోకిన వారిలో హై ఫీవర్, తీవ్రమైన తలనొప్పి, మజిల్ పెయిన్స్ వస్తాయి. వ్యాధి సోకిన మూడు రోజుల తర్వాత నీళ్ల విరోచనాలు, కడుపు నొప్పి, వాంతులు, శరీరంలోని వివిధ మార్గాల్లో రక్తం బయటకు పోతుంది. ఈ స్థాయిలో రోగులు ఘోస్ట్-లైక్ ఫీచర్స్‌తో ఉంటారని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. కరోనా సమయంలో పాటించిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధి కట్టడి సులభమేనని వైద్య నిపుణులు పేర్కొన్నారు. మార్‌బర్గ్ సోకిన వారికి దూరంగా ఉండడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని డబ్ల్యూహెచ్‌ఓ సూచించింది.
Also Read: నెలలో పీరియడ్స్ రెండుసార్లు వస్తున్నాయా? కారణాలు ఇవే కావొచ్చు