Oldest Pointy Stick: ఆది మానవులు వాడిన కర్ర జర్మనీలో లభ్యం- ఎన్ని లక్షల ఏళ్ల నాటిదో తెలుసా?
Oldest Pointy Stick: లక్షల సంవత్సరాల క్రితం వాడిన ఓ కర్ర పనిముట్టును తాజాగా పరిశోధకులు కనిపెట్టారు.
Oldest Pointy Stick: లక్షల సంవత్సరాల క్రితం మానవులు కర్రలను పనిముట్లుగా వాడే వారు. కర్రలతో తయారు చేసిన వివిధ వస్తువులను, వివిధ అవసరాల కోసం విరివిగా ఉపయోగించేవారు. అలాంటి ఓ పురాతన కర్రను తాజాగా పరిశోధకులు కనిపెట్టారు. ఈ కర్ర ఏకంగా 3 లక్షల క్రితం నాటిదని శాస్త్రవేత్తలు తెలిపారు. పురాతన మానవులు ఉపయోగించిన ఈ కర్రను జర్మనీలో గుర్తించారు. ఈ పాయింటీ స్టిక్ గురించి PLOS ONEలో ప్రచురించిన అధ్యయన నివేదికలో పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ అన్నెమీకే మిల్క్స్ తెలిపారు. అప్పట్లోనే మానవులకు చెక్క లక్షణాల గురించి పూర్తి అవగాహన ఉండేదని, కర్రలను ఎలా వాడాలో, ఎలా వాడితే వాటి నుంచి అధిక పనితనం రాబట్టుకోవచ్చో వారికి బాగా తెలుసున్నారు. ఇప్పటికీ ఉపయోగిస్తున్న చెక్క పని నైపుణ్యాలను.. వారు అప్పట్లోనే వాడారని తెలిపారు.
పాయింటీ స్టిక్ లు అంటే జంతువులను వేటాడటానికి ఉపయోగించే కర్ర. వీటితో జంతువులపై దాడి చేస్తే అవి షాక్ కొట్టినట్లు కొన్ని క్షణాల పాటు ఎలాంటి కదలిక లేకుండా ఉండిపోతాయి. అంతలోనే ఇతర ఆయుధాలతో ఆ జంతువులను హతమారుస్తారు. ఇలాంటి పాయింటీ స్టిక్ లను మొట్టమొదటిసారి 1994 స్కోనింగెన్ లో కనిపెట్టారు. ఈ పనిముట్టును దాదాపు 30 ఏళ్ల క్రితమే గుర్తించిన స్టిక్ పై.. 3డి మైక్రోస్కోపీ వంటి సాంకేతికతను ఉపయోగించి లోతుగా అధ్యయనం చేశారు. ఈ టూల్ ను ఎలా తయారు చేశారు.. మొదట్లో మానవులు దీనిని ఎలా ఉపయోగించే వారు లాంటి విషయాలను కనుగొన్నారు.
పురాతన మానవులు, బహుశా హోమో హైడెల్బెర్గెన్సిస్ లేదా హోమో నియాండర్తలెన్సిస్ జంతువులను వేటాడేందుకు ఈ ఆయుధాలను ఒక రకమైన బూమరాంగ్ గా ఉపయోగించే వారని పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ కర్రలను 30 మీటర్ల దూరం నుంచి జింకలు, గిట్టలు, కుందేళ్లు, పక్షులు లాంటి వాటిపై ధాటిగా, గురితప్పకుండా విసిరేవారు.
వందల, వేల సంవత్సరాల క్రితం చెక్కతో చేసిన పనిముట్లు లభించడం చాలా అరుదు. ఎందుకంటే చెక్కతో చేసిన పనిముట్లు చాలా వరకు బ్యాక్టీరియా లేదా శిలీంధ్రాల వల్ల నశించిపోతాయి. అయితే జర్మనీలో దొరికిన ఈ పాయింటీ స్టిక్ మాత్రం నీటిలో ఉండిపోయింది. దాని వల్ల ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ పాయింటీ స్టిక్ లభ్యం అయినట్లు పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.