చర్మం ఒలిచి చెప్పులు కుట్టించి తల్లికి కానుక, రామాయణం స్ఫూర్తితో చేశాడట
Viral News: మధ్యప్రదేశ్‌లో ఓ వ్యక్తి చర్మం ఒలిచి చెప్పులు కుట్టించి తల్లికి కానుకగా ఇచ్చాడు.
Viral News: మధ్యప్రదేశ్‌లోని ఓ వ్యక్తి రామాయణం నుంచి స్ఫూర్తి పొంది తన తల్లికి చర్మంతో చెప్పులు కుట్టించాడు. ఒకప్పుడు రౌడీ షీటర్ అయిన రౌణక్ గుర్జార్ ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. గతంలో రౌణక్‌పై పోలీసులు కాల్పులు కూడా జరిపారు. ఆ సమయంలో కాలికి గాయమైంది. కానీ ఇప్పుడు అంతా మానేసి బుద్ధిగా ఉంటున్నాడు. తల్లిపై తన ప్రేమని చూపించడానికి తొడ చర్మాన్ని కొంత తొలగించి వాటితో చెప్పులు కుట్టిచ్చాడు. రామాయణంలో రాముడు తన తల్లిపై చూపించిన ప్రేమే తనకు స్ఫూర్తి అని చెబుతున్నాడు రౌణక్.
"నేను రోజూ రామాయణం చదువుతాను. రాముడి నుంచి నేనెంతో స్ఫూర్తి పొందాను. అమ్మ కోసం ఎంత చేసినా తక్కువే. స్వయంగా రాముడే ఈ విషయం చెప్పాడు. చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా తక్కువే అని అన్నాడు. అప్పుడే నాకీ ఆలోచన వచ్చింది. నా చర్మంతో అమ్మకి చెప్పులు కుట్టించాలని అనుకున్నాను. వాటిని ఆమెకి కానుకగా ఇవ్వాలనుకున్నాను"
- రౌణక్ గుర్జర్
హాస్పిటల్‌కి వెళ్లి ప్రత్యేకంగా సర్జరీ చేయించుకుని తొడ నుంచి కొంత చర్మాన్ని తొలగించుకున్నాడు రౌణక్. ఈ విషయం కుటుంబ సభ్యులకు కూడా చెప్పలేదు. ఆ చర్మాన్ని చెప్పులు కుట్టే వ్యక్తి దగ్గరికి తీసుకెళ్లి ఇచ్చాడు. ఇంటికి సమీపంలో ఓ ఆధ్యాత్మిక కార్యక్రమం జరుగుతున్న సమయంలో తల్లికి ఈ చెప్పులను కానుకగా ఇచ్చాడు రౌణక్. ఇది చూసి అక్కడి వాళ్లంతా చలించిపోయారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. అతని తల్లైతే కన్నీళ్లను ఆపుకోలేకపోయింది.