ద్రవ్య బిల్లులను పరిశీలించేందుకు ఏడుగురు సభ్యుల ధర్మాసనం : సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
ద్రవ్య బిల్లులను పరిశీలించేందుకు ఏడుగురు సభ్యుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ వెల్లడించారు.
ద్రవ్య బిల్లులను పరిశీలించేందుకు ఏడుగురు సభ్యుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ వెల్లడించారు. మనీ బిల్లులపై నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. మనీ బిల్లు రూపంలో తీసుకువచ్చి ఆమోదం పొందిన ఆధార్ చట్టం చెల్లుబాటు వంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఆధార్ బిల్లుతో పాటు ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్టు సవరణ కోసం ప్రభుత్వం మనీ బిల్లుల రూపంలో ప్రవేశపెట్టింది. రాజ్యసభలో మెజార్టీ లేనందునే ప్రభుత్వం వీటిని మనీ బిల్లు రూపంలో తీసుకువచ్చిందనే వాదన ఉంది. ఇప్పటివరకు పెండింగులో ఉన్న, ఏడుగురు సభ్యుల ధర్మాసనం విచారించదగిన అంశాలను అక్టోబర్ 12 నుంచి లిస్టింగ్ చేస్తామని జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. మనీ బిల్లుల అంశాన్ని సుప్రీం ధర్మాసనం ప్రస్తావించింది.
మనీ బిల్లు అంటే ఏంటి ?
మనీ బిల్లును కేవలం లోక్‌సభలో మాత్రమే ప్రవేశపెడతారు. లోక్‌సభ ఆమోదం పొందిన తర్వాత స్పీకర్ ధ్రువీకరణతో రాజ్యసభకు వెళ్తుంది. దానిని రాజ్యసభ సవరించడం లేదా తిరస్కరించలేదు. కేవలం సిఫార్సులను మాత్రమే చేస్తుంది. 14రోజుల్లోగా తన ఆమోదాన్ని తప్పనిసరిగా తెలియజేయాలి. లేదంటే ఆమోదించినట్లుగానే పరిగణిస్తారు.