MIS-C in Children: కోవిడ్ తర్వాత మరో వ్యాధి.. పిల్లల్లోనే ఎక్కువ.. ఎందుకలా?
MIS-C in Children: మల్టీసిస్టమ్ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్.. కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత పిల్లల్లో MIS-C లక్షణాలు బయటపడుతున్నాయని వైద్యులు అంటున్నారు.
కోవిడ్ వైరస్ వచ్చినప్పుడు కంటే అది తగ్గాక వచ్చే లక్షణాలే (పోస్ట్ కోవిడ్ సింట్రోమ్స్) చాలా తీవ్రంగా ఉంటున్నాయి. కోవిడ్ తగ్గాక కొన్నాళ్లపాటు తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు సహా జీర్ణకోశ సమస్యలు చుట్టుముడుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా ఇవి అందరికీ వస్తున్నాయని అంటున్నారు. ముఖ్యంగా పిల్లల్లో కోవిడ్ వచ్చి తగ్గాక మల్టీసిస్టమ్ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్ (MIS-C) లక్షణాలు బయటపడుతున్నాయని పేర్కొన్నారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఈ వ్యాధి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. రాజస్తాన్ రాష్ట్రంలోని జైపూర్ లో ఉన్న ఓ ప్రముఖ పిల్లల ఆస్పత్రిలో ఇటీవల ఈ వ్యాధితో 155 మంది చిన్నారులు చేరగా 17 మంది మరణించారు.
కోవిడ్ ఫస్ట్ వేవ్ సమయంలో కొవిడ్‌తో గాంధీ ఆస్పత్రిలో 700 మంది చిన్నారులు చేరగా.. 58 మందిలో MIS-C సమస్య బయటపడింది. ఒకరిద్దరు తప్ప.. అంతా కోలుకున్నారు. సెకండ్ వేవ్ ఉద్ధృతి కారణంగా పిల్లల్లో ఈసారి MIS-C ముప్పు పెరిగిందని వైద్యులు అంటున్నారు.
మల్టీసిస్టమ్ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్ అంటే ఏంటి?
కోవిడ్ నుంచి కోలుకున్నాక వచ్చే కాంప్లికేషన్లలో మల్టీసిస్టమ్ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్ కూడా ఒకటి. కరోనా వైరస్ ఇన్‌ఫెక్షన్‌ను కట్టడి చేసేందుకు ఉపయోగించే యాంటిజెన్‌కు (antigen) వ్యతిరేకంగా శరీరంలో ప్రతిచర్యలు జరుగుతాయి. వీటి ఫలితంగా MIS-C వస్తుంది. కోవిడ్ నుంచి కోలుకున్న 2, 3 వారాల తర్వాత చిన్నారుల్లో MIS-C లక్షణాలు బయటపడతాయని సవాయ్ మాన్ సింగ్ (SMS) మెడికల్ కాలేజీలో పీడియాట్రిక్స్ విభాగంలో సెంటర్ ఆఫ్ రేర్ డిసీసెస్ విభాగం ఇన్‌చార్జ్ డాక్టర్ అశోక్ గుప్తా వెల్లడించారు. దీనిని మొదటి దశలోనే గుర్తించి చికిత్స అందిస్తే ప్రాణాంతకం కాకుండా చిన్నారులను కాపాడగలమని తెలిపారు. ఈ వ్యాధి గురించి తల్లిదండ్రులకు అవగాహన లేకపోవడంతో పిల్లలను ఆలస్యంగా తీసుకొస్తున్నారని చెప్పారు. ఇది ఎక్కువగా 3 నుంచి 12 ఏళ్ల వయసున్న పిల్లల్లో కనిపిస్తుందని అన్నారు. ఇది గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, జీర్ణవ్యవస్థ వంటి వాటిపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.
దీని లక్షణాలు ఎలా ఉంటాయి?
మల్టీసిస్టమ్ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్ బారిన పడిన చిన్నారుల్లో జ్వరం, వికారం, చర్మంపై దద్దుర్లు, పొత్తికడుపులో నొప్పి, మెడ దగ్గర గ్రంథుల్లో వాపు, పెదాలు పొడిబారి పగలడం, బొటన వేలు ఎర్రబారడం, కళ్లు ఎర్రగా మారి మంట రావడం, కీళ్ల నొప్పులు లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- వ్యక్తిగత పరిశుభ్రత, మాస్క్ ధరించడం, చేతులను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకోవడం, సామాజిక దూరం పాటించడం చాలా ముఖ్యం. చిన్నారులే కదా అని అశ్రద్ధ వహించకుండా వీటన్నిటి గురించి వారికి అవగాహన కల్పించాలి.
- ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
- అనారోగ్యంతో ఉన్న చిన్నారులకు ముఖ్యంగా దగ్గు, జలుబు ఉన్న వారికి పిల్లలను దూరంగా ఉంచాలి.
- సాధ్యమైనంత వరకు పిల్లలను అవుట్‌డోర్ గేమ్స్‌కు పంపకపోవడమే ఉత్తమం.
- పిల్లలకు ఇచ్చే ఆహారంలో పోషకాలు, సీ, డీ విటమిన్లు, ఒమెగా ఫ్యాటీ ఆమ్లాలు ఉండేలా చూసుకోండి.
- పైన పేర్కొన్న లక్షణాల్లో ఏమైనా మీ పిల్లల్లో కనిపిస్తే అప్రమత్తంగా ఉండండి. ఈ లక్షణాలు రెండు కంటే ఎక్కువ రోజుల పాటు తీవ్రంగా ఉంటే మాత్రం వైద్యులను సంప్రదించండి.