(Source: ECI/ABP News/ABP Majha)
US President Elections 2024: అమెరికా అధ్యక్షులను నిర్ణయించేది ఆ రాష్ట్రాలే- ఏడింటిపైనే కన్నేసిన డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్
US News: అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తోంది. నవంబర్ 5న జరిగే ఎన్నికల్లో కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్ పోటీ చేస్తున్నారు.
US Presidential Elections: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు అంటే ప్రపంచం మొత్తానికీ ఆసక్తే. నవంబర్ 5న ఎన్నికలు జరగున్న నేపథ్యంలో రిపబ్లికన్ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ నుంచి కమలా హారిస్ పోటీ చేస్తున్నారు. నవంబర్ 5న ఎన్నికలు జరగనున్న వేళ ఇరు పార్టీల మధ్య పోటీ రసవత్తరంగా మారింది. మొదట డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా జో బైడన్ ఉన్న సమయంలో పోటీ ఏకపక్షంగా ఉంటుందని అంతా భావించారు. సర్వేలు కూడా రిపబ్లిక్ పార్టీదే విజయం అన్నట్టుగా ప్రచారం చేశాయి. అనూహ్యంగా జో బైడన్ పోటీ నుంచి తప్పుకోవడంతో ఆమె స్థానంలో కమలా హారిస్ పేరు తెరపైకి వచ్చింది. అప్పటివరకు వార్ వన్ సైడ్ అన్నట్టుగా సాగిన ప్రచారంలో మార్పొచ్చింది. ఇరు కమలా హారిస్, ట్రంప్ మధ్య హోరాహోరీ పోరు తథ్యమని తెలుస్తోంది. మొత్తం 50 రాష్ట్రాలున్న అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో గెలుపోటములను ప్రభావితం చేసే రాష్ట్రాలు మాత్రం ఏడే ఉన్నాయి. ఇక్కడ మెజారిటీ సాధించిన పార్టీదే విజయం కావడంతో ఇద్దరు అభ్యర్థులు అక్కడి న్యూట్రల్ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఈ స్వింగ్ స్టేట్స్ అమరికా అధ్యక్షుడిని నిలబెట్టనున్నాయి.
మొత్తం 50 రాష్టాలున్న అమెరికాలో 7 రాష్ట్రాలే గెలుపోటములను ప్రభావితం చేయనున్నాయి. అందుకే అరిజోనా, జార్జియా, మిచిగాన్, నెవాడా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ రాష్ట్రాలను స్వింగ్ స్టేట్స్‌గా పిలుస్తుంటారు. అక్కడుండే న్యూట్రల్ ఓటర్లు ఎవర్ని ఆశీర్వదిస్తే వారిదే విజయం కావడంతో రెండు రాష్ట్రాలపై ఇరు పార్టీలు ఎక్కువ దృష్టిపెడుతున్నాయి.
అరిజోనా రాష్ట్రం : మెక్సికో దేశంతో సరిహద్దును పంచుకునే ఈ రాష్ట్రం ఒకప్పుడు రిపబ్లికన్లకు కంచుకోటగా ఉండేది. అలాంటిది 2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్ల విజయంలో కీలకపాత్ర పోషించింది. అరిజోనా అధ్యక్ష ఎన్నికల్లో బైడన్ వైపు మొగ్గు చూపించింది. 1990 తర్వాత డెమోక్రట్ల పక్షాన నిలిచింది. సరిహద్దు దేశం మెక్సికో నుంచి అక్రమ వలసలు ఇక్కడి ప్రధాన సమస్య. అయితే ఆ సమస్య కొంత మేర పరిష్కారమైనప్పటికీ ఇమిగ్రేషన్ సమస్య ఆందోళన కలిగిస్తోంది. తనను అధ్యక్షుడిగా ఎన్నుకుంటే అక్రమ వలసలను ఉక్కుపాదంతో అడ్డుకుంటానని ట్రంప్ హామీ ఇస్తున్నారు. జో బైడన్ హయాంలో ఈ సరిహద్దు వివాదం పరిష్కరించడంలో కమలా హారిస్ విఫలమైందనే ఆరోపణల నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ మళ్లీ ఇక్కడ మెజారిటీపై ఆశలు పెట్టుకుంటోంది.
జార్జియా : 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నిర్ణయాత్మక పాత్ర పోషించగల మరొక రాష్ట్రం జార్జియా. అమెరికాలో అత్యధిక సంఖ్యలో ఆఫ్రికన్-అమెరికన్ నివాసితులు అక్కడ ఉన్నారు. 2020లో బైడెన్ గెలుపులో వీరంతా కీలక పాత్ర పోషించారు. అయితే నల్లజాతి ఓటర్లు డెమొక్రటిక్ పార్టీ పట్ల ఈ దఫా నిరాశతో ఉన్నట్టు తెలుస్తోంది. అది కమలా హారిస్ విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశమున్నట్టు సమాచారం. దీంతో ఆఫ్రికన్-అమెరికాన్ ఓట్లను రాబట్టేందుకు కమలా హారిస్ ప్రచార బృందం తీవ్రంగా యత్నిస్తోంది.
