Vande Bharat Express:కొత్త వందేభారత్ రైళ్లలో బ్లాక్‌బాక్స్ సౌకర్యం
వందేభారత్ రైళ్లలో కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. విమానాల తరహాలో బ్లాక్‌బాక్స్‌ను.. ఈ ట్రైన్స్‌లో అమరుస్తున్నాయి. కొత్తగా వచ్చే వందేభారత్‌లలో ఈ అత్యాధునిక సౌకర్యం కనిపించనుంది.
వందేభారత్ రైళ్లు... ఇప్పటికే వాహ్వా అనిపిస్తున్నాయి. ప్రయాణ గంటలను తగ్గించడమే కాకుండా... జర్నీలో ఇబ్బంది లేకుండా అత్యాధునిక సౌకర్యాలు ఆ రైళ్లలో ఉన్నాయి. ఇప్పుడు మరో అత్యాధునిక సౌకర్యం కూడా వందేభారత్ రైళ్లలో కనిపించనుంది. విమాన తరహాలో బ్లాక్ బాక్స్‌ను కొత్తగా రాబోయే వందేభారత్‌లలో ఏర్పాటు చేయాలని ఇండియన్ రైల్వే భావిస్తోంది. పెరుగుతున్న సాంకేతికతను వందేభారత్ రైళ్లలో జోడించి ప్రమాదాలను తగ్గించాలనే ప్రయత్నం చేస్తోంది.
వందే భారత్ రైళ్లను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది కేంద్రంలోని మోడీ సర్కార్. ఈ ట్రైన్స్ వల్ల ప్రయాణ కాలం తగ్గుతుంది. అంతేకాదు.. రైలులో సదుపాయాలను కూడా ప్రయాణీకుల అవసరాలకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ చేస్తోంది రైల్వేశాఖ. ఇప్పుడు ప్రయాణికుల భద్రతపై మరింత ఫోకస్ పెట్టారు. ఇందుకోసం విమాన తరహా సౌకర్యాన్ని వందేభారత్‌లో తీసుకురావాలని నిర్ణయించింది. కొత్తగా తయారు చేసే వందే భారత్ రైళ్లలో విమానంలో ఉండే బ్లాక్‌బాక్స్‌ను అమర్చుతున్నారు. దీనిని ..సీసీఆర్ వీసీగా పిలుస్తారు. పశ్చిమబెంగాల్‌లోని చిత్తరంజన్ లోకోమోటివ్ కోచ్ ఫ్యాక్టరీలో మొదటిసారిగా ఈ తరహా ఇంజిన్లను తయారు చేస్తున్నారు. అక్కడ ప్రస్తుతం నాలుగు వందేభారత్ రైలు ఇంజిన్లను తయారుచేస్తున్నారు. ఇంజిన్లను తయారుచేసిన తర్వాత... వాటిని చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ పంపి పరీక్షిస్తారు. ఈ ప్రక్రియ సెప్టెంబర్‌లో జరుగుతుంది.
వందేభారత్‌లో అమరుస్తున్న బ్లాక్‌బాక్స్.. లోకో పైలట్ కదలికలను గమనిస్తుంది. ఆడియో, వీడియోలను రికార్డు చేసి భద్రపరుస్తుంది. రైలు ఏదైనా ప్రమాదానికి గురైతే ఈ బ్లాక్‌బాక్స్‌లోని సమాచారం ఆధారంగా ప్రమాదానికి గల కారణాలను గుర్తిస్తారు. మరోసారి అలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. కొత్తగా రూపొందిస్తున్న వందేభారత్ రైలులో బ్లాక్‌బాక్స్ తరహా సౌకర్యం... ప్రయాణికుల భద్రతకు ఉపయోగపడుతుందని చెప్తున్నారు.
ఇదికాగ... ఇంకా కొత్త ఫీచర్‌లు కూడా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది ప్రయాణికుల భద్రత కోసం ఏర్పాటు చేస్తున్న డిస్క్ బ్రేక్ సిస్టమ్. దీని కారణంగా ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు ప్రయాణిస్తే ఆటోమేటిక్‌గా అవి ఆగిపోతాయి. ఇక కొత్తగా రూపొందించే రైళ్లలో రెండు ఇంజన్లు ఉండనున్నాయి. వీటి వల్ల... ఇవి ముందుకు, వెనక్కు ప్రయాణించేందుకు వీలుగా ఉంటాయి. రెండు ఇంజిన్లను ఒక పైలట్ మాత్రమే నియంత్రించగలిగేలా చేస్తున్నారు. 24 ప్యాసింజర్ కోచ్‌లను లాగగలిగే సామర్థ్యం ఈ ఇంజిన్లకు ఉంటుంది. అంతేకాదు.. ఆధునిక సాంకేతికతతో కూడిన ఎయిర్ కండిషన్ డ్రైవర్ క్యాబిన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే, ఈ క్యాబిన్లో టాయిలెట్ సౌకర్యం లేదు. వందేభారత్ రైళ్ల రంగులను కూడా మారుస్తున్నారు. వైట్ కలర్‌లో ఉండటం వల్ల మురికి ఎక్కువగా కనిపిస్తోందని... కాషాయ రంగులోకి మార్చారు. ఇక, కొత్త వందే భారత్ ఇంజిన్లను.. ఆ కోచ్‌ను పోలి ఉండేలా వివిధ రంగులలో తయారుచేస్తున్నారు. కొత్త ఫీచర్స్ అన్నీ అందుబాటులోకి వస్తే... వందేభారత్ రైళ్లలో ప్రయాణికులు మరింత సురక్షితంగా ప్రయాణించే అవకాశం ఉంటుంది. త్వరలోనే అత్యాధునిక టెక్నాలజీతో అందుబాటులోకి రానున్నాయి వందేభారత్ రైళ్లు. ప్రయాణికుల భద్రత కోసం... భవిష్యత్‌లో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని కూడా చెప్తున్నారు రైల్వే అధికారులు.