Driving License In Afghanistan: అఫ్గాన్‌లో మహిళలకు ఇక నో డ్రైవింగ్ లైసెన్స్- తాలిబన్ల షాకింగ్ నిర్ణయం
Driving License In Afghanistan: అఫ్గానిస్థాన్‌లో ఇక మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్‌లు జారీ చేయరట. అవును తాజాగా తాలిబన్లు ఈ షాకింగ్ నిర్ణయం ప్రకటించారు.
Driving License In Afghanistan: అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల అరాచక పాలన కొనసాగుతోంది. అధికారం చేపట్టిన నాటి నుంచి అఫ్గానిస్థాన్‌లో మహిళలపై తాలిబన్లు అనేక ఆంక్షలు విధిస్తూనే ఉన్నారు. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది తాలిబన్ల సర్కార్. అఫ్గాన్ మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయడాన్ని ప్రభుత్వం నిలిపివేసింది.
ఇదేందిరా సామీ
కాబూల్ సహా ఇతర రాష్ట్రాల్లో ఉన్న మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీని నిలిపివేసినట్లు అక్కడి మీడియా ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు డ్రైవింగ్ టీచర్లకు ఆదేశాలు కూడా జారీ అయినట్టు తెలిపింది. ముఖ్యంగా తాలిబన్లు మహిళలపై ఉద్యోగాలు, పాఠశాలలతో పాటు ఇతర అంశాల్లో కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు.
ఉన్నత విద్యపై
అఫ్గానిస్థాన్‌లో బాలికలు హైస్కూల్ విద్యను అభ్యసించేందుకు అనుమతించట్లేదని ఇటీవల తాలిబన్లు ప్రకటించారు. బాలికలను హైస్కూల్ విద్యకు కూడా అనుమతిస్తున్నట్లు తాలిబన్లు ముందు ప్రకటించారు.. కానీ పాఠశాలలు ప్రారంభమైన కొన్ని గంటల్లోనే తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు.
ప్రపంచ దేశాలు తమ ప్రభుత్వాన్ని గుర్తించేందుకు వీలుగా పలు సంస్కరణలు చేపడుతున్నట్లు తాలిబ్లను గతంలో ప్రకటించారు. ఇందులో భాగంగానే బాలికలకు ఉన్నత చదువులు అందించేందుకు కూడా అనుమతిస్తున్నట్లు చెప్పారు. కానీ మళ్లీ మాట మార్చుతూ బాలికలను చదువుకు దూరం చేశారు. బాలికలకు ఉన్నత విద్య అభ్యసించేందుకు అనుమతించట్లేదన్నారు. ఆరవ తరగతి వరకే పరిమితం చేస్తున్నట్లు చెప్పారు.
తాము ఈ నిర్ణయం తీసుకునేందుకు గ్రామీణ ప్రజలే కారణమని తాలిబన్లు ఆరోపిస్తున్నారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఉన్న వారు తమ పిల్లలను పాఠశాలలకు పంపేందుకు అంగీకరించడంలేదని చెబుతున్నారు. ఇందుకోసమే బాలికలకు ఉన్నత విద్యను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు.
అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా తన బలగాలను ఉపసంహరించుకోవడంతో తమ బలాన్ని మరోసారి నిరూపించుకుంటూ దేశాన్ని తాలిబన్లు ఆక్రమించుకున్నారు. అయితే తాలిబన్లతో పోరాడాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసింది. అఫ్గాన్ అధ్యక్షుడు దేశం విడిచి పారిపోయారు. దీంతో తాలిబన్లు దేశాన్ని ఆక్రమించుకున్నారు. అప్పటి నుంచి అఫ్గాన్ ప్రజలకు కష్టాలు ఎక్కువయ్యాయి. రోజుకో అనూహ్య నిర్ణయంతో తాలిబన్లు అఫ్గాన్ పౌరులకు షాక్ ఇస్తున్నారు. మహిళలపై ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. మొదట ఉన్నత విద్యకు బ్రేకులు వేసిన తాలిబన్లు ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్‌లు ఇవ్వకుండా నిలిపివేశారు.
Also Read: PM Modi-Macron Meet: ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్‌తో మోదీ భేటీ- ఉక్రెయిన్ యుద్ధంపై చర్చ