Trump Warns Iran: అణు పరీక్షలు ఆపాలి, మాట వినకపోతే మళ్లీ బాంబు దాడులు - ఇరాన్‌ను హెచ్చరించిన ట్రంప్
Iran Israel Conflict | యురేనియం ఉత్పత్తి కొనసాగిస్తే చర్యలు తప్పవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు తేల్చిచెప్పారు. ఖమేనీ వార్నింగ్ తరువాత ట్రంప్ ఇలా వ్యాఖ్యానించారు.

Donald Trump Warns Iran: మధ్యప్రాచ్యంలో మంటలు ఇంకా చల్లారలేదు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య దాదాపు 12 రోజుల ఉద్రిక్తతల తరువాత కాల్పుల విరమణ జరిగింది. కాల్పుల విరమణ ప్రకటన తరువాత సైతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి ఇరాన్‌ను హెచ్చరించారు. ఇరాన్ కనుక యురేనియం ఉత్పత్తిని కొనసాగిస్తే, అమెరికా తప్పకుండా మళ్లీ బాంబు దాడులు చేస్తుందని స్పష్టం చేశారు.
ఇరాన్ అధినేత అయతొల్లా అలీ ఖమేనీని తాము భయంకరమైన చావు నుంచి కాపాడామని ట్రంప్ అన్నారు. కానీ ఖమేనీ తన బుద్ధి చూపిస్తున్నారని, ఇది సరికాదంటూ మండిపడ్డారు. ఇజ్రాయెల్ తో ఉద్రిక్తతల సమయంలో అమెరికా మధ్యవర్తిత్వం చేయడం ఖమేనీ ప్రాణాలను కాపాడిందన్నారు.
ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సలహా
వైట్ హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్‌కు తన అణు కార్యక్రమాన్ని తిరిగి చేపట్టకూడదన్నారు. ఇరాన్ అణు పరీక్షలు తిరిగి ప్రారంభించకుండా అంతర్జాతీయ తనిఖీ కోసం సిద్ధంగా ఉండాలని సలహా ఇచ్చారు. ఇరాన్‌తో చర్చల సమయంలో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ లేదా మరే ఇతర సంస్థనైనా తనిఖీ చేయడానికి ఇరాన్ సహకరించాలని ట్రంప్ అన్నారు.
అమెరికాను హెచ్చరించిన ఖమేనీ
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అమెరికాను హెచ్చరించిన మరుసటిరోజు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. మధ్యప్రాచ్యంలో అమెరికా సైనిక స్థావరాలకు ఇరాన్ సులువుగా చేరుకోగలదని, అవసరమైతే తగిన చర్యలు తీసుకుంటుందని అన్నారు. శత్రువు దాడి చేస్తే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ఖమేనీ అన్నారు.
ఖమేనీ మాట్లాడుతూ, "మేము వారి అల్-ఉదీద్ ఎయిర్ బేస్‌పై దాడి చేసి నష్టం కలిగించాం. ఇది ఈ ప్రాంతంలోని అమెరికా ప్రధాన స్థావరాలలో ఒకటి. ఇది అమెరికాకు చెంపదెబ్బ లాంటిది" అని అన్నారు.
అమెరికా సైనిక స్థావరాలను టార్గెట్ చేసిన ఇరాన్
ఆపరేషన్ మిడ్‌నైట్ హామర్ ద్వారా, అమెరికా జూన్ 22, 2025న ఇరాన్ కు చెందిన 3 అణు స్థావరాలైన ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్లపై దాడి చేసి వాటిని ధ్వంసం చేసింది. ఈ మిషన్‌లో 125 కంటే ఎక్కువ విమానాలు, B-2 స్టీల్త్ బాంబర్లు, 30 కంటే ఎక్కువ టోమాహాక్ మిసైల్స్ ను అమెరికా ప్రయోగించింది. అమెరికా దాడులకు ఇరాన్ తెలివిగా ప్రతీకారం తీర్చుకుంది. ఖతార్‌లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై దాడి చేసింది. ఖతార్‌లోని అల్ ఉదీద్ ఎయిర్‌బేస్‌పై 6 మిస్సైల్స్ ను ప్రయోగించింది. ఇరాన్ ప్రతీకారంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తత బాగా పెరిగింది.
ఓవైపు ఇజ్రాయెల్‌తో తలపడుతున్న ఇరాన్ సైన్యం, అమెరికా రంగంలోకి దిగడంతో అగ్రరాజ్యంతోనే పోరాటం చేయాల్సి వస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఆపన్న హస్తం అందించి ఇరాన్ కు వ్యతిరేకంగా పావులు కదిపింది. సీజ్ ఫైర్ ప్రకటన తరువాత సైతం ఇరాన్ తోక జాడిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇజ్రాయెల్ ప్రధాని హెచ్చరించారు. ఈ యుద్ధంలో స్నేహధర్మం పాటించిన అమెరికాకు నెతన్యాహు ధన్యవాదాలు తెలిపారు.






















