Orange Alert : హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లకు ఆరెంజ్ అలర్ట్
Orange Alert : హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను మళ్లీ భారీ వర్ష సూచన భయపెడుతోంది
Orange Alert: గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు, కొండ చరియలు విరిగిపడడం వంటి ఘటనలతో అతలాకుతలమవుతున్న హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను మళ్లీ భారీ వర్ష సూచన భయపెడుతోంది. ఈ రెండు రాష్ట్రాలలో ఆగస్టు 22 నుంచి 24 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. దీంతో రెండు రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి.
ఆగస్టు 21 నుంచి 24 తేదీల మధ్య సమయంలో ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని, ఆగస్టు 22, 23 తేదీల్లో వాయువ్య ఉత్తరప్రదేశ్‌లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తాజా బులెటిన్‌లో పేర్కొంది. చంబా, మండి జిల్లాల పరివాహక ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని ఆగస్టు 26 వరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగి పడడం, నదులు, కాలువలలో నీటి మట్టాలు పెరుగే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఈ వర్షాల కారణంగా రాష్ట్రాలలో పంటలు, పండ్ల మొక్కలలకు విపరీతంగా నష్టం కలుగుతోంది.
హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో వర్షాల కారణంగా సంభవించిన ఘటనలలో చనిపోయిన వారి సంఖ్య ఇప్పటికే 88 కి చేరింది. సిమ్లాలో కూలిపోయిన ఆలయం శిథిలాల నుంచి మరొక మృతదేహాన్ని వెలికి తీయడంతో ఈ సంఖ్య 88 కి పెరిగింది. హిమాచల్‌కు ముందస్తు సహాయంగా కేంద్రం ఆదివారం రూ.200 కోట్లు విడుదల చేయడానికి ఆమోదం తెలిపింది. రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్స్ కోసం ఎన్డీఆర్‌ఎఫ్ నుంచి 20 బృందాలు, ఇండియన్ ఆర్మీకి చెందిన తొమ్మిది బృందాలు, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన మూడు హెలికాప్టర్లు పనిచేస్తున్నాయి.
అలాగే ఆగస్టు 24, 25 తేదీలలో సబ్-హిమాలయ్ వెస్ట్ బెంగాల్, సిక్కింలలో కూడా భారీ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ వెల్లడించింది. బిహార్‌లో ఆగస్టు 25 వరకు భారీ వర్షాలను అంచనా వేస్తోంది. ఆగస్టు 21 నుంచి 25 తేదీల మధ్య అసోం, మేఘాలయాల, అరుణాచల్ ప్రదేశ్‌లలోనూ భారీ వర్ష సూచన ఉందని ఐఎండీ పేర్కొంది. దక్షిణ భారతదేశం విషయానికొస్తే, ఆగస్టు 22 న తమిళనాడులో తేలికపాటి లేదా మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడాని వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
ఇటీవల ఉత్తరాఖండ్‌లోని రిషికేష్‌లో కురిసిన కుండపోత వర్షాల కారణంగా ఇళ్లు వరద నీటిలో మునిగిపోయాయి. కొన్ని ఇళ్లు కొట్టుకుపోయాయి. మునిగిన ఇళ్లలో చిక్కుకుపోయిన వారిని ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది రక్షించారు. రాత్రి పగలు తేడా లేకుండా అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. వర్షాల కారణంగా ఉత్తరాఖండ్‌లో జరిగే ఛార్‌ధామ్ యాత్రను ప్రభుత్వం కొద్ది రోజులు నిలిపేసింది. సిమ్లాలోని ఫగ్లి ప్రాంతంలో కొండచరియలు విరిగిపడిన కారణంగా ఓ శివాలయం ధ్వంసమైంది. ఆలయ శిథిలాల కింద చిక్కుకుని దాదాపు పది మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే చాలా ఇళ్లు బురదలో కూరుకుపోయి ప్రజలు తీవ్ర అవస్థల పాలవుతున్నారు. కొద్ది రోజుల క్రితం కేవలం 24 గంటల్లోనే వర్షాలకు సంబంధించిన సంఘటనల కారణంగా 50 మంది చనిపోయినట్లు హిమాచల్ రాష్ట్ర మంత్రి వెల్లడించారు. దీంతో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.