మిచిగాన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరో కీలక రాష్ట్రం మిచిగాన్. గత రెండు ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎన్నికైన వారి వైపే మిచిగాన్ ఓటర్లు మొగ్గు చూపారు. మిచిగాన్‌లో ఎక్కువగా అరబ్-అమెరికన్ జనాభా ఉంటుంది. గాజాతో యుద్ధంలో ఇజ్రాయెల్‌కు బైడెన్ మద్దతివ్వడంపై వారి నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అమెరికా ఎన్నికల్లో కీలకమైన మిచిగాన్ ప్రాముఖ్యతను గ్రహించిన ట్రంప్. ఇజ్రాయెల్, గాజా వ్యవహారంపై ఇప్పటికే స్పందించారు. గాజాలో యుద్ధాన్ని ఆపాలని ఇప్పటికే ఇజ్రాయెల్‌ను ట్రంప్ కోరారు. మిచిగాన్ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రెండు పార్టీలు దృష్టి సారిస్తున్నాయి.
నెవాడా : నెవాడా రాష్ట్రం ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతోంది. కోవిడ్ అనంతరం ఇతర రాష్ట్రాలతో పోల్చితే వెనకబడిపోయింది. డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా, కాలిఫోర్నియా తర్వాత నెవాడాలో నిరుద్యోగ రేటు అధికంగా ఉంది. ఇటీవల జరిగిన పలు ఎన్నికల్లో డెమోక్రాట్లకు మద్దతుగా నిలిచిన నెవాడా ఓటర్లు, ఈసారి రిపబ్లికన్ పక్షం తీసుకోవచ్చని సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి. ప్రీపోల్స్‌లో కూడా బైడన్ కంటే ఎక్కువ మంది ట్రంప్ కే మద్దు తెలిపారు. ఆర్థి సంక్షోభం నేపథ్యంలో పన్నులపై నిబంధనలు సరళతరం చేస్తానని ట్రంప్ హామీ ఇస్తున్నారు.
నార్త్ కరోలినా : జూలైలో తనపై హత్యాయత్నం జరిగిన తర్వాత ట్రంప్ తొలిసారి బహిరంగ సభ ఇక్కడే నిర్వహించారు. రిపబ్లికన్లు ఈ ప్రాంతాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని దీన్ని బట్టే తెలుస్తోంది. ఈ రాష్ట్రాన్ని విశ్లేషకులు "టాస్-అప్" గా పేర్కొంటున్నారు. డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హారిస్ బరిలోకి వచ్చినప్పటి నుంచి ఇక్కడ పోటీ హోరాహోరీగా సాగుతోంది.
Also Read: యూకే అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఫాస్ట్ - పదిహేనేళ్లకే కానిచ్చేస్తున్నారట !
పెన్సిల్వేనియా : ఈ రాష్ట్రాన్ని పీడిస్తున్న ప్రధాన సమస్య ద్రవ్యోల్బణం. జో బైడన్ హయాంలో ఈ సమస్య తీవ్రమైంది. 2020 లో బైడన్ ఓటర్లను తనవైపు తిప్పుకున్నప్పటికీ ఈసారి కష్టంగానే కనిపిస్తోంది. ఇక్కడ నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదలతో స్థానికలు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారని మార్కెట్ ఇంటెలిజెన్స్ ప్రొవైడర్ డేటాసెంబ్లీ తెలియజేసంది. ఈ పరిస్థితులే తనకు అనుకూలంగా మారతాయని ట్రంప్ అంచనా వేస్తున్నారు.
విస్కాన్‌సిన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విస్కాన్‌సిన్ ఫలితం కీలకం కానుంది. విస్కాన్‌సిన్ గెలిస్తే అధ్యక్ష పీఠం మనదేనని ట్రంప్ ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ గ్రీన్ పార్టీకి చెందిన అభ్యర్థి జిల్ స్టోయిన్ ఉండటంతో డెమోక్రాట్లు ఆందోళన చెందుతున్నారు. గ్రీన్ ఎన్నికల నిబంధనలు పాటించడం లేదని ఆయన్ను తొలగించాలని డెమోక్రాట్లు పిర్యాదులు చేశారు. 2016, 2020 అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులవైపే అక్కడి ఓటర్లు మొగ్గు చూపారు.
Also Read: నమీబియాలో కరవు- ప్రజల ఆకలి తీర్చడానికి అడవి జంతువుల వధ